వాహనాల భద్రత ప్రాజెక్టు ముసుగులో మరో భారీ స్కామ్‌.. కమీషన్ల ‘వాహనం’! | Another huge scam in vehicle safety project: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

వాహనాల భద్రత ప్రాజెక్టు ముసుగులో మరో భారీ స్కామ్‌.. కమీషన్ల ‘వాహనం’!

Aug 15 2026 3:48 AM | Updated on Aug 15 2026 3:48 AM

Another huge scam in vehicle safety project: Andhra Pradesh

మార్కెట్‌లో రూ.2,500కే దొరికే ‘వీఎల్‌టీడీ’ రూ.10 వేల చొప్పున కొనుగోలుకు సిద్ధం

టెండర్‌ నిబంధనలు ఇష్టారాజ్యంగా మార్చేసి రెండు కంపెనీలతో బేరసారాలు 

ఒక్కో పరికరానికి రూ.2 వేల చొప్పున కమీషన్‌  

5.50 లక్షల వాహనాలకు పరికరాలు అమర్చి ప్రతి రెండేళ్లకు రూ.110 కోట్లు కాజేసే స్కెచ్‌

ఇప్పటికే ఉన్న ఆర్టీజీఎస్, స్టేట్‌ డేటా సెంటర్లను పక్కనబెట్టి  ప్రత్యేకంగా రూ.25 కోట్లతో కమాండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌కు పచ్చజెండా  

సీఎంవో అండదండలతో శరవేగంగా కదులుతున్న ఫైల్‌.. ఏ క్షణమైనా టెండర్‌  

సీఎంవోలో ‘చిన్న’గా రూట్‌ క్లియర్‌ చేసిన మహిళా నేత.. అవినీతిలో చెలరేగుతున్న ముఖ్య నేత

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో వాహనాల భద్రత ప్రాజెక్టు.. ప్రత్యేకంగా కమాండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ ముసుగులో మరో భారీ స్కామ్‌కు రంగం సిద్ధమైంది! బస్సులు, లారీలు, ఇతర ప్రైవేట్‌ వాహనాల కోసం అంటూ వెహికల్‌ లొకేషన్‌ అండ్‌ ట్రాకింగ్‌ డివైస్‌ (వీఎల్‌టీడీ) ప్రాజెక్టును తెరపైకి తేవడంతోపాటు ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆర్టీజీఎస్, స్టేట్‌ డేటా సెంటర్లను పక్కనబెట్టి ప్రత్యేకంగా రూ.25 కోట్లతో కమాండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ ఏర్పాటుకు ప్రభుత్వ పెద్దలు పచ్చ జెండా ఊపారు. ఇందులో వాటాల వసూలుకు సిద్ధమయ్యారు. సీఎంవో అండదండలతో మహిళా నేత ‘చిన్న’ పావులు కదిపి ముడుపుల ‘ప్రసాదం’ పంచుకు­నేందుకు ఏర్పాట్లు చేశారు! ఈ ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని రెండేళ్లకు ఒకసారి రూ.110 కోట్లు చొప్పున కాజేసేందుకు పక్కాగా స్కెచ్‌ వేశారు.

బయట ఒక్కో వీఎల్‌టీడీ ధర రూ.2,500 మించదు. అలాంటిది దాని ధర ఏకంగా రూ.పది వేలకు పెంచేయడం అవినీతి వ్యవహారాలకు నిదర్శనంగా నిలుస్తోంది. వీఎల్‌టీడీలను సరఫరా చేసే సంస్థతో బేరసారాలు జరిపిన కీలక మంత్రి.. ఒక్కో డివైజ్‌కు రూ.2 వేల చొప్పున కమీషన్‌ చెల్లించేందుకు అంగీకరించిన రెండు సంస్థలకే పనులు దక్కేలా టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఆదేశించారు. దాంతో ఆ రెండు సంస్థలు మాత్రమే అర్హత సాధించే నిబంధనలతో ఏ క్షణమైనా టెండర్‌ నోటిఫికేషన్‌ జారీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 

టెండర్ల వెనుక గోల్‌మాల్‌..  
వీఎల్‌టీడీ పరికరాల కొనుగోలు వెనుక భారీ కుంభకోణం దాగి ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి మార్కెట్‌లో ఒక్కో పరికరం ధర రూ.2,500 మాత్రమే ఉంది. తయారీ సంస్థలు ఇదే ధరకు  మైనింగ్‌ కంపెనీలు, ప్రైవేట్‌ వాహన సముదాయాల నిర్వహణ సంస్థలకు సరఫరా చేస్తున్నాయి. అయితే కమీషన్లు దండుకోవడమే లక్ష్యంగా పరికరం ధరను ఏకంగా నాలుగు రెట్లు (రూ.10 వేలు) పెంచి టెండర్లలో చూపించారు. 

ఆ లెక్కన దాదాపు రూ.550 కోట్ల అంచనాలతో 5.50 లక్షల పరికరాల కొనుగోలుకు టెండర్లు పిలుస్తున్నారు. ఒక్కో పరికరంపై రూ.2 వేలు చొప్పున కమీషన్‌ రూపంలో ఏకంగా రూ.110 కోట్లు కాజేసేందుకు పక్కాగా స్కెచ్‌ వేశారు. వాహనదారులు కేవలం రూ.2,500 విలువైన పరికరానికి రూ.10 వేలు చెల్లించాల్సి వస్తోంది

ఇప్పటికే ఉన్న వ్యవస్థలను పక్కనపెట్టి..
వీఎల్‌టీడీ ప్రాజెక్టులో భాగంగా కమాండ్‌ కంట్రోల్‌ సిస్టమ్, వీఎల్‌టీడీ పరికరాల కోసం  మొత్తం రెండు టెండర్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సిస్టమ్‌ (ఆర్టీజీఎస్‌), స్టేట్‌ డేటా సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. వివిధ శాఖల నుంచి ప్రతిరోజూ గిగాబైట్ల కొద్దీ డేటా ఈ వ్యవస్థలకు చేరుతుంది. వీటిని కాదని వీఎల్‌టీడీ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా రూ.25 కోట్లతో కమాండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.  ఇంకా ప్రత్యేకంగా మరో కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఎందుకు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.  

డీఐఎంటీఎస్, డిజిటాజ్‌కు అనుకూలంగా టెండర్‌ నిబంధనలు 
వాహనాల కదలికలను పసిగట్టేందుకు జీపీఎస్‌ (గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌) పరికరాలు ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నాయి. అయినా సరే వాహనాల భద్రత, అత్యవసర సమయంలో ఆచూకీ తెలుసుకోవడం, ప్రమాదాల సమయంలో వేగంగా స్పందించడం కోసం అంటూ కొత్తగా వీఎల్‌టీడీ ప్రాజెక్టును కొత్తగా తెరపైకి తీసుకొచ్చారు. తొలిదశలో రాష్ట్రంలో 5.50 లక్షల భారీ వాహనాలకు వీటిని అమర్చాలని లక్ష్యంగా నిర్దేశించారు. 

ఇందుకోసం ఏపీఎస్‌ ఆర్టీసీకి టెండర్ల బాధ్యత అప్పగించారు. ఈ క్రమంలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ టెండర్‌ ముసాయిదాను అనుకూల కాంట్రాక్టర్లకు చేరవేసి నిబంధనలు ఇష్టారాజ్యంగా మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లను నిర్వహిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు పాల్గొనేందుకు వీలులేని రీతిలో నిబంధనలు రూపొందించినట్లు చెబుతున్నారు. కమీషన్ల కోసం డీఐఎంటీఎస్, డిజిటాజ్‌ లాంటి సంస్థలకు అనుకూలంగా టెండర్‌ నిబంధనలు మారుస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం  సుమారు రూ.5 కోట్ల మేర చేతులు మారినట్లు సమాచారం.

ఏఆర్‌ఏఐలో 70కిపైనే గుర్తింపు పొందిన సంస్థలు  
దేశంలో 70కి పైగా వీఎల్‌టీడీ పరికరాల తయారీదారులు ఇప్పటికే ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఆర్‌ఏఐ) వద్ద ధ్రువీకరణ పొందారు. వీరందరికీ ఏఐఎస్‌–140 ధ్రువీకరణ ఉంది. నిబంధనల ప్రకారం ఈ ధ్రువీకరణ కలిగిన తయారీదారులు మాత్రమే వీఎల్‌టీడీ పరికరాలు సరఫరా చేయాలి. అయితే కేవలం రెండు లేదా మూడు సంస్థలు మాత్రమే అర్హత పొందేలా టెండర్‌లో నిబంధనలు చేర్చినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరికరం కొనుగోలుతోనే వాహన యజమానిపై భారం ఆగదంటున్నారు. పరికరం అమర్చే సమయంలో ఎంవీవో, ఆర్టీవోల నుంచి ధ్రువీకరణ పేరుతో అదనంగా మరో రూ.రెండు వేల దాకా భారం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఫలితంగా వాహనదారుడిపై మొత్తం రూ.14 వేల వరకు భారం పడే అవకాశాలున్నాయి.  

కమీషన్ల కోసం రెండేళ్లకోసారి.! 
వాహనదారులు రెండేళ్లకోసారి వీఎల్‌టీడీ పరికరాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన రెండేళ్లకోసారి వీటి కొనుగోలు పేరిట కమీషన్లు దండుకునే కార్యక్రమంకొనసాగనుంది. వీటి కొనుగోలు, టెండర్ల ప్రక్రియ వెనుక అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తమ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని వాహనదారులు డిమాండ్‌ చేస్తున్నారు.

వీటికి జవాబిస్తారా?
వీఎల్‌టీడీ టెండర్‌ ముసాయిదా గోప్యంగా ఉండాల్సిన సమయంలో కొన్ని ప్రైవేట్‌ సంస్థలకు ఎలా చేరింది?  
టెండర్‌ షరతులను నిర్దిష్ట సంస్థలకు అనుకూలంగా ఎందుకు మార్చారు?  
 ఏఐఎస్‌–140 ధ్రువీకరణ ఉన్న 70కి పైగా సంస్థలకు అర్హత ఉన్నా.. కేవలం రెండు మూడు సంస్థలకే అవకాశం కలి్పంచే నిబంధనలు ఎందుకు?  

 మార్కెట్‌లో రూ.2,500కే లభ్యమయ్యే పరికరానికి రూ.10 వేల నుంచి రూ.14 వేల వరకు ఎందుకు ఖర్చు చేయాలి?  
ఇప్పటికే ఆర్టీజీఎస్, స్టేట్‌ డేటా సెంటర్‌ ఉన్నప్పుడు మరో రూ.25 కోట్లతో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఎందుకు?  
ఒక్కో పరికరానికి రూ.2,000 చొప్పున అదనపు ధ్రువీకరణ ఖర్చు ఎందుకు?  

పనిచేస్తున్న పరికరాలను రెండేళ్లకోసారి మార్చే నిబంధన ఎందుకు?  
పరికరాల కొనుగోలు, అమరిక, ధ్రువీకరణ ప్రక్రియ మొత్తాన్ని స్వతంత్ర సంస్థతో ఆడిట్‌ చేయిస్తారా?  
టెండర్‌ ప్రక్రియకు సంబంధించిన ఫైళ్లు, నోట్‌ ఫైళ్లు, సాంకేతిక కమిటీ సిఫార్సులు, బిడ్డర్లతో జరిగిన సమావేశాల వివరాలను బహిర్గతం చేస్తారా?  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement