హైకోర్టులో నిర్వహించిన సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చక్రవర్తి
చీఫ్ జస్టిస్ లీసా గిల్ ప్రశంసలు
ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికిన హైకోర్టు
సాక్షి, అమరావతి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి శుక్రవారం పదవీ విరమణ చేశారు. హైకోర్టు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. హైకోర్టులో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ, ‘గత 32 సంవత్సరాలుగా జస్టిస్ చక్రవర్తి వివిధ హోదాల్లో న్యాయవ్యవస్థకు ఎంతో సేవ చేశారు. న్యాయవ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కించడంలో కీలక పాత్ర పోషించారు’ అని పేర్కొన్నారు.
అనంతరం అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) చల్లా ధనంజయ, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకనాథరెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్ మాట్లాడుతూ సీనియర్, జూనియర్ అన్న తేడా లేకుండా అందరినీ ఒకే రకంగా జస్టిస్ చక్రవర్తి చూసేవారన్నారు. చివరిగా జస్టిస్ చక్రవర్తి మాట్లాడుతూ న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. హైకోర్టు రిజిస్ట్రార్ (ఐటీ)గా కంప్యూటర్ కమిటీ సభ్యునిగా, మాస్టర్ ట్రైనీగా తనకు మరిచిపోలేని అనుభవాలున్నాయని తెలిపారు.
కార్యక్రమంలో జస్టిస్ చక్రవర్తి కుటుంబ సభ్యులు, అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇవన సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ, న్యాయవాదులు, రిజిస్ట్రార్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం జస్టిస్ చక్రవర్తి దంపతులను హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించింది. శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహూకరించింది. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్, ఉపాధ్యక్షుడు పీటా రామన్, ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కిరణ్ ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కాగా, పదవీ విరమణ అనంతరం జస్టిస్ చక్రవర్తిని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ) చైర్మన్‌గా నియమించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది.
న్యాయవాదుల కోసం ‘అడ్వొకేట్ సర్వీసెస్ పోర్టల్’
న్యాయవ్యవస్థలో సాంకేతికతను అమలు చేయడంలో భాగంగా రాష్ట్ర హైకోర్టు తాజాగా న్యాయవాదుల కోసం కొత్తగా ‘అడ్వకేట్ సర్వీసెస్ పోర్టల్’ను తీసుకొచ్చింది. ఇంతకుముందు హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో లేని పలు సేవలను ఈ పోర్టల్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. జస్టిస్ చక్రవర్తి చేతుల మీదుగా ఈ పోర్టల్ ప్రారంభమైంది.
ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ ఈ పోర్టల్ ద్వారా న్యాయ ప్రక్రియలో పారదర్శకతను పెంచడం, న్యాయ పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థంగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుందన్నారు. న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి, జస్టిస్ బీవీఎల్‌ఎన్ చక్రవర్తి, జస్టిస్ నూనెపల్లి హరినాథ్, జస్టిస్ న్యాపతి విజయ్, జస్టిస్ కుంచెం మహేశ్వరరావు, జస్టిస్ టి.సి.డి. శేఖర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన హైకోర్టు ఐటీ కమిటీ మార్గదర్శకత్వంలో ఈ పోర్టల్ రూపొందింది.
జస్టిస్ చక్రవర్తి దంపతులను సత్కరించి జ్ఞాపిక ఇస్తున్న వాసిరెడ్డి ప్రభునాథ్, తిరుమలశెట్టి కిరణ్ తదితరులు


