ఇలా చేద్దాం 'సర్‌' | Sakshi special article to raise awareness about Special Intensive Revision | Sakshi
Sakshi News home page

ఇలా చేద్దాం 'సర్‌'

Jul 5 2026 4:50 AM | Updated on Jul 5 2026 4:50 AM

Sakshi special article to raise awareness about Special Intensive Revision

‘సర్‌’పై అవగాహనకు ‘సాక్షి’ ప్రత్యేక కథనం

ఓటరూ చైతన్యం కావాలి

ఎన్యూమరేషన్‌ ఫారాన్ని లోపాలు లేకుండా నింపాలి

జూలై 24లోగా ఆ ఫారాన్ని తిరిగివ్వాలి

ముసాయిదా జాబితా ప్రచురణ జూలై 31

ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ

ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్‌)– 2026లో భాగంగా గత నెల 25న రాష్ట్రంలో ఓటర్ల గణన ప్రక్రియప్రారంభమైంది. ఇప్పటికే ‘సర్‌’ పూర్తయిన రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ఓటర్లను తొలగించడంతో రాష్ట్రంలో సైతం ఆందోళన నెలకొంది. ప్రధాన రాజకీయ పార్టీలు సైతం క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా మారి నేరుగా ఓటర్ల వద్దకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నాయి. కుల, మత, ప్రాంత, లింగ విభేదాలతో ప్రమేయం లేకుండా వయోజనులైన పౌరులందరికీ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పరిరక్షించుకోవడానికి ఓటరూ చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో ‘సర్‌’పై ఓటర్లకు అవగాహన కల్పించడానికి ‘సాక్షి’ ఇస్తున్న ప్రత్యేక కథనం ఇదీ...

1 ఎన్యూమరేషన్‌ దశ
ఫారం ఇస్తేనే ఓటు
ఓటు హక్కు పరిరక్షణకు ఓటరు వేయాల్సిన తొలి అడుగు .. ఎన్యూమరేషన్‌ ఫారాన్ని ఎలాంటి లోపాలు లేకుండా నింపి సంతకం/వేలి ముద్ర వేసి బూత్‌ స్థాయి అధికారికి(బీఎల్‌ఓ) నిర్దేశిత గడువు జూలై 24లోగా తిరిగి ఇవ్వాలి. అప్పుడే వారి పేరు ముసాయిదా ఓటర్ల జాబితాలో ప్రచురిస్తారు. ఎన్యూమరేషన్‌ ఫారం ఎలా పూరించాలి?

» బీఎల్‌ఓలు ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటరుకు రెండు ప్రతుల ఎన్యూమరేషన్‌ ఫారాలను పంపిణీ చేయడంతోపాటు ఎలా నింపాలో అవగాహన కల్పిస్తున్నారు. ఎన్యూమరేషన్‌ ఫారాన్ని మూడు విభాగాలుగా విభజించి రూపొందించగా, ఎగువ విభాగంలో సంబంధిత ఓటరు పేరు, ఎపిక్‌ సంఖ్య, చిరునామా, ఫొటో తదితర పాక్షిక వివరాలు ముద్రించి ఉంటాయి. పాత ఫొటో ముద్రించి ఉంటే కొత్త ఫొటోను అతికించడానికి ఒక బాక్స్‌ ఇదే విభాగంలో ఉంటుంది. 
»  చివరిసారిగా రాష్ట్రంలో 2002లో ‘సర్‌’ నిర్వహించి తయారు చేసిన ఓటర్ల జాబితాలో ఓటరు పేరు, బంధువు పేరు ఉంటే.. ఆ వివరాలను ఫారం మధ్యలోని రెండో విభాగంలో నింపాల్సి ఉంటుంది. తప్పొప్పులతో సంబంధం లేకుండా 2002 జాబితాలో వివరాలు ఎలా ఉంటే సరిగ్గా అలానే పూరించాలి. ఎడమవైపు కాలమ్‌లో ఓటరు, కుడి వైపు కాలమ్‌లో బంధువుకి సంబంధించి 2002 జాబితాలోని వివరాలు రాయాలి. 2002 జాబితాలో ఇద్దరిలో ఒకరి పేరే ఉంటే సంబంధిత కాలమ్‌లో ఆ వివరాలను నమోదు చేయాలి. ఇద్దరిలో ఒకరి పేరు లేకుంటే సంబంధిత కాలమ్‌ ఖాళీగా వదిలేయాలి. ఇద్దరి పేర్లూ లేకుంటే రెండు కాలమ్స్‌నూ ఖాళీగా వదిలేయాలి. 
»   ఇక కింద ఉండే మూడో విభాగంలో ఓటరు పుట్టిన తేదీ,ఆధార్‌ (ఐచ్ఛికం), మొబైల్‌ నంబర్, తండ్రి/సంరక్షకుడి పేరు– వారి ఎపిక్‌ నంబర్, తల్లి పేరు–ఆమె ఎపిక్‌ నంబర్, జీవిత భాగస్వామి పేరు–ఎపిక్‌ నంబర్‌ రాయాల్సి ఉంటుంది. ఒక ప్రతిని బీఎల్‌ఓ తీసుకుని మరో ప్రతిని రశీదుగా తన సంతకంతో తిరిగి ఓటరుకే ఇస్తారు. రశీదును భద్రంగా దాచుకోవాలి. భవిష్యత్తులో అవసరం పడొచ్చు. 

ఉమ్మడి జిల్లా, తెలంగాణ రాష్ట్రం పేర్లే రాయాలి
2002 సర్‌ ఓటర్ల జాబితాలో మీ పేరు, మీ బంధువుల పేర్లను రాసే కాలమ్స్‌లో జిల్లా రాయాల్సిన చోట ఉమ్మడి జిల్లా, రాష్ట్రం రాయాల్సిన చోట తెలంగాణ రాయాలి. అసెంబ్లీ నియోజకవర్గం రాయాల్సిన చోట 2002 నాటి అసెంబ్లీ నియోజకవర్గం పేరు రాయాలి. 2002 తర్వాత రాష్ట్రం, జిల్లాలు, నియోజకవర్గాల పునర్విభజన జరిగిన నేపథ్యంలో చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తుండ­డంతో ఎన్నికల యంత్రాంగం ఈ మేరకు స్పష్టతనిచ్చింది.

2002 జాబితాలో పేరెలా వెతకాలి?
2002 నుంచి ఒకే చిరునామాలోఉంటున్న ఓటర్లకు ఎన్యూమరేషన్‌ ఫారం నింపడంలో ఇబ్బందులు ఉండవు. 
2002 ఓటర్ల జాబితాలో వారి పేరు, బంధువుల పేర్ల వివరాలు స్థానిక బీఎల్‌ఓల వద్ద ఉంటాయి. ప్రస్తుతం కొత్త చిరునామాలో నివాసముంటున్న ఓటర్లు మాత్రం 2002లో ఎక్కడ నివాసం ఉన్నారో ఆ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో తమ పేరు, బంధువు పేర్లను అన్వేషించక తప్పదు. 2002 తర్వాత నియోజక­వర్గాల పునర్విభజన జరగడంతో వాటి సరిహద్దులతోపాటు పేర్లూ మారాయి. నాటి నియోజకవర్గం పేరు, పోలింగ్‌ బూత్‌ వివరాలతో 2002 జాబితాలో పేర్లను వెతకవచ్చు. 

ఈసీ వెబ్‌సైట్‌ (https://www.eci.gov.in)  తోపాటు సీఈఓ తెలంగాణ వెబ్‌సైట్‌  (https://ceotelangana.nic.in/SIR&2002. html) లో ‘2002 ఓటర్ల జాబితా’ను అందుబాటులో ఉంచారు. ఇక్కడ రెండు రకాల సెర్చ్‌ సౌలభ్యం కల్పించారు. నియోజకవర్గాల్లోని పోలింగ్‌ కేంద్రాల వారీగా పీడీఎఫ్‌ ఓటర్ల జాబితాలో సెర్చ్‌ చేసుకోవచ్చు. ఓటరు పేరు, ఇతర వివరాలతో సైతం పేర్లను వెతికే మరో సదుపాయం కల్పించారు.

ఓటరు అందుబాటులో లేకుంటే?
నిబంధనల ప్రకారం ఓటరే తన ఎన్యూమరేషన్‌ ఫారాన్ని నింపాలి. విద్య, ఉద్యోగాల కోసం సుదూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు మాత్రం మినహాయింపు కల్పించారు. వారి కుటుంబ పెద్ద భర్తీ చేసి 
తన సంతకంతో బీఎల్‌ఓకు తిరిగి ఇవ్వవచ్చు. 

బీఎల్‌ఓ ఎన్యూమరేషన్‌ ఫారం ఇవ్వకుంటే..
ఎన్యూమరేషన్‌ ఫారాన్నికేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌  (https:// voters.eci. gov.in) ద్వారా సమర్పించవచ్చు. అయితే, ఆధార్‌ అథెంటికేషన్‌ సదుపాయం కలిగిన ఓటర్లు మాత్రమే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోగలరు. ఇక బీఎల్‌ఓ ఎన్యూమరేషన్‌ ఫారాన్ని పంపిణీ చేయకుంటే సీఈఓ వెబ్‌సైట్‌ (https:// ceotelangana.nic. in) నుంచి తమ ప్రాంత బీఎల్‌ఓ ఫోన్‌ నంబర్‌ను తీసుకుని నేరుగా ఫోన్‌ చేయొచ్చు. ఈసీ వెబ్‌సైట్‌లో ‘బుక్‌ ఎ కాల్‌ విత్‌ బీఎల్‌ఓ’ సదుపాయాన్ని సైతం వినియోగించుకోవచ్చు. విదేశాల్లోని భారత పౌరులు ఆన్‌లైన్‌ ద్వారా ఎన్యూమరేషన్‌ ఫారాన్ని సమర్పించవచ్చు.

2 ఎన్యూమరేషన్‌ తర్వాతి దశ
ముసాయిదాలో పేరు ఉందా?
పోలింగ్‌ కేంద్రాల వారీగా సర్‌ ముసాయిదా ఓటర్ల జాబితాను జూలై 31న ప్రచురిస్తారు. ఎన్యూమరేషన్‌ ఫారాన్ని సమర్పించడంలో విఫలమైన ఓటర్లను గైర్హాజరు/నివాసం మారడం/చనిపోయిన/డూప్లికేట్‌ ఓటర్లుగా పరిగణించి వారి పేర్లను ఈ జాబితా నుంచి తొలగిస్తారు. ఇలా తొలగించిన ఓటర్ల జాబితాను సైతం పోలింగ్‌ కేంద్రాల వారీగా ప్రచురించి స్థానిక గ్రామ పంచాయతీ/వార్డు కార్యాలయంతోపాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తారు.

గరిష్టంగా ఎన్నిఅభ్యంతరాలు?
ముసాయిదాజాబితాలోని అనర్హుల పేర్ల తొలగింపునకు రాజకీయ పార్టీల బూత్‌ స్థాయిఏజెంట్ల (బీఎల్‌ఏ)తో పాటు ఇతరులెవరైనా రోజుకు 10కి మించకుండా గరిష్టంగా 30 వరకు అభ్యంతరాలను ఆగస్టు 30లోగా ఫారం–7 ద్వారా తెలపవచ్చు.

ముసాయిదాలో పేరు లేకుంటే ?
ముసాయిదా జాబితాపై అభ్యంతరాల (ఫారం–7)తో పాటు కొత్తగా ఓటర్లుగా నమోదు (ఫారం–6), వివరాల దిద్దుబాటు/చిరునామా మార్పు(ఫారం–8) కోసం జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ముసాయిదా జాబితాలో పేరు రాకపోయినా లేదా అక్టోబర్‌ 1 నాటికి 18 ఏళ్లు నిండిన/నిండనున్న యువత ఓటర్లుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

జూలై 31 నుంచి సెప్టెంబర్‌ 28 మధ్యకాలంలో ఈ దరఖాస్తులను పరిష్కరిస్తారు. ఈ ప్రక్రియలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ముసాయిదా జాబితాకు మార్పులు చేర్పులు చేసి తుది జాబితా ప్రచురిస్తారు. ముసాయిదా జాబితాలో పేరు రాకపోయినా లేదా అక్టోబర్‌ 1 నాటికి 18 ఏళ్లు నిండిన/నిండనున్న యువత ఓటర్లుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి.2002లో ఓటరు పేరు లేకుంటే? 

ఓటరు పేరు సర్‌
2002 ఓటర్ల జాబితాలో లేకపోతే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. 2002 జాబితాలో వారి తల్లిదండ్రులు/ నాయనమ్మ, తాతయ్యల పేర్లను సేకరించి ఎన్యూమరేషన్‌ ఫారంలోనిసంబంధిత కాలమ్‌లో పూరిస్తే సరిపోతుంది.

స్వీయ ధ్రువీకరణ ఎవరు ఇవ్వాలి?
కొత్తగా ఓటరుగా నమోదుకావడానికి ఫారం–6, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఓటును బదిలీ చేసుకోవడానికి ఫారం–8 దరఖాస్తును స్వీయ ధ్రువీకరణ ఫారంతోపాటు బీఎల్‌ఓకు సమర్పించాల్సి ఉంటుంది. దీనిపై సంబంధిత ఓటరే సంతకం చేయాలి. ఒకే రాష్ట్రం పరిధిలో ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి లేదా ఒకే నియోజకవర్గంలో మరో చిరునామాకి ఓటును బదిలీ చేసుకోవడానికి స్వీయ ధ్రువీకరణ అవసరం లేదు.

3 నోటీసులు/విచారణ దశ
నోటీసులు ఎవరికి ఇస్తారు?
రెండు కేటగిరీల ఓటర్లకు నోటీసులు ఇవ్వనున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా లో పేరు వచ్చినప్పటికీ, 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్‌లో తేడాలను గుర్తించిన ఓటర్లతోపాటు 2002 ఓటర్ల జాబితాలో తమతోపాటు తమ బంధువుల పేర్లు లేని ఓటర్లకు మాత్రమే ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు (ఈఆర్వోలు) నోటీసులు ఇస్తారు. నిర్దేశిత తేదీకి విచారణకు హాజరై వీరు ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 రకాల పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని తమ/తమ తల్లిదండ్రుల పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణగా ఇవ్వాల్సి ఉంటుంది.

పుట్టిన తేదీ/ప్రాంతం రుజువు చేసుకోవాల్సిందే..
నోటీసు అందుకున్న ఓటర్లు తమ/తల్లిదండ్రుల పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతాన్ని రుజువు చేయడానికి ఈసీ నిర్దేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకదానిని రుజువుగా ఈఆర్వోలు/ఏఈఆర్వోల వద్ద విచారణకు హాజరై సమర్పించాల్సి ఉంటుంది. 

1987 జూలై 1కి ముందు పుట్టిన ఓటర్లు తమ పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణపత్రం సమర్పిస్తే సరిపోతుంది.

1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్‌ 2 మధ్య పుట్టిన ఓటర్లు తమతోపాటు తమ తల్లి లేదా తండ్రికి సంబంధించిన పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సిఉంటుంది. 

2002 డిసెంబర్‌ 2 తర్వాత పుట్టిన ఓటర్లు తమతోపాటు తమ తల్లిదండ్రుల పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. 

ఆధారం కోసం ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 పత్రాలు 
1.    కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం/ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగి లేదా పెన్షనర్‌కు జారీ చేసిన గుర్తింపు కార్డు లేదా పెన్షన్‌ పేమెంట్‌ ఆర్డర్‌ 
2.    ప్రభుత్వం/స్థానిక సంస్థలు/బ్యాంకులు/ పోస్టాఫీస్‌/ఎల్‌ఐసీ/ ప్రభుత్వ రంగ సంస్థలు 01.07.1987కు ముందు జారీ చేసిన గుర్తింపు పత్రాలు 
3.    జనన ధ్రువీకరణ పత్రం 4. పాస్‌పోర్ట్‌ 
5.    గుర్తింపు పొందిన బోర్డులు/వర్సిటీలు జారీ చేసిన పదో తరగతి/విద్యా ధ్రువీకరణ పత్రాలు  
6.    ప్రభుత్వం జారీ చేసిన శాశ్వత నివాస సర్టిఫికెట్‌  7. అటవీ హక్కుల సర్టిఫికెట్‌ 
8.    ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ లేదా ఇతర కుల ధ్రువీకరణ  9. జాతీయ పౌరుల రిజిస్టర్‌ (తెలంగాణకు వర్తించదు) 
10.    రాష్ట్ర/స్థానిక సంస్థలు తయారు చేసిన కుటుంబ రిజిస్టర్‌ 
11.    ప్రభుత్వం ఇచ్చిన స్థలం/ఇంటి కేటాయింపు పత్రం 
12.    ఆధార్‌ కార్డు (గుర్తింపు ధ్రువీకరణ మాత్రమే. పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంత ధ్రువీకరణకుస్వీకరించరు)

12 రకాల పత్రాలూ లేకుంటే?
భారత పౌరులనే ఓటర్లుగా నమోదు చేయడానికి పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతంతోపాటు గుర్తింపు ధ్రువీకరణకు రుజువులు ఇవ్వాల్సి ఉంటుంది. గుర్తింపు ధ్రువీకరణకు ఆధార్‌ను స్వీకరిస్తారు. పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ కోసం మిగిలిన 11 రకాల పత్రాలనే రుజువుగా స్వీకరించనున్నారు. ఒకవేళ ఈ 11 రకాల పత్రాలూ లేని ఓటర్లు.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఇతర ధ్రువీకరణ పత్రాలనూ రుజువులుగా సమర్పించవచ్చు. అయితే ఈ పత్రాలను స్వీకరించాలా? తిరస్కరించాలా? అనే విషయంలో పూర్తి విచక్షణాధికారాన్ని ఈఆర్వోలకు ఈసీ కల్పించింది. వారిదే తుది నిర్ణయం. 

కలెక్టర్,సీఈఓకు అప్పీల్‌
విచారణలో ఈఆర్వోలు/ఏఈఆర్వోలు తీసుకున్న నిర్ణయంపై ప్రజాప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్‌ 24(ఏ) కింద 15 రోజుల్లోగా జిల్లా కలెక్టర్‌కు అప్పీల్‌ చేసుకోవచ్చు. తొలి అప్పీల్‌లో కలెక్టర్‌ తీసుకున్న నిర్ణయంపై సెక్షన్‌ 24(బీ)తోపాటు రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ ఎలక్టర్స్‌ రూల్స్, 1960లోని 27వ నిబంధన కింద 30 రోజుల్లోగా సీఈఓకు రెండో అప్పీల్‌కు అవకాశం కల్పిస్తారు.

‘సర్‌’ షెడ్యూల్‌
ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీజూన్‌ 25 నుంచి జూలై 24 వరకు
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ జూలై 31
ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, దరఖాస్తులు జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు
నోటీసుల జారీ/ విచారణ, ఎన్యూమరేషన్‌ ఫారాలు/ అభ్యంతరాలు/ దరఖాస్తుల పరిష్కారం జూలై 31 నుంచి సెప్టెంబర్‌ 28 వరకు
తుది జాబితా ప్రచురణ  అక్టోబర్‌ 1

-సాక్షి, హైదరాబాద్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement