సాక్షి, శ్రీకాకుళం జిల్లా: జైలు నుంచి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విడుదలయ్యారు. ఆయనకు సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత నెల 22న సీదిరి అప్పలరాజును కుట్ర పూరితంగా చంద్రబాబు ప్రభుత్వం అరెస్ట్ చేయించిన సంగతి తెలిసిందే. వెనకబడిన, మత్స్యకార సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుంచి కక్ష కట్టింది. తొలి రోజు నుంచే వేధింపులకు గురి చేస్తోంది.
ప్రతి చిన్న విషయానికి కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతోంది. ఎన్ని కేసులు పెట్టినా జైలు పంపించలేకపోయామన్న కసితో కక్ష సాధింపునకు ఎదురు చూసింది. ఈనేపథ్యంలో కాశీబుగ్గలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంపై కుట్రలకు దిగి, సీదిరి అప్పలరాజును ఇరికించింది. సంబంధం లేని కేసులో ఏ3గా పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపించింది. పెదబాబు, చినబాబు డైరెక్షన్‌లో, జిల్లాకు చెందిన నేతల ఒత్తిళ్లతో పోలీసులు కథ నడిపించారన్న ఆరోపణలు ఉన్నాయి.
మత్స్యకార సామాజిక వర్గ నాయకుడిగా, విద్యా, వైద్య వేత్తగా, మాజీ మంత్రిగా అనతికాలంలో బలమైన నేతగా ఎదిగిన సీదిరి అప్పలరాజును అరెస్టు చేసే సమయంలో పోలీసు అధికారులు అనుచితంగా వ్యవహరించారు. అప్పలరాజు చొక్కా పట్టుకుని లాగడమే కాకుండా, ఆయన సోదరుడిపైనా చేయి చేసుకున్నారు.


