ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులనే దెబ్బతీస్తున్నారు
ఎస్‌ఐఆర్‌ను ఆపేయాలి లేదా తప్పులను సరిదిద్దాలి
పొరపాట్లకు ఈసీయే పూర్తి బాధ్యత వహించాలి
సీఈసీకి రాసిన లేఖలో సీఎం మమత డిమాండ్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) ప్రక్రియపై సీఎం మమతా బెనర్జీ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే భారీగా ఓట్లు తొలగింపునకు గురయ్యే ప్రమాదముందన్నారు. అదే జరిగితే, ప్రజాస్వామ్య పునాదులపైనే దెబ్బకొట్టినట్లవుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏకపక్షంగా, తప్పులతడకగా కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ను వెంటనే నిలిపివేయాలన్నారు.
ఈ మేరకు ఆమె తాజాగా ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు మరో లేఖ రాశారు. ఎటువంటి ప్రణాళిక, సన్నద్ధత లేకుండా ఎన్నికల కమిషన్ హడావుడిగా చేపట్టిన ఎస్‌ఐఆర్‌తో తీవ్రమైన అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలు, పరిపాలనాపరమైన తప్పిదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నవంబర్ 20, డిసెంబర్ 2వ తేదీల్లో రాసిన లేఖలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో క్షేత్రస్థాయిలో మరిన్ని ఘోరమైన తప్పిదాలకు తావిచ్చినట్లయిందని మమత ఆరోపించారు.
సరైన శిక్షణ ఇవ్వలేదు
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పాల్గొంటున్న అధికారులకు సరైన శిక్షణ లేదని, ఓటర్ల జాబితా సవరణకు వాడుతున్న సాఫ్ట్‌వేర్, ఐటీ వ్యవస్థలు సరైనవి కావని సీఎం మమత పేర్కొన్నారు. విధుల్లో ఉన్న సిబ్బందికి సరైన, ఒకే విధమైన శిక్షణ ఇవ్వలేదని ఆరోపించారు. అంతేకాదు, ఎన్నికల సంఘం జారీ చేస్తున్న ఆదేశాలలో స్పష్టత కూడా లేదన్నారు. పరస్పర విరుద్ధ ఆదేశాల కారణంగా క్షేత్రస్థాయి సిబ్బందిలో గందరగోళం నెలకొందని తెలిపారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియపై జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ప్రణాళికా లోపం వల్ల ఈ కీలకమైన ప్రజాస్వామ్య ప్రక్రియ ఒక ప్రహసనంగా మారిందని, ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన అభ్యంతరాలను ఇకపై అయినా పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తూ మరోసారి లేఖ రాస్తున్నట్లు తెలిపారు. తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే ఈ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలా చేయకుంటే తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు.
ఐటీ వ్యవస్థల దుర్వినియోగం
ఓటర్ల నమోదు అధికారు(ఈఆర్‌వో)లకు తెలియకుండా, వారి ఆమోదం లేకుండానే ఐటి వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని ముఖ్యమంత్రి మమత ఆరోపించారు. దీనివల్ల అర్హులైన ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును కోల్పోయే ప్రమాదముందని చెప్పారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం, ఓటు తొలగించాలంటే చట్టపరమైన నిబంధనలు పాటించాలి, కానీ ఇక్కడ ఆ సరైన ప్రక్రియ అమలుకు నోచుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తొలగింపులకు ఎవరు అనుమతి ఇచ్చారు? ఏ చట్టపరమైన అధికారం కింద ఇవి జరుగుతున్నాయి? అని ప్రశ్నించారు. ఈ మొత్తం ప్రక్రియ ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలోనే జరుగుతోంది కాబట్టి, ఎటువంటి అక్రమ, ఏకపక్ష, పక్షపాత చర్యలకైనా ఎన్నికల కమిషనే పూర్తి బాధ్యత వహించాలని మమత స్పష్టం చేశారు.


