రాష్ట్రంలో 76.36% ఓట్లు మ్యాపింగ్‌ | 86 constituencies have mapping levels below the state average | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో 76.36% ఓట్లు మ్యాపింగ్‌

Jun 18 2026 3:46 AM | Updated on Jun 18 2026 3:46 AM

86 constituencies have mapping levels below the state average

ఇంటింటి సర్వే ప్రారంభం నాటికి మొత్తం 4.16 కోట్ల ఓట్లలో 3.17 కోట్ల ఓట్లు మ్యాపింగ్‌

ఇంటింటి సర్వేలో మ్యాపింగ్‌ కాని 98.39 లక్షల ఓట్లే కీలకం

89.38 శాతంతో మొదటి స్థానంలో అనకాపల్లి జిల్లా

66.55 శాతంతో చివరి స్థానంలో నిలిచిన నెల్లూరు జిల్లా

రాష్ట్ర సగటుకంటే మ్యాపింగ్‌ తక్కువైన నియోజకవర్గాలు 86 

94.58 శాతం మ్యాపింగ్‌తో తొలి స్థానంలో మాడుగుల నియోజకవర్గం

సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)లో అత్యంత కీలకమైన మ్యాపింగ్‌ ప్రక్రియలో రాష్ట్రంలో అనకాపల్లి జిల్లా మొదటి స్థానంలో నిలవగా, నెల్లూరు జిల్లా చివరి స్థానంలో ఉంది. ఇంటింటి సర్వే ప్రారంభమయ్యే నాటికి 90 శాతం మ్యాపింగ్‌ పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, 76.36 శాతం ఓట్లను మాత్రమే మ్యాపింగ్‌ చేయగలిగారు. 2024 ఓటర్ల జాబితాలో ఉన్న ఓట్లను 2002లో జరిగిన సర్‌ ఓటర్ల జాబితాతో సరిపోల్చడాన్ని మ్యాపింగ్‌ అంటారు. మ్యాపింగ్‌ అయిన ఓటర్లు ఎన్యూమ­రేషన్‌ ఫారంలు పూర్తి చేసి ఇస్తే చాలు.. ఆ ఓట్లన్నీ కొనసాగుతాయి. 

2024 ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 4,16,27,694 మంది ఓటర్లు ఉంటే అందులో 76.36 శాతం ఓట్లు మ్యాపింగ్‌ అయ్యాయి. మ్యాపింగ్‌ కాని 98,39,351 ఓట్లే ఇప్పుడు కీలకం కానున్నాయి. మ్యాపింగ్‌ కాని ఓటర్లు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన 11 ధృవీకరణ పత్రాల్లో ఏదో ఒకటి ఇచ్చి ఓటరుగా నమోదు చేసుకోవాలి. అంతేకాదు మ్యాపింగ్‌ అయితే ఇంటింటి సర్వేలో ఎన్నికల సంఘమే ఎన్యూమరేషన్‌ ఫారం పూర్తి చేసి ప్రింట్‌ కాపీతో ఓటరు ఇంటికి వస్తుంది. 

కేవలం దానిపైన సంతకం చేసి, ఈ మధ్యే తీసుకున్న ఒక ఫొటో ఇస్తే సరిపోతుంది. మ్యాపింగ్‌ కాకపోతే ఖాళీ ఎన్యూమరేషన్‌ ఫారాన్ని ఇస్తారు. దాంట్లో అన్ని వివరాలు పూర్తి చేసి ధృవీకరణ పత్రం ఇస్తే వాటిని పరిశీలించి మీరిచ్చిన వివరాలతో అధికారులు సంతృప్తి చెందితేనే ఓటు కొనసాగుతుంది. అందుకనే ఇప్పుడు మ్యాపింగ్‌ కాని 98.39 లక్షల ఓట్లపై రాజకీయపార్టీలు ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి.

ఆ 86 నియోజకవర్గాలు కీలకం
89.38 శాతం ఓట్లను మ్యాపింగ్‌ చేయడం ద్వారా అనకాపల్లి జిల్లా మొదటి స్థానంలో నిలిస్తే, 66.55 శాతం మ్యాపింగ్‌తో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. అదే నియో­జకవర్గాల విషయానికి వస్తే అనకాపల్లి జిల్లా మాడు­గుల నియోజకవర్గం 94.58 శాతం మ్యాపింగ్‌తో మొదటి స్థానంలో నిలవగా, 94.50 శాతంతో కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రెండోస్థానంలో నిలిచింది. నెల్లూరు గ్రామీణ నియో­జకవర్గంలో మొత్తం ఓట్లలో కేవలం 50.11 శాతం ఓట్లు మాత్రమే మ్యాపింగ్‌ అయ్యాయి. 

ఇక్కడ సగం ఓట్లు మ్యాపింగ్‌ కాకపోవడంతో సుమారు 1,40,836 మంది ఓటర్లు వారికి వారు ఓటరుగా నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 76.36 శాతం ఓట్లు మ్యాపింగ్‌ అయితే 86 నియోజకవర్గాల్లో ఈ సగటు కంటే తక్కువగా మ్యాపింగ్‌ జరిగింది. దీంతో ఓట్లు నిల­బెట్టుకోవడంలో ఈ 86 నియోజకవర్గాలు అత్యంత కీలకం కానున్నాయి. తొమ్మిదికిపైగా నియో­జకవర్గాలు 90 శాతం పైగా మ్యాపింగ్‌ పూర్తి కావడంతో అక్కడ ఓట్ల తొలగింపు సంఖ్య తక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement