కర్నూలులోని టీడీపీ కార్యాలయం వద్ద ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ చేస్తున్న బీఎల్‌వోలు
ఎన్యూమరేషన్ ఫారాలు అందక ఓటర్ల గగ్గోలు
అన్ని జిల్లాల్లోనూ అదే పరిస్థితి.. వైఎస్సార్‌సీపీ ఓటర్లే టార్గెట్
ప్రతిపక్షపార్టీ సానుభూతిపరులైన ఓటర్లకు అందని ఫారాలు
ఫారాలు ఇవ్వడం లేదంటూ పలుచోట్ల నిరసనలు
టీడీపీ కార్యాలయాల్లో, నాయకుల ఇళ్లల్లో బీఎల్‌వోలు
వారు చెప్పినవాళ్లకే ఎన్యూమరేషన్ ఫారాలు
అందరూ ఒకే ఇంట్లో ఉన్నా.. కొందరికే ఓటుపత్రాలు
పూర్తి చేసిన ఫారాల డిజిటలైజేషన్ కూడా పాక్షికమే..
నిజమైన ఓట్లు లేకుండా చేయడమే లక్ష్యం..
దొంగ ఓట్లు చేర్చడానికే ఈ కుట్రలు
గడువు సమీపిస్తుండడంతో అందరిలోనూ ఆందోళన
తగినంత సమయమివ్వాలని, సమస్యలన్నీ సరిచేయాలని విజ్ఞప్తులు
టీడీపీ బీఎల్‌ఏను కలవమంటున్నారు..
ఓటు వివరాలు కావాలంటే టీడీపీ బీఎల్‌ఏను కలవాలని మా బీఎల్‌వో చెబుతున్నాడు. మా ఇంటికి ఇంత వరకు బీఎల్‌వోనే రాలేదు. ఎన్యూమరేషన్ ఫామ్ కూడా టీడీపీ బీఎల్‌ఏ దగ్గరే తీసుకున్నా. ఎలా పూర్తిచేయాలో తెలియక ఎన్యూమరేషన్ ఫారం తిరిగి ఇవ్వలేదు. ఓటర్ల జాబితాలన్నీ తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరే ఉన్నాయి.
– ఎ.కృష్ణ, బొల్లవరం, కల్లూరు మండలం, కర్నూలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ అస్తవ్యస్తంగా సాగుతోంది. ‘మాకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇంకా అందలేదు మహాప్రబో అని ఓటర్లు గగ్గోలు పెడుతుంటే.. అధికారులు మాత్రం అంకెల్లో వందశాతాలు చూపిస్తూ సంబరపడుతున్నారు. ఫారాల పంపిణీ మొదలు డిజిటలైజేషన్ వరకు అంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జరుగుతున్నాయి. చాలామంది బీఎల్‌వోలు టీడీపీ నాయకులకు ఈ ఫారాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. టీడీపీ నాయకుల ఇళ్లు, టీడీపీ కార్యాలయాలే బీఎల్‌వోల కార్యక్షేత్రాలుగా మారిపోయాయి. ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులైన ఓటర్లలో ఎవరికి ఫారాలు ఇవ్వాలి? ఎవరిని మినహాయించాలనేది టీడీపీ నాయకులే బీఎల్‌వోలకు నిర్దేశిస్తున్నారు. ఎందుకంటే చాలాచోట్ల వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులకు ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలే అందలేదు. ఫారాలు ఇప్పించాలంటూ ఎమ్మార్వో కార్యాలయాల వద్ద ఆందోళనలు జరుగుతున్నాయి. నిజమైన ఓటర్లకు ఓట్లు లేకుండా చేయాలన్న కుట్రతో పాటు పనిలో పనిగా దొంగఓట్లు చేర్పించే దుర్మార్గానికి కూడా అక్కడక్కడా పసుపు చొక్కా నాయకులు పూనుకుంటున్నారు. ఓటర్లకు రెండు ఫారాలు ఇచ్చి పూర్తి చేసిన ఫారం తీసుకుని ఎక్‌నాలెడ్జ్‌మెంట్ ఫారం వారికే తిరిగి ఇవ్వాలన్న పద్ధతిని బీఎల్‌వోలు ఎక్కడా పాటించడం లేదు. నిరక్షరాస్యులైన ఓటర్లకు వివరాలు నింపడంలో సాయపడాల్సిన బీఎల్‌ఓలు చాలామంది ఆ పనిని గాలికి వదిలేశారు. దాంతో చాలాచోట్ల ఓటర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడువు సమీపిస్తున్నా ఇంకా ఫారాలు అందలేదు.. అందిన ఫారాల డిజిటలైజేషన్ సగం కూడా జరగలేదు.. ఈ నేపథ్యంలో సర్ గడువు పొడిగించాలని, అవకతవకలన్నీ సరిచేయాలని ఓటర్లు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజాస్వామికవాదులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సర్ జరుగుతున్న తీరిలా ఉంది...
దొంగ ఓట్లు చేర్చే కుట్ర
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల కనుసన్నల్లో బీఎల్‌వోలు పనిచేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దొంగ ఓట్ల నమోదులో పచ్చ నేతలకు వీరు సహకరిస్తున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండలం కమ్మవారిపాళెం పంచాయతీ మజరా విజయనగరంలో ఎక్కువ మంది వలస వెళ్లారు. దీంతో ఇక్కడ కేవలం 15 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో నలుగురు మృతి చెందడంతో ఈ సంఖ్య 11కు చేరింది. అయితే టీడీపీ నేతలతో స్థానిక బీఎల్‌వో కుమ్మక్కై అక్కడ 76 ఓట్లున్నట్లుగా చూపుతున్నారు. దొంగఓట్లు చేర్చే కుట్ర జరుగుతుండటంతో వైఎస్సార్‌సీపీ నేతలు అడ్డుకున్నారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో కార్పొరేషన్ ఉద్యోగులను అధికార పార్టీ నేతల కార్యాలయంలోనే కూర్చోబెట్టి ఓటర్ల చేర్పులు చేయిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
టీడీపీ నాయకుడి ఇల్లే బీఎల్‌వో కార్యాలయం
కర్నూలు జిల్లాలో బీఎల్‌వోలు ఇంటింటికీ తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు అందించడం లేదు. ఎక్కడో ఒకచోట కూర్చుంటున్నారు. వారిని వెతికి పట్టుకోవడానికి ఓటర్లు నానా తిప్పలు పడుతున్నారు. ఆదోనిలో టీడీపీ నాయకుడి ఇల్లే బీఎల్‌వో కార్యాలయం. ఎవరైనా సరే అక్కడికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారం తెచ్చుకోవలసిందే. కర్నూలులోనూ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే బీఎల్‌వోలు కూర్చుంటున్నారు. జిల్లాలో వలస వెళ్లిన కూలీల ఫారాలన్నీ అందుబాటులో లేకుండా చేశారు. ఓటరు జాబితా నుంచి వారిని తొలగించడానికి సర్వం సిద్ధం చేశారు.
‘సర్’ ప్రక్రియలో పసుపు యానిమేటర్లు
అనంతపురం జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఉరవకొండ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో, డిజిటలైజేషన్ ప్రక్రియలో వెలుగు యానిమేటర్లు కనిపిస్తున్నారు. అధికార పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఓ అధికారి ఆదేశాలతోనే యానిమేటర్లు ఈ పనిలోకి వచ్చారని అంటున్నారు. ప్రస్తుతం వెలుగు యానిమేటర్లందరూ అధికార పార్టీకి చెందిన వారేనన్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రక్రియ సజావుగా జరుగుతుందా.. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ జరుగుతుందా లేక ప్రతిపక్షాలకు చెందిన ఫారాలు గల్లంతవుతాయా అన్నా అనుమానాలున్నాయి.
ఎన్యూమరేషన్ జిరాక్స్‌లు ఎందుకు ‘తమ్ముడూ’?
కళ్యాణదుర్గంలోని 70, 71 పోలింగ్ కేంద్రాల వద్ద ఓ టీడీపీ కార్యకర్త ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాల జిరాక్స్‌లు తీసుకుంటూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు పట్టుబడ్డాడు. తాను బీఎల్‌వోనని, గతంలో ఇక్కడి బీఎల్‌వో సరిగా పనిచేయకపోవడంతో తనను నియమించారని చెప్పి తప్పించుకోబోయాడు. గట్టిగా నిలదీయడంతో ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలన్నీ తీసుకురావలసిందిగా స్థానిక టీడీపీ నేత డిష్ మురళి చెప్పాడని బయటపెట్టాడు. అంటే ఆ ఫారాలన్నీ పరిశీలించి ఏవేవి తీసేయాలో చెప్పేందుకు టీడీపీ నాయకులు పన్నిన కుట్రన్న మాట. బీఎల్‌వోలను పిలిపించేలోపు ఆ కార్యకర్త అక్కడి నుంచి పరారయ్యాడు. అతడు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలోని రాకెట్ల గ్రామానికి చెందినవాడని తెలిసింది.
ఇంట్లో అందరికీ ఫారాలు ఇవ్వరా?
శ్రీకాకుళం జిల్లాలో 98 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగిపోయిందని అధికారులు చెబుతున్నారు. కానీ శ్రీకాకుళం నగరంలోని చాలా ఏరియాల్లోకి అసలు బీఎల్‌వోలు అడుగేపెట్టలేదు. జిల్లాలో చాలాచోట్ల ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ విషయంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఒక ఇంటిలో ఐదుగురు ఓటర్లుంటే ముగ్గురికే ఫారాలు ఇచ్చారు. మిగిలిన ఇద్దరికీ మళ్లీ తెచ్చి ఇస్తామని చెప్పి మాయమయ్యారు. చాలాచోట్ల అక్‌నాలెడ్జ్‌మెంట్‌లా ఉంచాల్సిన ఫారాన్ని కూడా బీఎల్‌వోలు తీసుకెళ్లిపోతున్నారు. రెండు ఫారాలు వాళ్లే తీసుకుపోతే మనకు ఇక ఆధారమేమి ఉంటుందని కొందరు ఓటర్లు చర్చించుకుంటున్నారు. తిరుపతి నగరంలోని 36వ డివిజన్‌లో ఒక ఇంట్లో 8మంది ఓటర్లు ఉంటే ముగ్గురికి, చెన్నారెడ్డి కాలనీలో ముగ్గురు ఉంటే ఇద్దరికే ఫారాలు ఇచ్చి మిగిలిన వారిని వదిలేశారు.
సర్వం గందరగోళం.. సర్..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సర్ ప్రక్రియ సర్వం గందరగోళంగా తయారయ్యింది. శని, ఆదివారాలలో బీఎల్‌వోలు బూత్‌లలో అందుబాటులో ఉంటారని అధికారులు ప్రకటించినా ఎక్కడా బీఎల్‌వోలు కనిపించలేదు. చాలా చోట్ల బూత్‌లకు తాళాలేసి ఉన్నాయి. తెరిచి ఉన్న బూత్‌లలో సిబ్బంది ఎవరూ లేరు.
⇒ తూర్పుగోదావరి జిల్లాలో సామాన్య ఓటర్లకు అవగాహన లేకపోవడంతో ఎన్యూమరేషన్ ఫారాల్లో వివరాలు నమోదు చేయలేకపోతున్నారు. ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్ ఫారాలు నింపడంలో ఓటర్లకు బీఎల్‌వోలు సహకరించడం లేదు. రాజమండ్రి నగరంలో నేటికీ 25 శాతం కంటే తక్కువగా డిజిటలైజేషన్ జరిగింది.
⇒ వైఎస్సార్ కడప జిల్లాలో ఎన్యూమరేషన్ పత్రాలు పూరించడం తెలియక ఓటర్లు తికమక పడుతున్నారు. సర్వర్లు మొరాయించడం వంటి కారణాల వల్ల డిజిటైజేషన్ ప్రక్రియ ఈనెల 14వ తేది నాటికి పూర్తి కాదని, గడువు పొడిగించాలని పలువురు కోరుతున్నారు.
⇒ ఉమ్మడి విశాఖ జిల్లాలో బీఎల్‌వోలు అందుబాటులో లేకపోవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం, ఆదివారం స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించినా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించలేదు. విశాఖ తూర్పు, ఉత్తర, గాజువాక, చోడవరం, పాయకరావుపేట, అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచిలి నియోజకవర్గాల్లో బీఎల్‌వోల కోసం ప్రజలు ఎదురు చూపులు చూడాల్సి వచ్చింది. అల్లూరి జిల్లాలోని అరకు, పాడేరు నియోజకవర్గాల్లోనూ ఎన్యూమరేషన్ ఫారాలు అందరికీ అందలేదు
⇒ చిత్తూరు నగరంలోని 32వార్డు సచివాలయంలో పనిచేసే బీఎల్‌వోలు, ఓటర్లపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నంద్యాల విశ్వనగర్ టీడీపీ కార్యాలయంలో సర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బీఎల్‌వో, అధికారులు
వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులే టార్గెట్
⇒ పల్నాడు జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పలు అనుమానాలకు తావిస్తోంది. చాలామంది వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడం లేదు. నూజెండ్ల మండలం వి అప్పాపురం గ్రామంలో బూత్ నంబర్లు 286, 287 పరిధిలో 22 మంది వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వలేదు. దీనిపై వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏలు నూజెండ్ల మండల ఎంఆర్‌ఓకు సమస్యను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. చాలాచోట్ల బీఎల్‌వోలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎన్యూమరేషన్ పత్రాలను అధికార పార్టీ నేతలకు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. ఇళ్లకు వెళ్లకుండా స్థానిక రాజకీయ నాయకుల ఇళ్ల వద్ద కూర్చుని ఫారాలు పూర్తి చేస్తున్నారు.
⇒ బాపట్ల జిల్లాలోనూ చాలాచోట్ల వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులకు ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదు. మార్టూరులోని 21, 22, 23 వార్డులలో అధిక శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు. అందులో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఇళ్లను బీఎల్‌వోలు మినహాయించారు. కానీ ‘సాక్షి’లో కథనం రావడంతో బీఎల్‌వోలు హడావిడిగా శని, ఆదివారాల్లో ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. అలాగే పర్చూరు, చీరాల నియోజకవర్గాలలోనూ వందలాదిమంది వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు తమకు ఫారాలు అందలేదని చెబుతున్నారు. వేమూరు నియోజకవర్గంలోనూ ఫారాల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. ఇంట్లో అందరికీ ఫారాలు ఇవ్వడం లేదు. కొంతమందికి ఇచ్చి మిగిలినవారికి మళ్లీ తెస్తామని బీఎల్‌వోలు చెబుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే కలెక్టర్ మాత్రం జిల్లాలో 100 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగిపోయిందని చెబుతున్నారు.
నంద్యాల 6వ వార్డులో టీడీపీ నాయకుడితో కలిసి ఓటర్ల జాబితాను పరిశీలిస్తున్న ఎన్నికల అధికారులు
⇒ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు మండలం శ్రీరామవరం 80వ బూత్‌లో వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులకు ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదు. దీంతో వారు దెందులూరులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఏలూరు రూరల్ మండలం గుడివాకలంక గ్రామంలో 800మంది వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులకు ఎన్యూమరేషన్ ఫారాలు అందించలేదు. అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లో బీఎల్‌వోలు పనిచేస్తుండటంపై ఫారాలు అందనివారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
⇒ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ సరిగా జరగడం లేదు. చాలాచోట్ల అధికార టీడీపీ నేతలతో కుమ్మక్కై ఫారాలను వారి చేతికి అప్పగించి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. నగరి మున్సిపాలిటీ 10వ వార్డులో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించాలని టీడీపీ నాయకులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. జీడీ నెల్లూరు పరిధిలోని గంగమాంబపురంలో ఫారాలన్నీ టీడీపీ నేతలకు బీఎల్‌వోలు అప్పగించగా, వారు తమకు అనుకూలమైన ఓటర్ల వివరాలను మాత్రమే ఆన్‌లైన్ చేస్తున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
⇒ గుంటూరు జిల్లాలో గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 1వ వార్డు 92 బూత్‌లో సల్మా భాను అనే బీఎల్‌వో 600కి పైగా ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు ఇవ్వకుండా తన దగ్గరే ఉంచుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా బూత్‌ల్లో పర్యటిస్తుండగా ఈ విషయం బయటపడింది. దీనిపై నిలదీస్తే ఆ బీఎల్‌వో దురుసుగా సమాధానం చెప్పారు. 
ఓట్ల తొలగింపుపై నూజండ్ల తహసీల్దార్ రమేష్‌కుమార్‌కు వినతిపత్రం అందిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు
ఫారాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగలేకపోతున్నాం
ఫారాలివ్వడానికి బీఎల్‌వోలు ఎవరూ ఇళ్లకు రావడం లేదు. సచివాలయాల చుట్టూ తిరగలేకపోతున్నాం. ఫోన్ చేస్తే సచివాలయానికో, మరో ప్రాంతానికో రమ్మని చెబుతారు. వెళ్లినా అక్కడ ఉండడం లేదు. రోజువారీ పనులు వదులుకుని ఆఫీసుల చుట్టూ తిరగటం మా వల్ల కావడం లేదు. మేం ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరగాలో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా మా ప్రాంతానికి వచ్చి ఫారాలు అందజేయాలని కోరుతున్నాం.
– బాబు, పాలసముద్రం మండలం, చిత్తూరు జిల్లా
వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందిపడుతున్నారు
సర్ ప్రక్రియలో బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారం పంపిణీ, స్వీకరణ చేయాలి. అయితే మా పంచాయతీలో బీఎల్‌వోలు ఇళ్లకు రావడం లేదు. సచివాలయానికి రావాలని ఓటర్లకు చెబుతున్నారు. దీంతో సచివాలయానికి వెళ్లలేక, వ్యయప్రయాసలకోర్చి అక్కడవరకూ వెళ్లినా అక్కడ ఎదురు చూడలేక చాలామంది వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారు.
– జమాల్, మాజీ సర్పంచ్, సింగవరం పంచాయతీ, అనంతపురం జిల్లా
ఐదుసార్లు ఓటు వేశాను.. ఇప్పుడు ఓటు లేదంటున్నారు
మేం కనిగిరి బీసీ కాలనీలో ఉంటున్నాం. మా ఇంట్లో 9 మంది ఓటర్లం ఉన్నాం. మా స్వగ్రామం మార్కాపురం మండలం మేకలవారిపల్లి గ్రామం. నేను సుమారు 35 ఏళ్ల క్రితం కనిగిరికి వచ్చాను. కనిగిరి నియోజకవర్గంలో ఇప్పటికి ఐదుసార్లు ఓటు వేశాం. భారత ఎన్నికల సంఘం ఇచ్చిన ఓటరు గుర్తింపు కార్డును రెండుసార్లు పొందాను. అన్ని ఆధారాలతో ఎన్యూమరేషన్ ఫారం తీసుకుని వెళ్లి బీఎల్‌వో ఆంజనేయులును కలిశాను. 2002 జాబితాలో నీ పేరు కనిపించడం లేదు. మీ నాన్న, మీ బంధువుల ఆధారాలు తీసుకుని రా.. లేదంటే.. నీ ఓటు ఫారంను రిజక్ట్ చేస్తాను అని బీఎల్‌వో చెప్తున్నాడు. మీ నాన్న ఓటు వివరాలు, బూత్ నంబర్ కని్పంచలేదని బీఎల్‌వో దబాయిస్తున్నాడు. ఎన్నికల అధికారులు నాకు న్యాయం చేయాలి.
– చల్లా ఏడుకొండలు, కనిగిరి, మార్కాపురం జిల్లా
ఓటరు లిస్టులో పేరు లేదంటున్నారు
నాకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చారు. కానీ ఇçప్పుడు బీఎల్‌వో ఓటరు లిస్టులో నా పేరు లేదంటున్నారు. ఎన్నో ఏళ్లుగా వేస్తున్న ఓటు లేదంటే ఎలా? ఫారం పూర్తిచేసి ఇచ్చినా డిజిటలైజేషన్ కాలేదు. పక్క గ్రామంలో కూడా ఓటరు లిస్టులో పేరు కోసం వెతికించా. అక్కడా కనిపించలేదంటున్నారు. ఊరూరా తిరిగే ఓపిక లేదు. ఒంటరి వృద్ధురాలిని. నా ఓటు తీసేయడానికే లిస్టులో లేదంటున్నారా? అసలు నా ఓటు ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా?
– కురబ రమణమ్మ, చేనేతనగర్, కురబలకోట మండలం, అన్నమయ్య జిల్లా
ఫారం నింపడానికి బీఎల్‌వో సాయం చేయడం లేదు
ఎన్యూమరేషన్ ఫారంలో వివరాలు ఎలా నింపాలో అర్థం కావడం లేదు. బీఎల్‌వోలు ఎవరూ సాయం చేయడం లేదు. తండ్రి పేరుతో పాటు తాత, నాన్నమ్మ, అమ్మమ్మ పేర్లు, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, వారి ఓటరు గుర్తింపు కార్డు
నంబర్లు అడుగుతున్నారు. నేను పెద్దగా చదువుకోకపోవడంతో ఆ వివరాలు ఎలా నింపాలో అర్థంగాక నింపడం లేదు. 2002 ఓటరు జాబితా వివరాలు నింపాలంటే ఆ లిస్ట్ ఎక్కుడుందో తెలియడం లేదు.
– భీమన వీరబాబు, క్వారీ మార్కెట్, బూత్ నంబర్ 30, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా
ఫారాలు ఇవ్వకుండా ఆన్‌లైన్ చేసేశామంటున్నారు
సర్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఓటర్‌కు రెండు ఫారాలు ఇచ్చి వాటిని నింపిన తర్వాత ఒకటి ఓటర్ దగ్గర ఉంచి ఇంకొకటి బీఎల్‌వో తీసుకొని ఆన్‌లైన్ చేయాలి. అప్పుడే ఆ ఓటర్ ఎన్యూమరేషన్‌లో పాల్గొన్నట్లు అవుతుంది. రేపు ఓటు గల్లంతైతే ఓటరు అడగడానికి వీలు కలుగుతుంది. ఓటరు దగ్గర ఫారం లేకపోతే తన ఓటు గురించి అడిగే హక్కు ఎలా ఉంటుంది? మైలవరం నియోజకవర్గంలో చాలా బూత్‌లలో ఓటర్లకు ఫారాలు ఇవ్వకుండా వివరాలు తీసుకొని ఆన్‌లైన్ చేసేశామని చెబుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఉన్నతాధికారులు స్పందించి ప్రతి ఓటరుకు ఫారాలు అందేలా చూడాలి.
– వేములకొండ విష్ణు, జి.కొండూరు, ఎన్టీఆర్ జిల్లా


