‘సర్‌’పై సీజేఐకి 23 పార్టీల బహిరంగ లేఖ | Congress Leader Jairam Ramesh On Special Intensive Revision | Sakshi
Sakshi News home page

‘సర్‌’పై సీజేఐకి 23 పార్టీల బహిరంగ లేఖ

Jul 1 2026 5:21 AM | Updated on Jul 1 2026 5:21 AM

Congress Leader Jairam Ramesh On Special Intensive Revision

ఎన్నికల ప్రక్రియలో ఈసీ పాత్రపై ప్రశ్నలు 

ఇండియా కూటమితోపాటు ఆప్, డీఎంకే సంతకాలు 

సర్‌’పై విపక్షాలన్నీ ఒకే మాటపై ఉన్నాయి: జైరామ్‌ రమేశ్‌

న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా సవరణ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్‌ చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌)పై దేశంలోని 23 రాజకీయ పార్టీలు, ఒక స్వతంత్ర ఎంపీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌కు బహిరంగ లేఖ రాశాయి. సర్‌ ప్రక్రియలో ఎన్నికల కమిషన్‌ పాత్ర, తదితర అంశాలపై ప్రశ్నలు లేవనెత్తాయి. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో సర్‌ ప్రక్రియ ప్రభావం ఎలా ఉందో వివరిస్తూనే అందులో ఎన్నికల కమిషన్‌ పాత్రను కూడా వివరించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇండియా కూటమిలోని పార్టీలతోపాటు ఆప్, డీఎంకే కూడా ఈ లేఖపై సంతకాలు చేసినట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ ఎక్స్‌ వేదికగా తెలిపారు. ‘సర్‌’పై విపక్షాలన్నీ ఒకే మాటపై ఉన్నాయని, ఉమ్మడిగా నిరసన తెలుపుతున్నాయని, కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటిస్తున్నాయని పేర్కొన్నారు. 

జూన్‌ 8న ఇండియా కూటమి పార్టీలతో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ లేఖ రాసినట్లు తెలిపారు. ఈ లేఖపై కాంగ్రెస్‌ తరఫున అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాం«దీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరేన్, జమ్మూ కశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా, వామపక్ష పార్టీ నేతలు, స్వతంత్ర ఎంపీ కపిల్‌ సిబల్‌ సంతకాలు చేసినట్లు తెలిపారు. 

తృణమూల్‌ ఎంపీ డెరెక్‌ ఒబ్రెయిన్‌ మీడియాతో మాట్లాడుతూ... ‘ఇండియా కూటమి పార్టీల ఉమ్మడి కృషి ఫలితం ఇది’ అని లేఖపై వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలోని అన్ని ఇతర వ్యవస్థలు విఫలమైన నేపథ్యంలో న్యాయ వ్యవస్థే శరణ్యమన్న ఆలోచన నుంచే ఈ లేఖ పుట్టుకొచ్చిందని కీలక ప్రతిపక్ష నేత ఒకరు తెలిపారు. ఇది న్యాయవ్యవస్థ ఆత్మను స్పృశించే అంశమని, దేశంలో ఏం జరుగుతోందో న్యాయవ్యవస్థ కూడా పట్టించుకోవాలని ఆ నేత వ్యాఖ్యానించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement