కమిషనర్‌ 'సర్‌'కొత్త ఊడిగం | Nellore Commissioner Nandan also in Minister Narayanas review | Sakshi
Sakshi News home page

కమిషనర్‌ 'సర్‌'కొత్త ఊడిగం

Jun 29 2026 4:12 AM | Updated on Jun 29 2026 4:12 AM

Nellore Commissioner Nandan also in Minister Narayanas review

బీఎల్‌ఓలతో మంత్రి నారాయణ నిర్వహించిన సమీక్షకు హాజరైన నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌ నందన్‌ (ఫైల్‌)

‘పచ్చ’ సేవలో రాజ్యాంగ విలువలకు పాతర  

టీడీపీ బీఎల్‌ఏలకు టెలికాన్ఫరెన్స్‌లో దిశానిర్దేశం 

మంత్రి నారాయణ సమీక్షలోనూ నెల్లూరు కమిషనర్‌ నందన్‌ 

మై టీడీపీ యాప్‌ సూపర్‌ అంటూ కితాబు 

మొన్న ఏకంగా మంత్రి నారాయణతో బీఎల్‌ఓలకు సందేశం  

కలెక్టర్‌ నోటీసు జారీ చేసినా డోంట్‌ కేర్‌ 

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆధ్వర్యంలో నిష్పక్షపాతంగా జరగాల్సిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ నెల్లూరు నియోజకవర్గంలో గాడి తప్పుతోంది. నగర కార్పొరేషన్‌ కమిషనర్‌ నందన్‌ ఏకంగా సరికొత్త టీడీపీ నేత అవతారం ఎత్తారు. రాజ్యాంగ విలువలను కాలరాస్తూ అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నారు. టీడీపీకి మేలు చేసేలా మంత్రి నారాయణ కనుసన్నల్లో పచ్చ కండువా కప్పుకుని సర్‌ ప్రోగ్రామ్‌ను పార్టీ వ్యవహారంగా మార్చేశారు. 

బీఎల్‌ఓల సమీక్షకూ మంత్రి నారాయణను ఆహ్వానించడమే కాకుండా ఏకంగా టీడీపీకి చెందిన బీఎల్‌ఏలతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ‘సర్‌’ ప్రక్రియ వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా మై టీడీపీ యాప్‌ను పొగడ్తలతో ముంచెత్తడం కలకలం రేపింది. టీడీపీ బీఎల్‌ఏ కాన్ఫరెన్స్‌లో కమిషనర్‌ మాట్లాడిన ఆడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.   

మంత్రి కనుసన్నల్లోనే.. 
మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ కనుసన్నల్లో పనిచేస్తున్న కమిషనర్‌ కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ఏకంగా టీడీపీ అధికారిక కార్యాలయంగా మార్చేశారు. టీడీపీ బీఎల్‌ఏలకు దిశానిర్దేశం చేసే బాధ్యతను తన భుజ స్కంధాలపై వేసుకున్నారు. టీడీపీ బీఎల్‌ఏల టెలికాన్ఫరెన్స్‌లోకి లాగిన్‌ అయి వారితో తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా నిర్వహించాల్సిన బీఎల్‌ఓల సమీక్షలకు ఇటీవల మంత్రి నారాయణతోపాటు మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఆహ్వానించారు. దీనిపై  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 

మరో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా కమిషనర్‌ నందన్‌కు షోకాజు నోటీసు జారీ చేశారు. అయినా కమిషనర్‌ తీరు మారలేదు. ఆయన నోటీసును లెక్కచేయలేదు. ఏకంగా టీడీపీ బీఎల్‌ఏల సమీక్షలో పాల్గొని మై టీడీపీ యాప్‌ బహు బాగు అంటూ కితాబిచ్చారు. ఆ యాప్‌ను తాము ఫాలో అవుతున్నామని, ఓట్లు తొలగించేందుకు అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన టీడీపీ కార్యకర్త డ్యూటీ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి నారాయణ అండదండలు ఉండడంతోనే కమిషనర్‌ కలెక్టర్, ఎన్నికల కమిషన్‌ ఆదేశాలూ పాటించడం లేదన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది.  

మై టీడీపీ యాప్‌లో ఓటర్‌ వ్యక్తిగత సమాచారం  
నెల్లూరు నగర నియోజకవర్గంలో ఓటర్‌ వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ బీఎల్‌ఏలు మై టీడీపీ యాప్‌లోకి లోడ్‌ చేస్తున్నారు.  ఓటర్‌ వ్యక్తిగత సమాచారం చోరీకి కమిషనర్‌ ఆదేశాలతో బీఎల్‌ఓలే సహకరిస్తున్నారు. దీంతో వైఎస్సార్‌సీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఓట్లను తొలగించే కుట్రలో భాగంగానే ఇలా వ్యవహరిస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తోంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement