స్వాతంత్య్ర జ్వాల రగిలిన గడ్డ | - | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్ర జ్వాల రగిలిన గడ్డ

Aug 15 2026 2:03 AM | Updated on Aug 15 2026 2:03 AM

గాంధీజీ పిలుపుతో కదిలి.. ఉప్పు పిడికిలి బిగించి..
ఉప్పు కోసం కాదు.. హక్కు కోసం పోరాటం

ఉమ్మడి నెల్లూరు జిల్లా స్వాతంత్య్ర సంగ్రామంలో వీరుల గాథలు

గాంధీజీ అడుగులతో పల్లిపాడు నుంచి మైపాడు వరకు ఉద్యమ బాట

జైళ్లకు వెళ్లిన మహిళలు

విదేశీ వస్త్రాల దహనం.. బ్రిటిష్‌ చట్టాలకు బహిరంగ సవాల్‌

నేడు 80వ స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు

స్వాతంత్య్రం ఒక రోజులో దక్కిన వరం కాదు. వేలాది మంది త్యాగాలు, జైలు శిక్షలు, లాఠీ దెబ్బలు, ఆస్తుల త్యాగం, కుటుంబాలకు దూరంగా గడిపిన సంవత్సరాల ఫలితం. ఆ మహా పోరాటంలో నెల్లూరు నేలకూ ప్రత్యేకమైన స్థానం ఉంది. గాంధీజీ పిలుపుతో గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రజలు కదిలారు. విదేశీ వస్త్రాలను బహిష్కరించారు. ఖాదీని స్వీకరించారు. పాఠశాలలు, న్యాయస్థానాలను బహిష్కరించే ఉద్యమంలో పాల్గొన్నారు. చివరకు సముద్రపు నీటిని మరిగించి ఉప్పు తయారు చేస్తూ బ్రిటిష్‌ ఉప్పు చట్టానికే సవాల్‌ విసిరారు. ఈ ఉద్యమాల్లో పురుషులతో సమానంగా మహిళలు కూడా జైళ్లకు వెళ్లడం నెల్లూరు స్వాతంత్య్ర చరిత్రలో ప్రత్యేక అధ్యాయం. – సాక్షిప్రతినిధి, నెల్లూరు

సింహపురి స్వాతంత్య్ర స్ఫూర్తి జ్వాలను రగిలించిన గడ్డ. 1920లో గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమానికి అప్పటి నెల్లూరు జిల్లా విశేష స్పందన చూపింది. 1921లో గాంధీజీ నెల్లూరుకు వచ్చి అహింస, స్వదేశీ, ఖాదీ, మద్యనిషేధం వంటి అంశాలపై ప్రజలను చైతన్యపరిచారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, న్యాయస్థానాల బహిష్కరణకు ప్రజలు ముందుకొచ్చారు. అనేక ప్రాంతాల్లో జాతీయ పాఠశాలలు ఏర్పడ్డాయి. గ్రామాల్లో విదేశీ వస్త్రాల దహనం ఒక ఉద్యమ రూపంగా మారింది. ఈ దశలో రాళ్లపల్లి రామసుబ్బయ్య వంటి నాయకులు ఇంటింటికీ తిరిగి విదేశీ వస్త్రాలను సేకరించి వాటిని బహిరంగంగా దహనం చేయించారు. ఖాదీ నేయడం, స్వదేశీ వస్తువులను వినియోగించడం ప్రజా ఉద్యమంగా మారింది.

పల్లిపాడు.. గాంధీ ఆశ్రమానికి నెలవు

నెల్లూరు స్వాతంత్య్రోద్యమ చరిత్రలో పల్లిపాడు పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం ఒక కీలక కేంద్రం. పెన్నానది ఒడ్డున ఏర్పడిన ఈ ఆశ్రమం గాంధేయ సిద్ధాంతాలకు, సత్యాగ్రహ శిక్షణకు, ఖాదీ–స్వదేశీ ప్రచారానికి కేంద్రంగా నిలిచింది. గాంధీజీ స్వయంగా 1921లో ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఈ ఆశ్రమం వెనుక పొణక కనకమ్మ వంటి ఉద్యమకారిణుల త్యాగం ఉంది. నెల్లూరు మహిళా చైతన్యానికి ఆమె ఒక ప్రతీకగా నిలిచారు. స్వాతంత్య్రోద్యమంతో పాటు మహిళా విద్య, సామాజిక సేవకు కూడా ఆమె జీవితాన్ని అంకితం చేశారు.

జైలు నుంచి వెనక్కి తగ్గని ధీశాలి

బొమ్మ శేషురెడ్డి 1920లోనే చదువును వదిలి సహాయ నిరాకరణోద్యమంలోకి వచ్చారు. ప్రభుత్వ ఆదాయానికి దెబ్బకొట్టేలా అబ్కారీ వేలాల బహిష్కరణకు ప్రజలను సమీకరించారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. వ్యక్తిగత సత్యాగ్రహం సందర్భంగా అరైస్టె అలీపూర్‌ జైల్లో శిక్ష అనుభవించారు. 1942–44 మధ్య కూడా నిర్బంధంలో ఉన్నారు. ఆ సమయంలో తల్లి మరణించిన వార్త తెలిసినా బెయిల్‌ కోసం ప్రయత్నించకుండా జైలు శిక్షను కొనసాగించారు. ఆశ్రమం, ఖాదీ కేంద్రం నిర్వహించడం, దళిత, గిరిజన విద్యార్థుల కోసం వసతిగృహాలు నిర్వహించడం ఆయన ఉద్యమం సామాజిక సేవలు కొనసాగించారు.

ఉప్పు నుంచి క్విట్‌ ఇండియా వరకు..

బత్తిన రామకృష్ణారెడ్డి 1921లో గాంధీజీ పిలుపుతో చదువును వదిలి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. 1930లో మైపాడు ఉప్పు సత్యాగ్రహంలో చేరి అరెస్టయిన తొలి సత్యాగ్రహుల్లో ఒకరిగా నిలిచారు. వ్యక్తిగత సత్యాగ్రహంలోనూ పాల్గొన్నారు. 1942 క్విట్‌ ఇండియా ఉద్యమంలో ఆయన పోరాటం మరింత తీవ్రరూపం దాల్చింది. అల్లూరు పోలీస్‌స్టేషన్‌పై దాడి, దహనం చేసే ప్రయత్నానికి నాయకత్వం వహించినందుకు అరైస్టె 1942 నుంచి 1944 వరకు వెల్లూరు, తంజావూరు జైళ్లలో నిర్బంధాన్ని అనుభవించారు.

మహిళలూ వెనుకడుగు వేయలేదు

నెల్లూరు ఉప్పు సత్యాగ్రహం ప్రత్యేకతల్లో మహిళల భాగస్వామ్యం ఒకటి. ఒరుగంటి మహాలక్ష్మమ్మ, పొణక కనకమ్మ వంటి మహిళలు మైపాడు ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఉప్పు తయారు చేసి చట్టాన్ని ధిక్కరించడమే కాకుండా అరెస్టులకు సిద్ధపడ్డారు. కనకమ్మ నాయకత్వంలో సుమారు 20 మంది మహిళలు జైలు శిక్ష అనుభవించినట్లు కేంద్ర ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. ఇది అప్పటి కుటుంబ, సామాజిక పరిమితులను దాటి మహిళలు బహిరంగంగా బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని సవాల్‌ చేసిన ఘట్టం.

జైళ్లు నిండినా.. ఉద్యమం ఆగలేదు

ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా నెల్లూరు జిల్లాలో అరెస్టుల పరంపర కొనసాగింది. ఉద్యమకారులకు ఆశ్రయం ఇచ్చినందుకు ఉదయగిరికి చెందిన అనంతాచార్యులు జైలుకు వెళ్లారు. బ్రిటిష్‌ ప్రభుత్వం కొందరు రైతుల భూములను కూడా స్వాధీనం చేసుకుంది. జిల్లా స్థాయి అధికారులకు వ్యతిరేకంగా ప్రజా నిరసనలు, రాజీనామాలు చోటుచేసుకున్నాయి. మన్నెపల్లి హనుమంతరావు నెల్లూరులోని తిప్పరాజువారి సత్రం గోడపై ‘నలభై వేల మంది జైళ్లలో ఉన్నారు’ అనే సందేశాన్ని రాసినందుకు అరెస్టయ్యారు. బ్రిటిష్‌ పాలకుల కళ్లముందే స్వాతంత్య్ర నినాదాన్ని గోడలపై రాసేంతగా ఉద్యమ స్ఫూర్తి ప్రజల్లో పెరిగింది.

ఇది కొందరి చరిత్ర కాదు

నెల్లూరు స్వాతంత్య్ర సంగ్రామాన్ని పరిశీలిస్తే గ్రామీణ రైతు నుంచి మహిళ వరకు, విద్యార్థి నుంచి న్యాయవాది వరకు, ఖాదీ నేసే వ్యక్తి నుంచి జైలు శిక్ష అనుభవించిన నాయకుడి వరకు అనేక వర్గాలు ఇందులో భాగస్వాములయ్యాయి. పల్లిపాడు ఆశ్రమం శిక్షణ ఇచ్చింది. మైపాడు సముద్రతీరం ఉప్పు సత్యాగ్రహానికి వేదికై ంది. నెల్లూరు వీధులు విదేశీ వస్త్రాల దహనాన్ని చూశాయి. గ్రామాలు స్వదేశీ, ఖాదీ నినాదాలతో మార్మోగాయి. జైళ్లు సత్యాగ్రహులతో నిండాయి.

మరుగునపడిన వీరులెందరో..

ఈ నేలపై స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిలో కొందరి పేర్లు మాత్రమే నేటి తరానికి తెలుసు. మరెందరో చరిత్ర పుటల్లో చిన్న అక్షరాలుగా మిగిలిపోయారు. వారి జీవితాలు, జైలు శిక్షలు, త్యాగాలు, కుటుంబాల బాధలు, ఉద్యమ అనుభవాలు పాఠశాలలు, కళాశాలలు, ప్రజా గ్రంథాలయాలు, స్థానిక చరిత్ర పుస్తకాల ద్వారా కొత్త తరానికి చేరాల్సిన అవసరం ఉంది.

నెల్లూరు నేల నుంచి జాతీయ చరిత్రకు..

కనకమ్మ.. మహిళా

చైతన్యానికి ప్రతిరూపం

పొణక కనకమ్మ పేరు నెల్లూరు స్వాతంత్య్ర చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్న ఆమె 1930 ఉప్పు సత్యాగ్రహంలోనూ చురుకై న పాత్ర పోషించారు. మైపాడులో ఉప్పు చట్టాన్ని ధిక్కరించిన ఉద్యమంలో మహిళలను ముందుకు నడిపించారు. ఆమె నాయకత్వంలో సుమారు 20 మంది మహిళలు జైలుకు వెళ్లినట్లు కేంద్ర ప్రభుత్వ ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ రికార్డులు పేర్కొంటున్నాయి. కనకమ్మ సేవ కేవలం రాజకీయ పోరాటానికే పరిమితం కాలేదు. మహిళా విద్యకు ప్రాధాన్యం ఇస్తూ నెల్లూరులో కస్తూరిదేవి విద్యాలయం స్థాపించారు. స్వాతంత్య్ర పోరాటం అంటే కేవలం బ్రిటిష్‌ పాలనను ఎదురించడం మాత్రమే కాదు.. సమాజాన్ని లోపల నుంచి మార్చడంలో ఆమె జీవితం త్యాగం చేసింది.

నెల్లూరు ప్రాంతంతో విడదీయరాని అనుబంధం ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు స్వాతంత్య్రోద్యమంలోనూ పాల్గొన్నారు. 1930 ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లారు. 1941–42 మధ్య వ్యక్తిగత సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని పలుమార్లు జైలు శిక్ష అనుభవించారు. గాంధీజీకి అత్యంత నిబద్ధుడైన అనుచరుడిగా ఆయన గుర్తింపు పొందారు. స్వాతంత్య్రం అనంతరం కూడా సామాజిక సమానత్వం కోసం ఆయన పోరాటం కొనసాగింది. నెల్లూరులోని మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో దళితులకు ప్రవేశం కల్పించాలనే డిమాండ్‌తో ఆయన నిరాహార దీక్ష చేసి వారికి ప్రవేశాన్ని కల్పించారు. స్వాతంత్య్ర పోరాటం తర్వాత భాషాప్రయుక్త రాష్ట్రాల సాధన కోసం ఆయన ఆమరణ దీక్ష చేపట్టి ప్రాణాలు విడిచారు.

1930లో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహానికి పిలుపునిచ్చినప్పుడు నెల్లూరు జిల్లా మరోసారి ఉద్యమ కేంద్రంగా మారింది. పల్లిపాడు సత్యాగ్రహ ఆశ్రమం ఉద్యమకారులకు శిక్షణా కేంద్రంగా పని చేసింది. 1930 మార్చి 22న సత్యాగ్రహ వలంటీర్లు సమావేశమై ఉద్యమ కార్యాచరణను రూపొందించారు. అనంతరం మైపాడు ప్రధాన కేంద్రంగా ఉప్పు చట్టాన్ని ధిక్కరించే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఒరుగంటి వెంకట సుబ్బయ్య ఉద్యమానికి ముఖ్య నిర్వాహకుడిగా వ్యవహరించారు. బెజవాడ గోపాలరెడ్డి, వేమూరు లక్ష్మయ్య, లేబూరు సుబ్బరామిరెడ్డి, ఒరుగంటి మహాలక్ష్మమ్మ, పొణక కనకమ్మ, బొమ్మ శేషురెడ్డి, బత్తిన రామకృష్ణారెడ్డి, దువ్వూరు బాలరామిరెడ్డి తదితరులు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. మైపాడు తీరంలో మహిళలు అలంకరించిన కుండల్లో సముద్రపు నీటిని తీసుకొచ్చి మరిగించి ఉప్పు తయారు చేశారు. తయారైన ఉప్పును బహిరంగంగా విక్రయించి బ్రిటిష్‌ చట్టాన్ని సవాల్‌ చేశారు. మైపాడుతో పాటు గోగులపల్లి, తుమ్మలపెంట, తడ, సూళ్లూరుపేట, నాయుడుపేట తదితర ప్రాంతాల్లోనూ ఉప్పు చట్టాన్ని ధిక్కరించే కార్యక్రమాలు సాగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement