కేవలం ఓటరు గుర్తింపు ధ్రువీకరణకే ఆధార్ కార్డు
పౌరసత్వ ధ్రువీకరణకు రుజువుగా అది కుదరదు
2025 సెప్టెంబర్‌లోనే ఎన్నికల సంఘం స్పష్టీకరణ
పుట్టిన ప్రాంతం ధ్రువీకరణకు నోటీసులొస్తే ఆధార్ పనికి రాదు
ఈసీ నిర్దేశించిన మిగతా 11 పత్రాల్లో ఏదో ఒకటి ఉండాలి
లేకపోతే ఓటర్లకు పొంచి ఉన్న ఇబ్బందులు
ఇప్పటికే సర్ జరిగిన రాష్ట్రాల్లో కోట్లాది మందికి ఇక్కట్లు
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)–2026 ప్రక్రియలో భాగంగా పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం రుజువు చేసుకోవాలని నోటీసులు అందుకున్న ఓటర్లు ఆధార్ కార్డు సమర్పిస్తే సరిపోతుందా?.. ఏమాత్రం కాదంటోంది కేంద్ర ఎన్నికల సంఘం. నోటీసులు అందుకున్న ఓటర్లు తమ పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతాన్ని రుజువు చేయడానికి 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుందని ఈసీ తెలిపింది. అందులో 12వ ధ్రువీకరణ పత్రంగా ఆధార్ కార్డును చేర్చినా దానిని కేవలం ఓటరు గుర్తింపు నిర్ధారణ కోసమే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. ‘ఓటరు గుర్తింపు ధ్రువీకరణ కోసమే ఆధార్ కార్డును స్వీకరించి వాడాలి, పౌరసత్వ ధ్రువీకరణ కోసం కాదు’... అని పేర్కొంటూ ఈసీ 2025 సెప్టెంబర్ 9న మార్గదర్శకాలు జారీ చేసింది. కాగా ఆధార్ చట్టంలోని సెక్షన్ 9 సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందని ఈ సందర్భంగా ఈసీ తెలిపింది. ఈ నేపథ్యంలో పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతంపై అనుమానాలతో నోటీసులు అందుకున్న ఓటర్లు అందుకు రుజువుగా ఆధార్ కార్డు సమర్పిస్తే సరిపోదని అధికార వర్గాలు వివరిస్తున్నాయి. ఈసీ నిర్దేశించిన తొలి 11 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని తప్పనిసరిగా ఇవ్వక తప్పదని స్పష్టం చేస్తున్నాయి.
ఇబ్బందులు తప్పవా..?: నిరుపేదలు, నిరక్షరాస్యులు, మారుమూల ప్రాంతాల్లో నివసించే ఆదివాసుల వద్ద ఈ పత్రాలు ఉండే అవకాశాలు చాలా తక్కువే. విచారణ సమయంలో ఇలాంటి పౌరులు తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడకతప్పదని తెలుస్తోంది. ‘సర్’తొలి విడత నిర్వహించిన బిహార్‌లో 47 లక్షలు, రెండో విడత జరిగిన మరో 12 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 5.2 కోట్ల ఓటర్లను ఈసీ తొలగించింది. నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణ(అడ్జుడికేషన్) దశలో ఈసీ నిర్దేశించిన పత్రాలను అందజేయకపోవడంతో తొలగించిన ఓటర్ల పేర్లే ఇందులో అధికంగా ఉన్నాయి.
వీరికి నోటీసులు..
ముసాయిదా ఓటర్ల జాబితాలో స్థానం పొందినప్పటికీ సర్–2002 జాబితాతో మ్యాపింగ్ కాకపోయినా, ఒక వేళ మ్యాపింగ్ జరిగినప్పటికీ పేర్లు, ఇతర వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నా.. వారిని జూలై 31 –సెప్టెంబర్ 28 మధ్య కాలంలో నోటీసులిచ్చి విచారణకు పిలుస్తారు. అప్పుడు ఈసీ నిర్దేశించిన 11 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని తమ పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతానికి రుజువుగా సమర్పించాల్సి ఉంటుంది. ఓటరు గుర్తింపు విషయంలో అనుమానాలున్న పక్షంలోనే ఆధార్ కార్డును రుజువుగా స్వీకరిస్తారు. సర్–2002 జాబితాలోని ఓటర్ల పేర్లు, ఇతర వివరాలతో పోల్చితే ప్రస్తుత ఓటర్ల జాబితాలోని పేర్లు, వివరాల్లో చిన్న చిన్న వ్యత్యాసాలున్నా సాఫ్ట్‌వేర్ గుర్తించనుంది. దీంతో ఆయా ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నారు.
ఒక ఓటుకు ఇద్దరు, ముగ్గురి ధ్రువీకరణ పత్రాలు
జెన్‌జీతో పాటు 1987 తర్వాత పుట్టిన మిలినియల్స్ ఓటర్లు తమ ఒక్కరి ఓటు హక్కును కాపాడుకోవడానికి ఇద్దరు లేదా ముగ్గు వ్యక్తులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించక తప్పదు. 1987 జూలై 1కి ముందు పుట్టిన ఓటర్లు తమ పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే సరిపోతుంది. 1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్ 2 మధ్య పుట్టిన ఓటర్లు తమతో పాటు తమ తల్లి లేదా తండ్రికి సంబంధించిన పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అంటే వీరు ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. 2002 డిసెంబర్ 2 తర్వాత పుట్టిన ఓటర్లు తమతో పాటు తమ తల్లిదండ్రులిద్దరి పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. వీరు మొత్తం మగ్గురు వ్యక్తుల పుట్టిన తేదీ/ప్రాంతం ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది.
నోటీసులు అందితే ఈ కింది పత్రాల్లో ఏదో ఒకటి ఇవ్వాల్సిందే...
1. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం/ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగి లేదా పెన్షనర్‌కు జారీ చేసిన గుర్తింపు కార్డు లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్
2. 01.07.1987కు ముందు ప్రభుత్వం/స్థానిక సంస్థలు/బ్యాంకులు/పోస్ట్ ఆఫీస్/ఎల్‌ఐసీ/ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా జారీ చేసిన గుర్తింపు పత్రాలు
3. జనన ధ్రువీకరణ పత్రం
4. పాస్‌పోర్ట్
5. గుర్తింపు పొందిన బోర్డులు/విశ్వవిద్యాలయాలు జారీ చేసిన విద్యా సర్టిఫికెట్లు
6. శాశ్వత నివాస సర్టిఫికెట్
7. అడవి హక్కుల సర్టిఫికెట్
8. ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ లేదా ఇతర కుల ధ్రువీకరణ పత్రం
9. జాతీయ పౌరుల రిజిస్టర్ (అందుబాటులో ఉన్న చోట్ల)
10. రాష్ట్ర/స్థానిక సంస్థలు తయారు చేసిన కుటుంబ రిజిస్టర్
11. ప్రభుత్వం జారీ చేసిన భూమి/ఇంటి కేటాయింపు పత్రం
12. ఆధార్ కార్డు (కేవలం గుర్తింపు నిర్ధారణ కోసమే)


