ఒత్తిడిలోనే ఓటర్ల సర్వే | BLO level officers face severe difficulties due to inability to locate voters: Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఒత్తిడిలోనే ఓటర్ల సర్వే

Jun 22 2026 4:23 AM | Updated on Jun 22 2026 4:23 AM

BLO level officers face severe difficulties due to inability to locate voters: Andhra pradesh

‘సర్‌’ ఫారాలు అందజేస్తున్న బీఎల్‌వోలు

‘సర్‌’లో ఓటర్లు దొరక్క బీఎల్‌వోల తీవ్ర అవస్థలు 

పట్టణ నియోజకవర్గాల్లో చిరునామాలో కనిపించని ఓటర్లు

వారిని వెతికి..ఎన్యుమరేషన్‌ ఫారం ఇవ్వడానికి పాట్లు  

మరోవైపు రోజుకు 300 ఇళ్లు తిరగాలంటూ అధికారుల టార్గెట్లు 

10కిపైగా నియోజకవర్గాల్లో మ్యాపింగ్‌ కాని ఓట్లు లక్షపైనే 

మరో 8 నియోజకవర్గాల్లో 90వేలకు పైగా.. 

తమకు సహాయకులను ఇవ్వాలని బీఎల్‌వోల డిమాండ్‌  

కనీసం గౌరవ వేతనమూ ఇవ్వకపోవడంపై మండిపాటు

సాక్షి, అమరావతి: సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌–సర్‌)లో భాగంగా జరుగుతున్న ఇంటింటి సర్వేలో అధికారుల ఒత్తిడిని తట్టుకోలేక బూత్‌ లెవెల్‌ ఆఫీసర్‌(బీఎల్‌వో)లు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. క్షేత్రస్థాయి ఇబ్బందులతో సంబంధం లేకుండా రోజుకు 200, 300 ఎన్యూమరేషన్‌ ఫారంలు పంపిణీ చేయాలంటూ జిల్లా స్థాయి అధికారులు చేస్తోన్న ఒత్తిడిని తాము తట్టుకోలేకపోతున్నామని బీఎల్‌వోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటర్ల జాబితాలో పేర్కొన్న చిరునామాలో ఓటర్లు లేకపోవడంతో వారు ఎక్కడున్నారన్న విషయం పట్టుకోవడం బీఎల్‌వోలకు తలకు మించిన భారమవుతోంది.

పట్టణ ప్రాంత నియోజకవర్గాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. 2024 ఓటరు జాబితాలో పేర్కొన్న చిరునామాలో ఓటర్లు అక్కడ ఉండకుండా వేరే చోటకు మారిపోవడంతో వారు ఎక్కడున్నారో తెలుసుకుని అక్కడికెళ్లి ఎన్యూమరేషన్‌ ఫారంలు ఇచ్చి, పూర్తి చేసి తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటోందని వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే, ఉదయం 6 గంటలు కాకుండానే టెలీకాన్ఫెరెన్స్‌లు పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ఇన్ని ఫారాలు ఇవ్వాలని లేకపోతే మీకు మోమోలు జారీ చేస్తామంటూ అధికారులు బెదిరిస్తున్నారని పలువురు బీఎల్‌వోలు ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. 

చాలా కష్టంగా ఆ 8 నియోజకవర్గాలు 
మొత్తం 175 నియోజకవర్గాల్లో 18 నియోజకవర్గాల్లో అత్యధిక ఓట్లు మ్యాపింగ్‌ కాకుండా ఉండటంతో అక్కడ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేషన్‌ ఫారంలు సరఫరా, తిరిగి తీసుకోవడం అతిపెద్ద సవాల్‌గా మారింది. లక్షకుపైగా ఓట్లు మ్యాపింగ్‌కానీ నియోజకవర్గాలు 10 ఉంటే, 90 వేల నుంచి లక్షలోపు ఓట్లు మ్యాపింగ్‌ కాకుండా మరో 8 నియోజకవర్గాలున్నాయి. నెల్లూరు గ్రామీణంలో అత్యధికంగా 1,40,836 ఓట్లు, చంద్రగిరి (1,35,749), తిరుపతి (1,23,129), రాజమండ్రి గ్రామీణం (1,07,906), నెల్లూరు జిల్లా కొవ్వూరు (1,05,415), కర్నూలు (1,07,479), రాయచోటి (1,00,472), రాజమండ్రి సిటీ (1,01,130), మైలవరం (1,04,430), భీమిలి (1,23,737) నియోజకవర్గాలున్నాయి.

ఇలా పట్టణ ప్రాంత నియోజకవర్గాల ఓటర్లను గుర్తించి ఎన్యూమరేషన్‌ ఫారంలు ఇవ్వడం పెద్ద సమస్యగా తయారైంది. ఇలాంటి నియోజకవర్గాలపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టి తమకు సహాయకులను కేటాయించాలని బీఎల్‌వోలు డిమాండ్‌ చేస్తున్నారు. 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్‌ కాని వారు 2002లో ఏ నియోజకవర్గంలో ఓటు ఉందో చెప్పలేకపోతున్నారని, 2002లో ఓటు హక్కు లేని వారు తండ్రి పేరు కాకుండా తాత పేరు చెప్పడం, తాతకు చెందిన ఓటును గుర్తించడం చాలా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

గౌరవ వేతనం  లేకుండానే...  
3 నెలలుగా జనాభా లెక్కలు, మ్యాపింగ్, ఇప్పుడు ఇంటింటి సర్వే అంటూ ఉదయం నుంచి రాత్రి వరకు తమను తిప్పుతున్నారని, దీనికితోడు ప్రభుత్వం యోగాంధ్ర, యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వే అంటూ ఒకే మనిíÙపై అనేక పనులతో ఒత్తిడి తీసుకువస్తుండటంతో 4 నెలలుగా తాము కుటుంబంతో గడపలేని పరిస్థితి నెలకొందంటూ ఒక మహిళా బీఎల్‌వో ఏడ్చేశారు. రెండేళ్లుగా బీఎల్‌వోగా సేవలు అందిస్తున్నా..ఇంత వరకు రూపాయి కూడా గౌరవ పారితోషకం లేదని, అలాగే జనాభా లెక్కల్లో తొలి దశ పూర్తయినా దానికి సంబంధించి కూడా వేతనం విడుదల చేయలేదని ఉత్తరాంధ్రకు చెందిన మరో బీఎల్‌వో ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా గౌరవ వేతనం లేకుండా ఒక వ్యక్తికే వివిధ పనులు ఒకేసారి అప్పగిస్తే ఏవిధంగా పూర్తి చేయాలని నిలదీస్తున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement