రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణకు షెడ్యూల్ ప్రకటన
మూడో విడత కింద తెలంగాణ, ఏపీతోపాటు పలు రాష్ట్రాల్లో ‘సర్’ నిర్వహణ
షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం
జూన్ 14 నుంచి మొదలుకానున్న ప్రక్రియ..
జూన్ 25–జూలై 24 మధ్య ఇంటింటా సర్వే
రాష్ట్రంలో 2026 అక్టోబర్ 1 అర్హత తేదీగా ఓటర్ల జాబితా తయారీ
ఆ రోజు నాటికి 18 ఏళ్లు నిండిన/నిండనున్న పౌరులు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు చాన్స్
‘సర్’ ప్రక్రియలో మ్యాపింగ్ జరగకపోతే ఇబ్బందులే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్/సర్) కార్యక్రమం చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్‌ను ప్రకటించింది. తొలి విడతలో బిహార్, రెండో విడతలో మరో ఆరు రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్ నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా మూడో విడత కింద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మొత్తం 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ‘సర్’ నిర్వహించనుంది. తెలంగాణలో 2026 అక్టోబర్ 1ని అర్హత తేదీగా పరిగణిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. అంటే ఆ రోజుకు 18 ఏళ్లు నిండిన/నిండనున్న పౌరులందరూ ఓటర్లుగా నమోదు కావడానికి అర్హత కలిగి ఉంటారన్నమాట.
ఇదీ షెడ్యూల్..: ఈసీ షెడ్యూల్ ప్రకారం..రాష్ట్రంలో వచ్చే జూన్ 15–24 మధ్యకాలంలో దరఖాస్తులు, మెటీరియల్ ముద్రణ, సిబ్బందికి శిక్షణ వంటి చర్యలు తీసుకుంటారు. జూన్ 25–జూలై 24 మధ్య బూత్ స్థాయి అధికారులు (బీఎస్‌ఓలు) ఇంటింటా తిరిగి ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియను నిర్వహిస్తారు. ఇందుకోసం ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తారు. ఈ ప్రక్రియలో బీఎల్‌ఓలకు ఆయా రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్‌ఏ) సహకరించాలని ఎన్నికల సంఘం సూచించింది. జూలై 31న ‘సర్’ ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలతో పాటు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. జూలై 31 నుంచి సెపె్టంబర్ 28 మధ్యకాలంలో ఈ దరఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరించడంతో పాటు మ్యాపింగ్ సరిపోలని అనుమానిత ఓటర్లకు నోటీసులు జారీ చేసి ఈఆర్‌ఓ (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్)ల ఆధ్వర్యంలో విచారణకు పిలుస్తారు. అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. రాష్ట్రంలో ఈ నెల 12 నాటికి 3,39,20,705 మంది ఓటర్లు ఉండగా, 35,985 మంది బీఎల్‌ఓలు, 25,886 మంది బీఎల్‌ఏలు ‘సర్’ ప్రక్రియలో పాల్గొననున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
60 శాతమే మ్యాపింగ్ పూర్తి!
సాధారణంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఎస్‌ఆర్) పేరుతో ప్రతి ఏటా జనవరిలో కొత్త ఓటర్ల జాబితాను ప్రచురించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అనేక చోట్ల ఓట్లు ఉన్న వలస ఓటర్ల డూప్లికేట్ ఓట్లను, మరణించిన ఓటర్ల పేర్లను తొలగించడానికి ‘సర్’ను చేపట్టినట్టు ఎన్నికల సంఘం పేర్కొంటోంది. చివరిసారిగా 2002లో ఉమ్మడి ఏపీలో ‘సర్’ నిర్వహించగా, రెండు దశాబ్దాల విరామం తర్వాత ఈ ఏడాది మళ్లీ నిర్వహిస్తున్నారు. ‘సర్’ 2026 కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత ఓటర్ల జాబితాలోని పేర్లను.. ‘సర్’ 2002 జాబితాలోని వారి పేర్లు/ తల్లిదండ్రులు/తాత అమ్మమ్మల పేర్లతో మ్యాపింగ్ చేస్తున్నారు. అంటే ప్రస్తుత ఓటర్ల జాబితాలో ఉన్న వారిలో ఎవరెవరు .. 2002 జాబితాలో వారి పేర్లు గానీ వారి తల్లిదండ్రులు/తాత అమ్మమ్మల పేర్లు గానీ కలిగి ఉన్నారో గుర్తించి మ్యాపింగ్ చేస్తున్నారు. సర్ 2002 జాబితా ప్రకారం తెలంగాణలో నాడు మొత్తం 2.25 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కాగా ప్రస్తుత ఓటర్ల జాబితాలోని 60 శాతం మంది పేర్లను మాత్రమే ఇప్పటివరకు 2002 జాబితాతో మ్యాపింగ్ చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా హైదరాబాద్ మహానగరంతో పాటు పట్టణ ప్రాంతాల్లో మ్యాపింగ్ ప్రక్రియలో పురోగతి లేదు. మ్యాపింగ్ జరగని ఓటర్లకు ‘సర్’ 2026లో ఇబ్బందులు తప్పవు. సర్–2002 జాబితాను స్థానిక బీఎల్‌ఓలతో పాటు సీఈఓ కార్యాలయం వెబ్‌సైట్(https:// ceotelangana.nic.in)తో పాటు ఎన్నికల సంఘం వెబ్‌సైట్ (https:// voters.eci.gov.in)లో అందుబాటులో ఉంచారు.
ప్రతి ఇంటికీ బీఎల్‌ఓలు
సర్వేలో భాగంగా జూన్ 25–జూలై 24 మధ్య బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరుకు సంబంధించి ముందే ముద్రించిన ఎన్యూమరేషన్ ఫామ్ రెండు ప్రతులను అందజేస్తారు. ఆన్‌లైన్ నుంచి కూడా ఓటర్లు ఈ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. భర్తీ చేసిన ఒక ప్రతిని బీఎల్‌ఓలకు అందజేయాల్సి ఉంటుంది. మరో ప్రతిని స్వీకరణ రశీదుగా నమోదు చేసి ఓటరు వద్దే ఉంచుతారు. 2002 జాబితాలో తమ ఓటు ఉందా? లేక తమ తల్లిదండ్రులు/తాతఅమ్మమ్మల పేర్లు ఉన్నాయా ? వంటి వివరాలను ఈ ఫారంలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో బీఎల్‌ఓలు ఓటర్లకు సహకరిస్తారు. ఎన్యూమరేషన్ దశలో ఓటర్లు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు. గడువులోగా ఎన్యూమరేషన్ ఫారం సమర్పించని ఓటర్లకు.. జూలై 31– ఆగస్టు 30 మధ్య అభ్యంతరాలు, దరఖాస్తుల సమయంలో మరో అవకాశం కల్పిస్తారు. వారు కొత్తగా ఓటరుగా నమోదు కోసం ఫామ్–6 దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. దీనితో పాటు నియోజకవర్గం లోపల/బయట నివాసం మారిన ఓటర్లు/ వివరాల దిద్దుబాటు/కొత్త ఎపిక్‌కార్డు/ దివ్యాంగ ఓటరుగా గుర్తింపు కోసం ఇదే సమయంలో (ఫారం–8) దరఖాస్తు చేసుకోవచ్చు.
మ్యాపింగ్ జరగని ఓటర్లకు నోటీసులు
పూర్తి వివరాలు ఇవ్వని ఓటర్లతో పాటు 2002 జాబితాలో పేర్లు లేని/సరిపోల్చలేని ఓటర్లకు జూలై 31 నుంచి సెపె్టంబర్ 28 మధ్యకాలంలో నోటీసులు జారీ చేసి నిర్దిష్ట తేదీన స్థానిక ఈఆర్‌వో)/ఏఈఆర్‌ఓల వద్ద విచారణకు పిలిపిస్తారు. అప్పుడు తమ అర్హతలను రుజువు చేసే ఆధారాలను సంబంధిత ఓటర్లు సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం నిర్దేశించిన పత్రాల్లో ఏదో ఒకదానిని వారు ఆధారంగా సమర్పించాల్సి ఉంటుంది.
కలెక్టర్, సీఈఓకు అప్పీల్ అవకాశం...
విచారణలో ఈఆర్వోలు/ఏఈఆర్వోలు తీసుకున్న నిర్ణయంపై ప్రజాప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్ 24(ఏ) కింద జిల్లా కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోవచ్చు. తొలి అప్పీల్‌లో కలెక్టర్ తీసుకున్న నిర్ణయంపై సెక్షన్ 24(బీ)తో పాటు రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్, 1960లోని 27వ నిబంధన కింద రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ)కు రెండో అప్పీల్ చేయవచ్చు.


