నెల్లూరు(అర్బన్): జెండా పండగకు జిల్లా ముస్తాబైంది. కలెక్టరేట్‌తో పాటు ప్రభుత్వ కార్యాలయాలను మువ్వన్నెల దీపాలతో శోభాయమా నంగా అలంకరించారు. నెల్లూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో శనివారం జరగనున్న 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9గంటలకు కార్యక్రమాలు మొదలు కానున్నాయి. మంత్రి నారాయణ పోలీసు వందనం స్వీకరించి ఉపన్యసించనున్నారు. జిల్లా అభివృద్ధిపై శకటాలు ప్రదర్శించనున్నారు. జిల్లాలో సంవత్సర కాలంలో విశిష్ట సేవలందించిన వివిధ శాఖలకు చెందిన 501 మంది సిబ్బందిని గుర్తించి పురస్కారాలకు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ జాబితా తెల్లారేసరికి పెరిగే అవకాశం ఉంది. చిత్తశుద్ధితో, నిజాయతీతో పని చేసేవారికి మాత్రమే కలెక్టర్ అవార్డులు ప్రకటించాలి. అయితే సిఫార్సులకు ఒకే చెప్పాల్సి రావడంతో అవార్డులకు జంబో లిస్టు తయారైందని పలువురు ఉద్యోగులు విమర్శిస్తున్నారు. కాగా 30 మంది జిల్లా అధికారులకు అవార్డులు దక్కాయి. అందులో ఎస్పీ అజిత వేజెండ్ల, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, ఏపీ మారిటోరియం బోర్డు, కావలి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్, ఆత్మకూరు ఆర్డీఓ పావని, సోమశిల ప్రాజెక్ట్ ల్యాండ్ అక్విజిషన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి, తెలుగుగంగ పీఏ టు స్పెషల్ కలెక్టర్ కేశవర్ధన్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారిణి వసుమతి, జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణి, ఎన్‌టీఆర్ వైద్యసేవా జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ సుధీర్‌కుమార్ తదితరులు ఉన్నారు. సేవా రంగం పేరుతో కార్పొరేట్ యాజమాన్యాలతో పాటు పలువురు ప్రైవేట్ వ్యక్తులకు అవార్డులు దక్కాయి.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
త్రివర్ణ దీపకాంతుల్లో
మెరిసిన కలెక్టరేట్
501 మందికి విశిష్ట సేవా పురస్కారాలు


