నోటీసుకు సమాధానం ఇవ్వకపోతే ఓటు గల్లంతే | Special Intensive Revision Deletion of names without notice in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

నోటీసుకు సమాధానం ఇవ్వకపోతే ఓటు గల్లంతే

Aug 15 2026 4:18 AM | Updated on Aug 15 2026 4:54 AM

Special Intensive Revision Deletion of names without notice in Andhra Pradesh

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణలో ఇంటింటి సర్వే ఎంత మొక్కుబడిగా జరిగిందనడానికి భారీగా జారీ అవుతున్న నోటీసులే నిదర్శనం. పై అధికారుల ఒత్తిడితో అడ్డదిడ్డంగా మ్యాపింగ్‌ చేయడంతో భారీగా నోటీసులు జారీ అవుతున్నాయి. సర్వే తర్వాత విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో ఇప్పటికే 44,89,512 మంది ఓటర్లను తొలగించగా.. 44,21,763 మంది ఓటర్లకు మీ వివరాలు సరిగా లేవంటూ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు సరైన సమాధానం ఇవ్వకపోతే ఆ ఓట్లను తొలగిస్తారు.

ఇంటింటి సర్వే ఎంత అస్తవ్యస్తంగా జరిగిందంటే.. ఒక వ్యక్తికి ఇద్దరు పిల్లలుంటే.. ఆరుగురు అంతకంటే ఎక్కువ మంది సంతానం ఉన్నట్లు చూపడం, కుమారుడి కంటే తండ్రి వయస్సు తక్కువగా ఉండటం, ముసాయిదా జాబితాలో ఉన్న తండ్రి పేరుకు, 2002 ఓటర్ల జాబితాలోని తండ్రి పేరుకు పొంతన లేకపోవడం.. తల్లిదండ్రులు, పిల్లల మధ్య వయస్సు 50 ఏళ్ల అంతరం ఉండటం కనిపించింది. మరికొన్ని చోట్ల ఓటరు తాత, నానమ్మల వయస్సు 40 ఏళ్ల కంటే తక్కువగా ఉంది. ఇలా ముసాయిదా ఓటర్ల జాబితాలో అస్తవ్యస్త సమాచారం వల్లే 44,21,763 మంది ఓటర్లకు నోటీసులు జారీ అయ్యాయి. ఇలా జారీ చేసిన నోటీసులోని ఓటర్ల వివరాలను పోలింగ్‌ స్టేషన్లు, జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయాల వద్ద ప్రదర్శనగా ఉంచనున్నారని అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఢిల్లీరావు తెలిపారు.

ఇంటి పేర్లు, అక్షర దోషాలే ఎక్కువ
44.21 లక్షల నోటీసుల్లో 7.3 లక్షల మ్యాపింగ్‌ కాని ఓటర్లు ఉండగా, మరో 36.5 లక్షల మంది ఓటర్ల సమాచారం అస్పష్టంగా లేక నమోదులో చిన్న పొరపాట్లతో ఉన్నట్లు గుర్తించినట్లు ఢిల్లీరావు తెలిపారు. గత ఓటర్ల జాబితాలో ఉన్న పేరుకు, ఇప్పుడు ఓటర్ల జాబితాలోని పేరు స్పెల్లింగ్‌లో తేడా ఉండటం, లేదా తల్లిదండ్రులు పేర్లు, ఇంటిపేర్లలో తేడా ఉండటంతో ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఇలా నోటీసులు జారీ అయిన వారు సరైన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

అత్యధికంగా తిరుపతి జిల్లాలో 4 లక్షలు పైగా నోటీసులు జారీ కాగా, ఆ తర్వాత అనంతపురం, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, పల్నాడు, విశాఖ, నెల్లూరు వంటి జిల్లాలున్నాయి. ఈ నోటీసులను సెప్టెంబర్‌ 28లోగా పరిష్కరించి, అక్టోబర్‌ 3న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. అలాగే పోలింగ్‌ బూత్‌ల రేషనలైజేషన్‌ తర్వాత ఒకే కుటుంబంలోని ఓటర్లు వేర్వేరు పోలింగ్‌ కేంద్రాలకు మారితే.. వారు ఫారం 8 ద్వారా ఒకే పోలింగ్‌ బూత్‌లోకి మార్చుకోవాల్సిందిగా అధికారులు కోరుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement