నెల్లూరు (లీగల్): నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్ విశాఖపట్నం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఈ సందర్బంగా ఆయనకు వీడ్కోలు సభను నెల్లూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్‌ను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు సత్తు అంకయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యప్పరెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస్ కృషితో కోర్టు భవనాల సుందరీకరణ పనులు, పార్కింగ్ సౌకర్యం సాధ్యమయ్యాయని కొనియాడారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ ఇక్కడ బాధ్యతలు నిర్వహించడం సంతోషాన్నిచ్చిందని, కేసుల పరిష్కారంలో సహకారం అందించిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. వివిధ కోర్టుల న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నక్కల నాగరాజు, ఉపాధ్యక్షుడు పద్మాకర్, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


