● ధరలున్నా దయనీయ పరిస్థితి
● గణనీయంగా తగ్గిన దిగుబడి
● 20 లారీల స్థానంలో మూడింటిలోనే
ఎగుమతులు
పొదలకూరు: నిమ్మ తోటల్లో కాయల దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా నిమ్మకాయలు లూజు(బస్తా) ఒక్కటింటికి రూ.8 వేలు పలుకుతోంది. యార్డు నుంచి సీజన్లో 20 లారీలలో కాయల ఎగుమతులు జరుగుతాయి. ప్రస్తుతం మూడు లారీల కాయలు ఎగుమతి చేసేందుకు కూడా వ్యాపారులు ఆపసోపాలు పడుతున్నారు. యార్డులో వ్యాపారులు, కూలీలకు పెద్దగా పనులు ఉండడం లేదు. సీజన్లో రాత్రి 10 గంటల వరకు కూడా ప్యాకింగ్ చేసి ఎగుమతులు పంపేవారు.
కాయల్లేక.. తగ్గిన కూలీలు
నిమ్మమార్కెట్ యార్డు చాలా మందికి పనులు కల్పిస్తోంది. ముఖ్యంగా దినసరి కూలీలు ఇక్కడ పనులు చేసుకుని జీవిస్తున్నారు. ప్రతినిత్యం ఇక్కడ 200 మంది కూలీలు దుకాణాల్లో ప్యాకింగ్, కాయల గ్రేడింగ్ తదితర పనుల ద్వారా జీవనం సాగిస్తున్నారు. అయితే ఇప్పుడు కాయల ఎగుమతులు తగ్గిపోవడంతో కూలీలకు సైతం పనులు లేకుండాపోయాయి. ఓ వ్యాపార దుకాణంలో సీజన్లో 30 మంది కూలీలు పనులకు హాజరు అవుతుండగా ప్రస్తుతం ఏడుగురు మాత్రమే వస్తున్నారు. దీనినిబట్టి పరిశీలిస్తే కాయల ఎగుమతులు ఎంతగా తగ్గిపోయాయో అర్థం చేసుకోవచ్చు. యార్డునే నమ్ముకుని జీవించే కూలీలు కూడా ఉన్నారు. బయటి ప్రాంతాల నుంచి పొదలకూరు వచ్చి యార్డులో పనులకు వెళ్తుంటారు.
రెండు ప్రాంతాలకే ఎగుమతులు
ప్రస్తుతం యార్డు నుంచి కాయలు చైన్నె, బిహార్ ప్రాంతాలకే ఎగుమతులు జరుగుతున్నాయి. చైన్నెకు రెండు లారీలు, బిహార్‌కు ఒక లారీ కాయలు మాత్రమే ఎగుమతులు జరుగుతున్నట్లు వ్యాపారులు వెల్లడించారు. చైన్నెకు నాణ్యత కలిగిన కాయలను మాత్రమే ఎగుమతి చేయాల్సి ఉంటుందంటున్నారు. బిహార్‌కు పండిన కాయలు కూడా పంపేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. బిహార్‌లో కూడా నిమ్మసాగు ఉన్నప్పటికీ ప్రస్తుతం అక్కడ కాయలు లేకపోవడం వల్ల కొంత వరకు డిమాండ్ పెరిగింది. ఢిల్లీ మార్కెట్‌కు ప్రస్తుతం కాయల ఎగుమతి జరగడం లేదు. అక్కడ వాతావరణ మార్పుల వల్ల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కాయలకు మార్కెట్ లేదు. అయితే ఢిల్లీ మార్కెట్ నిమ్మ ఎగుమతులకు పెట్టింది పేరు.
నిమ్మ దిగుబడులు తగ్గడం వల్ల ధరలు పెరిగినా రైతులకు పెద్దగా ఆదాయం
లేకుండాపోయింది. అంతేకాక స్థానిక ప్రభుత్వ నిమ్మమార్కెట్ యార్డులో కూలీలకు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా ఇలాంటి సీజన్‌లో కాయలకు ధరలు ఉండవు. అయితే ప్రస్తుతం కిలో నిమ్మకాయలు రూ.50 నుంచి రూ.100 ధరలు పలుకుతున్నాయి. అయినా నిమ్మ మార్కెట్ ఢీలా పడుతోంది.


