మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దు వివాదమున్న గ్రామాల్లో ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్న బీఎల్‌ఓ
‘సర్’ ఫారాలు ఎలా నింపాలో తెలియక సామాన్య, నిరక్షరాస్య ఓటర్లలో అయోమయం
కొన్నిచోట్ల బీఎల్‌ఓలకూ అంతంత మాత్రంగానే అవగాహన
రాష్ట్రవ్యాప్తంగా 85.1 శాతం పూర్తయిన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ
పూర్తి చేసిన ఫారాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయడంపై బీఎల్‌ఓలకు శిక్షణ ఇవ్వనున్న ఈసీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్)లో భాగంగా పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ఓ కొలిక్కి వస్తున్నప్పటికీ ఈ ఫారాలను నింపడం ఎలాగో తెలియక ఓటర్లు తికమక పడుతున్నారు. ఫారంలోని రెండు భాగాల్లో తమ వివరాలను ఎక్కడ నింపాలో చాలా మందికి తెలియడం లేదు. 2002 నాటి ఓటర్ల జాబితాలో పేరున్న వారు ఫారంలో ఎటువైపు వివరాలు నింపాలి.. 2002 జాబితాలో పేరు లేని వారు ఫారంలో వివరాలు ఎక్కడ నింపాలనే దానిపై గందరగోళం నెలకొనడంతో బీఎల్‌ఓలకు ఫోన్లు చేసి తెలుసుకుంటున్నారు. అలాగే కొన్నిచోట్ల వివిధ పార్టీల బీఎల్‌ఏల సహాయం తీసుకుంటున్నారు. ఓటర్ల జాబితాలో పేరున్నప్పటికీ కొన్ని చోట్ల వారు స్థానికంగా లేకపోవడం, ఫోన్ నంబర్, చిరునామా తెలియకపోవడంతో బీఎల్‌ఓలు అయోమయానికి గురవుతున్నారు.
రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా శనివారం నాటికి 2.88 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గ్రామీణ ఓటర్లు వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావడంతో ఫారాల పంపిణీ పూర్తి కావడం లేదు. పట్టణ ప్రాంతాల్లో చిరునామాలు దొరక్క ఫారాల పంపిణీలో కొంత జాప్యం జరుగుతోంది. మరోవైపు బీఎల్‌ఓలకు ఇప్పటికే రెండుసార్లు శిక్షణ ఇచ్చిన ఎన్నికల సంఘం.. ఇప్పుడు ఓటర్లు పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్‌ఓ యాప్‌లో స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను ఎలా నిర్వహించాలనే అంశంపై మరోసారి బీఎల్‌ఓలకు శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.
కొత్త కోడళ్లకు ‘సర్’ఇక్కట్లు..
కొత్తగా పెళ్లయి అత్తారింటికి వచ్చిన కొత్త కోడళ్లకు ఎన్యూమరేషన్ దరఖాస్తులు నింపడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంబంధిత మహిళ తండ్రి, తల్లి, తాత, నాయనమ్మలకు సంబంధించిన ఎపిక్ నంబర్‌ను ఫారంలో పొందుపరచడం తప్పనిసరిగా మారింది. దీంతో వారి పుట్టింటికి ఫోన్లు చేసి కనుక్కోవాల్సి వస్తోందని ఆ మహిళలు పేర్కొంటున్నారు. భర్త తరఫు వారి ఎపిక్ నంబర్లతో మ్యాపింగ్ జరిగేలా చూడాలని వారు కోరుతున్నారు.
జిల్లాల్లో పరిస్థితి ఇలా..
– ఉత్తరాది రాష్ట్రాల వలస కార్మిక ఓటర్లు ఎక్కువగా ఉండే ఉమ్మడి మెదక్ జిల్లాలోని పటాన్‌చెరు, సంగారెడ్డి వంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ తక్కువగా జరుగుతోంది. చాలా మంది అద్దెకు ఉన్న వారి ఆచూకీ కనుక్కోవడం ఇబ్బందిగా మారిందని బీఎల్‌ఓలు పేర్కొంటున్నారు.
– ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వివాహం చేసుకొని వచ్చిన మహిళల పాత (2002) ఓటరు వివరాలు సేకరించడం కష్టంగా మారింది. ముంబై, హైదరాబాద్ తదితర నగరాలకు వలస వెళ్లిన ఓటర్ల నుంచి సమాచారం, పత్రాలు పొందడం ఇబ్బందిగా మారింది.
– ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్ర–తెలంగాణ రాష్ట్రాల పరిధిలో ఉన్న కెరమెరి మండలం పరందోలి, అంతాపూర్, బోలపటార్ వంటి 11 గ్రామాల్లోని ఓటర్లు రెండు రాష్ట్రాల అధికారులు ఇచ్చిన ఫారాలను తీసుకుంటున్నారు. ఒకే రాష్ట్రంలో ఓటు హక్కు మిగిలే అవకాశం ఉండటంతో ఇరు రాష్ట్రాల బీఎల్‌ఓలు పోటాపోటీగా ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని కోల్‌బెల్ట్‌లో రిటైర్డ్ కార్మికులు తమ సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. దీంతో వారికి ఫారాల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది.
– కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, హుజురాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల్లో ఫారాలను పూర్తి చేయడంలో నిరక్షరాస్యులకు సమస్య తలెత్తుతోంది.
– ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూపాలపల్లి పట్టణంలో ఓటర్ల చిరునామాలను బీఎల్‌వోలు గుర్తించలేకపోవడంతో ఆయా వార్డుల్లో పార్టీల నేతల సహకారంతో ఫారాలను పంపిణీ చేస్తున్నారు. సింగరేణి కార్మికుల్లో కొందరికి భూపాలపల్లితోపాటు వారి స్వగ్రామాల్లోనూ ఓట్లు ఉన్నాయి. భూపాలపల్లి ఓటు హక్కును తొలగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో భూపాలపల్లి పట్టణంలో సుమారు 10 వేల వరకు ఓట్లు తగ్గే అవకాశం ఉంది.
– భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని చాలా వరకు రాజకీయ నేతలే చేపడుతున్నారు. బీఎల్‌ఓలు నామమాత్రంగా వ్యవహరిస్తున్నారు.
– ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు పట్టణాల్లో బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లకుండా తాము ఉన్న చోటకే వచ్చి ఫారాలను తీసుకెళ్లాలని చెబుతున్నారు.
అధికారుల కోసం ఎదురు చూస్తున్నాం
నాలుగు రోజుల క్రితం అధికారులు వచ్చి ఫారం ఇచ్చి వెళ్లిపోయారు. మాకు చదువు రాదు. ఫారం ఎలా నింపాలో తెలియదు. మళ్లీ అధికారులు వస్తే వివరాలు చెబుదామని ఎదురుచూస్తున్నా.
– అచ్చమ్మ, వెంకటాపురం(కె), ములుగు జిల్లా
ఫారం ఎలా నింపాలో చెప్పట్లేదు
ఫారం నింపి ఇవ్వకపోతే ఓటు పోతుందంటున్నారు. ఎలా నింపాలో మాత్రం ఎవరూ చెప్పట్లేదు. ఫారం నింపేందుకు చదువుకున్న వాళ్ల చుట్టూ తిరిగా. కానీ వాళ్లకూ అర్థంకాకపోవడంతో చివరకు బీఎల్‌ఓల దగ్గరకే వెళ్లా.
– కథలప్ప, మరికల్, నారాయణపేట జిల్లా


