మీ ఇంటికే వస్తున్నాం ‘సర్‌’ | Door to door survey of voters list from today | Sakshi
Sakshi News home page

మీ ఇంటికే వస్తున్నాం ‘సర్‌’

Jun 15 2026 2:22 AM | Updated on Jun 15 2026 2:22 AM

Door to door survey of voters list from today

నేటినుంచి ఓటర్ల జాబితా ఇంటింటా సర్వే.. జూలై 14 వరకు నిర్వహణ 

ప్రతి ఓటరు ఎన్యుమరేషన్‌ ఫారం పూర్తిచేసి ఇవ్వాల్సిందే 

జూలై 21న విడుదలయ్యే ముసాయిదా ఓటరు జాబితా కీలకం

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌–సర్‌)లో భాగంగా సోమవారం నుంచి ఇంటింటా సర్వే ప్రారంభం అవుతోంది. బీఎల్‌వో (బూత్‌ లెవెల్‌ ఆఫీసర్‌), రాజకీయ పార్టీలు నియమించుకున్న బీఎల్‌ఏ (బూత్‌ లెవెల్‌ ఏజెంట్‌)లతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితాల్లో పేర్లను సరిచూస్తారు. రాష్ట్రంలో 2002లో చివరిసారిగా ఎస్‌ఐఆర్‌ (సర్‌) జరిగింది. తిరిగి 24 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. 

ఇప్పటికే 13 రా­ష్ట్రాల్లో ఈ ప్రక్రియ పూర్తికాగా.. మూడో దశలో 16 రాష్ట్రాల్లో జరగనుంది. ఏపీ,తెలంగాణ, కర్ణాటక రా­ష్ట్రాల్లోనూ ఈ విడతలోనే ఓటర్ల జాబితా ప్ర­త్యేక సమగ్ర సవరణ సర్వే జరుగుతోంది. ఏపీకి చెందిన ఓటర్లలో కొందరు ఉపాధి కోసం హైదరా­బాద్, బెంగళూరు వంటి నగరాలకు వలస వెళ్లడంతో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఓటుహక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి జూన్‌ 15 నుంచి ఏపీలో జరిగే ఎస్‌ఐఆర్‌లో ఓటు హక్కును కాపాడుకునే బాధ్యత ఆయా ఓటర్లపైనే ఉంది.  

3.75 కోట్ల ఓట్లు సేఫ్‌ 
ఎస్‌ఐఆర్‌లో అత్యంత కీలకమైనది ఓటర్‌ మ్యాపింగ్‌. 2002 ఎస్‌ఐఆర్‌ తర్వాత ప్రకటించిన తుది ఓ­టరు జాబితాతో 2024 ఓటర్ల జాబితాను మ్యాపింగ్‌ చేస్తున్నారు. 2024 ఓటరు జాబితాలో ఓటుహ­క్కు ఉన్నవారు 2002 ఓటర్ల జాబితాలో ఓటుహ­క్కు కలిగి ఉండటం లేదా వారి తల్లిదండ్రులు, స­మీç­³ బంధువుల ఓటు ఉంటే వాటితో మ్యాపింగ్‌ చే­స్తారు. ఇలా మ్యాపింగ్‌ జరిగిన ఓట్లు కొ­న­సాగు­తా­యి. జూన్‌ 14న మధ్యాహ్నంతో మ్యా­పింగ్‌ను ము­గించారు. 

జూన్‌ 13 సాయంత్రం 5 గంటల వ­రకు రాష్ట్రంలో 76% ఓటర్ల మ్యాపింగ్‌ జరిగిందని, ఇది 80% దాటుతుందని అంచనా వే­సి­నట్టు రా­ష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ ‘సాక్షి’కి తెలిపారు. 2024 ఓటర్ల జాబితా ప్రకారం ఏపీలో 4,16,27,694 మంది ఓటర్లు ఉంటే.. అందులో ఇప్పటివరకు 3.75 కోట్ల మంది ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తయింది. 42 లక్షల ఓట్లు మాత్రం మ్యాపింగ్‌ కాలేదు. 

జూన్‌ 15 నుంచి ఇంటింటా జరిగే సర్వేలో ఈ 42 లక్షల మంది సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తేనే తమ ఓటుహక్కును కాపాడుకోగలుగుతారు. మ్యాపింగ్‌ పూర్తయిన వారు ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇప్పటికి రాష్ట్రంలో ఎన్నిసార్లు ఎన్నికల్లో పాల్గొన్నా.. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సందర్భంగా విధిగా ఎన్యుమరేషన్‌ ఫారం పూర్తిచేసి ఇవ్వాల్సిందే. ఆ ఫారాలు సకాలంలో ఇచ్చిన వారి ఓట్లు మాత్రమే కొనసాగుతాయి. 

ఎన్యుమరేషన్‌ ఫారం, ఫొటో తప్పనిసరి 
సర్‌ ప్రక్రియలో బీఎల్‌వో కీలకపాత్ర పోషించనున్నారు. ప్రతి పో­లింగ్‌ బూత్‌కు ఒక బీఎల్‌వోను  నియమించారు. ఏపీలో 46,397 మంది బీఎల్‌వో­లున్నా­రు. మీ బీఎల్‌వో ఎవరన్నది సులభంగా తెలుసుకోవచ్చు. voters.eci.gov.in లేదా ఈసీఐనెట్‌ యాప్‌లో ‘నో యువర్‌ బీఎల్‌వో’ లేదా ‘బుక్‌ ఏ కాల్‌ విత్‌ బీఎల్‌వో’ ఆప్షన్‌ వినియోగించుకోవడం ద్వారా మీ బీఎల్‌వో పేరు, ఫోన్‌ నంబర్‌ తెలుసుకోవచ్చు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవారు బీ­ఎల్‌వోను సంప్రదించి ముందస్తుగా మీ ఇంటికి వచ్చే తేదీని తెలుసుకుంటే ఆ సమయానికి ఓటర్లు అక్కడ ఉండి ఓటును  కాపాడుకో­వ­చ్చు.

ఇంటింటా సర్వే సమయంలో బీఎల్‌వో ప్ర­తి ఓటరుకు ఎ­న్యుమరేషన్‌ ఫారం ఇస్తారు. మ్యా­పింగ్‌ పూర్తయిన ఓటర్‌ వివరాలను ముద్రించిన ఎన్యుమరేషన్‌ ఫా­రం ఇస్తారు. దానిపై ఈ మధ్యనే తీయించుకున్న ఒక కలర్‌ ఫొటో అతికించి ఇస్తే సరిపోతుంది. మ్యాపింగ్‌ పూర్తికాని వారికి ఖాళీ ఎన్యుమరేషన్‌ ఫారం ఇస్తారు. ఆధార్, మొబైల్‌ నంబర్‌తో పాటు తల్లి/తండ్రి లేదా సమీప బంధువుల ఓటరు ఐడీ నంబర్లను అందులో పేర్కొనాలి. 

మ్యాపింగ్‌ కానివారు కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన 11 ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి విధిగా సమర్పించాల్సి ఉంటుంది. ఇలా ఇచ్చిన సమాచారంతో బీ­ఎల్‌వో సంతృప్తి చెందితేనే మీ ఓటు కొనసాగుతుంది. 2002 ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో అన్నది  https:// voters. eci. gov. in/  అనే వెబ్‌సైట్‌లో ‘సెర్చ్‌ యువర్‌ నేమ్‌ ఇన్‌ లాస్ట్‌ ఎస్‌ఐఆర్‌’ అనే ఆప్షన్‌ను క్లిక్‌ చేసి చూసుకోవచ్చు. 

ముసాయిదా ఓటర్ల జాబితాయే కీలకం  
ఇంటింటా సర్వే పూర్తయిన తర్వాత జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఈ జాబితా ప్రతి బీఎల్‌వో దగ్గర ఉంటుంది.    http:// www. ceoandhra. ap. gov. in/  నుంచి డౌన్‌లోడ్‌ చేసి చూసుకోవచ్చు. ఈ  జాబితాలో మీ ఓటు ఉందో లేదో ప్రతి ఒక్కరు విధిగా సరిచూసుకోవాలి. ఈ జాబితాలో మీ పేరు లేకపోతే వెంటనే అభ్యంతరం వ్యక్తం చేయండి. 

ఈ అభ్యంతరాలను ఆగస్టు 20లోపే స్వీకరిస్తారు. ఇలా వచ్చిన అభ్యంతరాలను సెప్టెంబర్‌ 18లోగా పరిష్కరించి సెప్టెంబర్‌ 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. అభ్యంతరాలను వ్యక్తం చేయడానికి 3 రకాల ఫా­రా­లు ఉంటాయి. జూలై 1లోగా మీకు 18 ఏళ్లు నిండినా.. కొత్తగా ఓటరుగా నమోదు కాకపోతే ఫారం–6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అలాగే చనిపోయిన లేదా వలస వెళ్లిన వారిని ఓట్లు ఉంటే వాటిని తొలగించడానికి ఫారం–7, జాబితాలో ఓటు లేకపోయినా.. వేరే చోటుకు ఓటు బదలాయించడానికి ఫారం–8ని ఉపయోగించాలి. 

ఈ తేదీలను గుర్తుంచుకోండి
» జూన్‌ 15 నుంచి జూలై 14 వరకు బీఎల్‌వోలు సర్వే కోసం ఇంటింటికీ వస్తారు 
» జూలై 21న ముసాయిదా జాబితా విడుదల 
» ఆగస్టు 20 వరకు అభ్యంతరాల స్వీకరణ 
» సెప్టెంబర్‌ 18లోగా అభ్యంతరాల పరిష్కారం 
» సెప్టెంబర్‌ 22న తుది ఓటర్ల  జాబితా విడుదల 
» జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హులు.

మ్యాపింగ్‌ కానివారు వీటిలో ఏదో ఒక ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి
1. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందిన ఉద్యోగి లేదా పెన్షన్‌ వంటి ఏదైనా గుర్తింపు కార్డు 
2. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు, బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎల్‌ఐసీ, పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్లు జారీ చేసిన గుర్తింపు కార్డులు లేదా ధ్రువీకరణ పత్రాలు 
3. జనన ధ్రువీకరణ పత్రం 
4. పాస్‌పోర్టు 
5. విశ్వవిద్యాలయాలు లేదా సంబంధిత బోర్డులు జారీ చేసిన విద్యార్హత కార్డులు 
6. సంబంధిత రాష్ట్రాలు జారీ చేసిన శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం 
7. అటవీ హక్కులకు చెందిన పత్రం 
8. సంబంధిత శాఖలు జారీ చేసిన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు 
9. నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ 
10. రాష్ట్ర, స్థానిక అథారిటీలు జారీ చేసిన ఫ్యామిలీ రిజిస్టర్‌ 
11.    ప్రభుత్వం జారీ చేసిన భూమి, గృహ కేటాయింపుల సర్టిఫికెట్‌ 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement