ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయనున్న బీఎల్‌ఓలు
జూలై 24లోగా నింపిన ఫారాలను తిరిగి సమర్పించాలి
అప్పుడే జూలై 31న ప్రచురించే ముసాయిదా జాబితాలో చోటు
ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు/దరఖాస్తుల స్వీకరణ
ఆన్‌లైన్‌లో సైతం ఎన్యూమరేషన్‌కు అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)–2026లో భాగంగా గురువారం నుంచి రాష్ట్రంలోని ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం..జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) ఇంటింటా తిరిగి ప్రతి ఓటరుకు ఒక జత ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయనున్నారు.
ఫారంపై సంబంధిత ఓటరు పేరు, ఎపిక్‌కార్డు సంఖ్య, చిరునామా, ఫొటో, తదితర పాక్షిక వివరాలు ముద్రించి ఉండనున్నాయి. మిగిలిన వివరాలతో రెండు ప్రతులను పూరించాక వాటిపై బీఎల్‌ఓ సంతకం చేసి ఒక ప్రతిని ఓటరుకే రశీదుగా ఇచ్చి మరో ప్రతిని తనతో పాటు తీసుకెళ్తారు. ఈ విధంగా ఓటర్లు వివరాలు భర్తీ చేసి తమ సంతకం/వేలి ముద్రతో జూలై 24 లోగా బీఎల్‌ఓలకు తిరిగి అప్పగిస్తేనే జూలై 31న ప్రచురించే ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు రానుంది.
మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు..
రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, ప్రతి ఒక్క ఓటరుకు పంపిణీ చేసేందుకు జత ఎన్యూమరేషన్ ఫారాలను ఇప్పటికే ముద్రించి బీఎల్‌ఓలకు సరఫరా చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆంగ్లంలో, మిగిలిన జిల్లాల్లో తెలుగులో ప్రచురించిన ఎన్యూమరేషన్ ఫారాన్ని ఓటర్లకు పంపిణీ చేయనున్నారు. ఓటరు స్థానికంగా అందుబాటులో లేకపోతే అతడి ఎన్యూమరేషన్ ఫారాన్ని కుటుంబ పెద్ద భర్తీ చేసి సంతకం పెట్టి బీఎల్‌ఓకు ఇవ్వవచ్చు. పోలింగ్ కేంద్రాల వారీగా సర్ ముసాయిదా ఓటర్ల జాబితాను జూలై 31న ప్రచురిస్తారు.
ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించడంలో విఫలమైన ఓటర్లను గైర్హాజరు/నివాసం మారడం/చనిపోయిన/డూప్లికేట్ ఓటర్లుగా పరిగణించి వారి పేర్లను ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు. ఇలా తొలగించిన ఓటర్ల జాబితాలను సైతం పోలింగ్ కేంద్రాల వారీగా ప్రచురించి స్థానిక గ్రామ పంచాయతీ/వార్డు కార్యాలయంతో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తారు.
ముసాయిదా జాబితాపై అభ్యంతరాల (ఫామ్–7)తో పాటు కొత్తగా ఓటర్లుగా నమోదు (ఫామ్–6), వివరాల దిద్దుబాటు/చిరునామా మార్పు (ఫామ్–8) కోసం జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ముసాయిదా జాబితాలో పేరు రాకపోయినా లేదా అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన/నిండనున్న యువత ఓటర్లుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 మధ్యకాలంలో ఈ దరఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరించడంతో పాటు మ్యాపింగ్ సరిపోలని అనుమానిత ఓటర్లకు ఈఆర్‌ఓ (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్)లు నోటీసులు జారీ చేసి నిర్దిష్ట తేదీలో విచారణకు పిలుస్తారు.
11 పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాలి
రాష్ట్రంలోని 3.38 కోట్ల మంది ఓటర్లలో ఇప్పటివరకు 2.38 కోట్ల మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తికాగా, మ్యాపింగ్ జరిగిన ఓటర్లలో 89.98 లక్షల మంది ఓటర్ల వివరాల్లో తేడాలున్నట్టు గుర్తించారు. వీరందరూ విచారణకు హాజరై ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని సమర్పించి తమ పుట్టిన తేదీ/నివాస ధ్రువీకరణ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ జాబితాలో 12వ ధ్రువీకరణ పత్రంగా ఆధార్‌ను ఈసీ చేర్చినా, పుట్టిన తేదీ/నివాస ధ్రువీకరణ కోసం పరిగణనలోకి తీసుకోరు. కేవలం గుర్తింపునకు ధ్రువీకరణగానే ఆధార్‌ను స్వీకరించనున్నారు. ఈసీ నిర్దేశించిన పత్రాల్లో ఏ ఒక్క పత్రం లేని ఓటర్లు వారికి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఇతర ధ్రువీకరణ పత్రాలను సైతం సమర్పించవచ్చు. అయితే వాటి స్వీకరణ పూర్తిగా ఈఆర్వోల విచక్షణాధికారాలపై ఆధారపడి ఉంటుంది. అభ్యంతరాలు/దరఖాస్తుల పరిష్కరణ, ఈఆర్వోల విచారణలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ముసాయిదా ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేసి అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు.
బీఎల్‌ఓకు ఫోన్ కూడా చేయొచ్చు
ఎన్యూమరేషన్ ఫారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ( https://voters.eci.gov.in ) ద్వారా కూడా సమర్పించవచ్చు. అయితే ఆధార్ ఆథెంటికేషన్ సదుపాయం కలిగిన ఓటర్లు మాత్రమే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోగలరు. ఇక బీఎల్‌ఓ ఎన్యూమరేషన్ ఫారాన్ని పంపిణీ చేయకుంటే సీఈఓ వెబ్‌సైట్ ( https://ceotelangana.nic.in ) నుంచి తమ ప్రాంత బీఎల్‌ఓ ఫోన్ నంబర్‌ను తీసుకుని నేరుగా ఫోన్ చేయవచ్చు. ఈసీ వెబ్‌సైట్‌లోని ‘బుక్ ఏ కాల్ విత్ బీఎల్‌ఓ’ సదుపాయాన్ని సైతం వినియోగించుకోవచ్చు. విదేశాల్లోని భారత పౌరులు ఆన్‌లైన్ ద్వారా ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించవచ్చు.


