‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ను సమర్థించిన సుప్రీంకోర్టు
స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు జీవం వంటిదని వ్యాఖ్య
పౌరసత్వాన్ని నిర్ధారించే అధికారం ఈసీకి లేదని స్పష్టీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ అమలు చేస్తున్న ఓటరు జాబితా ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ ప్రక్రియ చట్టబద్ధమైన ప్రక్రియ అని స్పష్టం చేసింది. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు ఇది జీవ నాడి వంటిదని వ్యాఖ్యానించింది. వివిధ రాష్ట్రాలు ముఖ్యంగా బిహార్, బెంగాల్‌లలో చేపట్టిన సర్‌పై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన ఈ తీర్పును ఎన్నికల కమిషన్ సాధించిన ఘన విజయంగా భావిస్తున్నారు.
సర్ ప్రజాప్రాతినిధ్య చట్టం–1960లోని నిబంధనలకు ఏమాత్రం విరుద్ధం కాదని తేల్చిచెప్పింది. ప్రజాస్వామ్య ప్రక్రియ విశ్వసనీయత ఓటరు జాబితా కచ్చితత్వంపైనే ఆధారపడి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఈ ప్రక్రియను కేవలం పరిపాలనా పరమైన సౌలభ్యం కోసం చేపట్టినట్లుగా తాము నిర్థారించలేకపోతున్నామని తెలిపింది.
ఎన్నికల కమిషన్ తన అధికార పరిధిని దాటి వ్యవహరించిందనే వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం..ఎన్నికలను నిష్పక్షపాతంగా జరపాలన్న రాజ్యాంగం నిబంధనలకు సర్ ప్రాణం పోస్తుందని వ్యాఖ్యానించింది. అయితే, ఓటరు జాబితా సవరణ ద్వారా ఒక వ్యక్తి పౌరసత్వాన్ని అంతిమంగా నిర్ధారించే అధికారం మాత్రం ఈసీకి లేదని స్పష్టం చేసింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ తదితరుల పిటిషన్లపై జనవరిలో విచారణ ముగించిన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ధర్మాసనం ఈ మేరకు బుధవారం 124 పేజీల సవివర తీర్పు వెలువరించింది.
జాబితా ప్రక్షాళన ఈసీ అధికారమే
ఓటర్ల జాబితాలో ఒకసారి పేరు నమోదైన తర్వాత, దానిపై మళ్లీ కొత్తగా విచారణ జరిపి పేర్లను తొలగించే అధికారం ఎన్నికల సంఘానికి ఉండదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. జాబితా సవరణ పేరుతో ఈసీ చేపట్టిన తొలగింపులు నిబంధన 21ఏకు విరుద్ధమని వారన్నారు. అలాగే, ఓటరు నమోదు, ధ్రువీకరణలకు సంబంధించి పత్రాల పరిశీలన కోసం ఈసీ విధించిన నిబంధనలు ఏకపక్షంగా ఉన్నాయని, వీటి కారణంగా ఎందరో ఓటు హక్కును కోల్పోతున్నారని తెలిపారు.
వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికల సంఘం చర్యలను సమర్థించింది. ఓటరు జాబితాలో పేరు ఉండటం ఒక గుర్తింపే అయినప్పటికీ, దాన్ని మళ్లీ పరిశీలించకూడదన్న నియమం ఏదీ లేదని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియను, ఓటర్ల జాబితాను పారదర్శకంగా ఉంచేందుకు ఇలాంటి సవరణలు (ఎస్‌ఐఆర్) చేపట్టే పూర్తి అధికారం ఈసీకి ఉంటుందని వ్యాఖ్యానించింది.
పత్రాల పరిశీలనకు ఈసీ విధించిన నిబంధనలు పరీక్షకు నిలబడతాయని, అవి పూర్తిగా సహేతుకమైనవేనని తెలిపింది. అయితే, ఒక వ్యక్తి పౌరసత్వంపై ఈసీ కేవలం ప్రాథమిక విచారణ మాత్రమే చేయగలదని, పౌరసత్వాన్ని అంతిమంగా నిర్ధారించే అధికారం ఆ సంస్థకు లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈసీ తీసుకునే నిర్ణయం కేవలం ఎన్నికల ప్రయోజనాలకు మాత్రమే పరిమితం అవుతుందని, పౌరసత్వ చట్టం కింద సదరు వ్యక్తులు తమ హక్కులు కోల్పోయినట్లు భావించరాదని ధర్మాసనం స్పష్టం చేసింది.
అనుమానిత కేసులన్నీ అథారిటీకే
సర్‌లో ముందుగా ఈసీ నోటీసులిచ్చి, సంబంధిత వ్యక్తుల నుంచి వివరణ తీసుకునే విధానాన్ని పాటించినందున ఈ ప్రక్రియ చట్టబద్ధంగా అమలైందని ధర్మాసనం తుది తీర్పులో పేర్కొంది. అయితే, 2003 జాబితా నుంచి భారత పౌరులు కారు అనే కారణంతో తొలగింపునకు గురైన వారి కేసులన్నిటినీ నాలుగు వారాల్లోగా పౌరసత్వ చట్టం–1955 కింద ఏర్పాటు చేసిన ‘కాంపిటెంట్ అథారిటీ’కి తప్పనిసరిగా పంపాలని ఆదేశించింది.
ఆ అథారిటీ చట్టబద్ధంగా విచారణ జరిపి వారు భారత పౌరులే అని తేల్చితే, ఆ పేర్లను తిరిగి జాబితాలో చేర్చాలని స్పష్టం చేసింది. మరణించినవారు, వలస వెళ్లిన వారు లేదా నకిలీలు అనే కారణాలతో పొరపాటున జాబితా నుంచి తొలగింపునకు గురైన వారు న్యాయ సమీక్ష ద్వారా ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేసే అవకాశం కూడా ఉందని ధర్మాసనం వివరించింది.
పౌరసత్వానికి ఆధార్ ధ్రువీకరణ కాదు
సర్ కోసం ఎన్నికల కమిషన్ అమలు చేసిన ధ్రువీకరణ పత్రాల విధానాన్ని ధర్మాసనం సమర్థించింది. ఎన్నికల సంఘం అనుమతిస్తున్న డాక్యుమెంటేషన్ ప్రమాణాలపై అభ్యంతరాలను ధర్మాసనం కొట్టివేసింది. ఓటర్ల జాబితాల తయారీ ఒక యాంత్రిక ప్రక్రియ కాదు, అదొక ప్రాథమిక రాజ్యాంగబద్ధమైన విధి అని తీర్పు నొక్కి చెప్పింది. నివాసం, అర్హత వంటి చట్టబద్ధమైన నిబంధనల నిర్ధారించే హక్కు ఈసీకి ఉందని పేర్కొంది. అదేవిధంగా, ఆధార్ పౌరసత్వానికి రుజువు కాదని కూడా తెలిపింది. 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య (ఆధార్) చట్టం ప్రకారం ఆ కార్డును పౌరసత్వానికి, స్థానికతకు నిరూపణగా పరిగణించలేమని స్పష్టం చేసింది.
ఓటు హక్కుకు అవసరమైన చట్టబద్ధ అర్హతగా దీనిని పరిగణించకపోవడంలో ఈసీ నిర్ణయం సరైందేనని పేర్కొంది. ఒక వ్యక్తి గుర్తింపును ధ్రువీకరించే పరిమిత ప్రయోజనం కోసం మాత్రమే ఆధార్‌ను ఉపయోగించాలని తెలిపింది. ఓటర్ల ముమ్మర సర్వే కోసం నిర్దేశించిన పత్రాల జాబితా నుంచి రేషన్ కార్డులను మినహాయిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని ధర్మాసనం సమర్థించింది. సర్ ప్రక్రియకు అనుగుణంగా రేషన్ కార్డుల స్థానంలో మరింత విశ్వసనీయమైన పత్రాలను కోరడం, కొన్ని రకాల పత్రాలను మార్చడం వంటి విచక్షణాధికారాలు ఈసీకి ఉన్నాయని తీర్పులో పేర్కొంది.
తీర్పు ముఖ్యాంశాలు
→ బిహార్‌లో చేపట్టిన సర్ ప్రక్రియ ప్రజా ప్రాతినిధ్య చట్టం–1960 నిబంధనలకు విరుద్ధంగా లేదు. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల నిబంధనలకు భంగం కలిగించడం లేదు.
→ ప్రస్తుతం నిర్వహించిన సర్ ప్రక్రియ, చట్ట పరమైన అవసరాలకు అనుగుణంగానే ఉంది. సాధించాల్సిన లక్ష్యానికి అనుగుణంగానే ఈ చర్యలు ఉన్నాయి. ఇవి హేతుబద్ధమైనవి. ఏకపక్షంగా ఎవరినీ ఓటర్ల జాబితా నుంచి తొలగించకుండా నిరోధించడానికి తగు రక్షణ విధానాలు ఇందులో ఉన్నాయి.
→ ఓటర్ల జాబితా సమగ్రతను కాపాడేందుకే కొన్ని రకాల పత్రాల వర్గీకరణ, కొన్ని వర్గాల పత్రాల మినహాయింపు స్పష్టమైన ప్రమాణాల ఆధారంగానే నిర్ణయించారు.
→ ఓటర్ల జాబితాలో చేర్చడానికి కావలసిన అర్హతను నిర్ధారించే క్రమంలో పౌరసత్వంపై పరిమితమైన విచారణ చేపట్టే అధికారం ఈసీకి ఉంది. అయితే, ఇటువంటి విచారణ పౌరసత్వాన్ని పూర్తిగా నిర్ధారించే ప్రక్రియ మాత్రం కాదు.
→ ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించిన వారు తమ ఫిర్యాదులను నాలుగు వారాల్లోగా పౌరసత్వ చట్టం పరిధిలోని సంబంధిత అథారిటీకి ఎన్నికల సంఘం రిఫర్ చేయాలి.
→ ఆయా కేసులపై సంబంధిత అథారిటీ చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలి. వీలైతే తదుపరి పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలలో ఏది ముందుగా జరిగితే దానికి ముందే నిర్ణయం ప్రకటించాలి. అలాగే, ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన వ్యక్తులకు ముందుగా నోటీసు ఇచ్చి, వారి వాదనలు వినడానికి తగిన
అవకాశం కల్పించాలి.
→ ఒకవేళ సదరు అథారిటీ విచారణ తర్వాత తొలగింపునకు గురైన వారు భారత పౌరులేనని తేలితే వారి పేర్లను తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చాలి.
ఎవరు ఓటేయాలో నిర్ణయించేది బీజేపీయే: యోగేందర్ యాదవ్
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పిటిషనర్లలో ఒకరైన యోగేందర్ యాదవ్ స్పందించారు. తీర్పు తనకు ఆశ్చర్యం కలిగించలేదన్నారు. ఇలాంటి తీర్పు వస్తుందని తాను ముందే ఊహించానన్నారు. అందుకే, తీర్పు సమయానికి తాను కోర్టుకు వెళ్లలేదని చెప్పారు. సర్ రాజ్యాంగబద్ధతను పరిశీలించడం వదిలేసి, ఫిర్యాదుల పరిష్కారం, మధ్యవర్తిత్వంపైనే న్యాయస్థానం దృష్టి సారించినప్పుడే తనకీ విషయం అర్థమైందని చెప్పారు. ఇకపై ఎవరు ఓటేయాలో, ఎవరు ఓటేయ కూడదో నిర్ణయించేది బీజేపీనంటూ ఆయన ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. అసలు వాస్తవమేమంటే.. ఈ తీర్పు లక్షలాది మంది పౌరుల ఓటు హక్కును రద్దు చేయడానికి అనుమతి ఇవ్వడం. ఇప్పటివరకు కనీసం 5.9 కోట్ల మంది పౌరులు ఓటు హక్కు కోల్పోయారు. ఇది మున్ముందు 10 కోట్లకు పెరిగే అవకాశముందని పేర్కొన్నారు.
సుప్రీం తీర్పుతో సమాధానాలకు మించి ప్రశ్నలు: కాంగ్రెస్
సర్‌కు రాజ్యాంగబద్ధతను కట్టబెడుతూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో సమాధానాల కంటే ప్రశ్నలే ఎక్కువ ఉత్పన్నమవుతున్నాయని కాంగ్రెస్ పేర్కొంది. ఈ తీర్పుతో తాము గౌరవప్రదంగా ఏకీభవించడం లేదని తెలిపింది. ‘సర్‌కు అనుమతి ప్రాథమికంగా ఒక చట్టబద్ధతను చేకూర్చవచ్చు. కానీ, దాని అమలులోని దురుద్దేశాన్ని ఎంతమాత్రం సరిదిద్దలేదు’అని పేర్కొంది. సర్ ప్రక్రియను ఈసీ అమలు చేసిన తీరుపై తాము లేవనెత్తిన అనేక ప్రశ్నలను న్యాయస్థానం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని తెలిపింది. పౌరసత్వంపై నిర్ణయం తీసుకునే హక్కు ఈసీకి లేదని ఈ తీర్పు స్పష్టం చేసినప్పటికీ ఈసీ ఇప్పటికే పౌరసత్వం ప్రాతిపదికన ప్రజలను ఓటర్ల జాబితా నుంచి మినహాయించడం పరస్పర విరుద్ధం కాదా? అని ప్రశ్నించింది.


