హైదరాబాద్: SIR ప్రక్రియపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సర్’ మ్యాపింగ్‌లో సమస్యలు ఉన్నాయని వ్యాఖ్యానించారు ఒవైసీ. ఈసీ కోరుతున్న 12 డాక్యుమెంట్స్‌లో తెలంగాణలో మూడు డాక్యుమెంట్స్ లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పత్రాలను ‘సర్’ పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు అసదుద్దీన్ ఒవైసీ.
కాగా, అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడంతోపాటు నకిలీ ఓట్లను ఏరివేసే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం తలపెట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)లో భాగంగా మ్యాపింగ్ ప్రక్రియ చివరి దశకు చేరింది. ఈనెల 25 నుంచి ఇంటింటి సర్వేతో సర్ ప్రక్రియ ఊపందుకోనుంది. ఇదే సమయంలో అర్హులైన ఓటర్ల పేర్లు గల్లంతుకాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
2002 ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుని సర్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అప్పటి జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి స్థానిక బీఎల్‌వోను సంప్రదిస్తే సరిపోతుంది. ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ https://ceotelangana.nic.in లేదా https://voters.eci.gov.in పోర్టల్‌లోనూ వివరాలు తెలుసుకోవచ్చు.


