బ్యాలెట్ బాక్సుల సేకరణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టి
రాష్ట్రంలో ప్రస్తుతం వినియోగానికి పనికొచ్చేవి 50 వేల లోపే
పొరుగు రాష్ట్రాల నుంచి 1.50 లక్షల బాక్సుల సేకరణకు కసరత్తు
తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు ఎస్‌ఈసీ లేఖ
సాక్షి, అమరావతి: పాత విధానంలోనే బ్యాలెట్ పేపర్‌తో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల నిర్వహణకు సరిపడినన్ని బ్యాలెట్ బాక్స్‌లు రాష్ట్రంలో అందుబాటులో లేనందున పొరుగు రాష్ట్రాల నుంచి సమకూర్చుకోవాలని నిర్ణయించింది. గ్రామ పంచాయతీలతో పాటు మున్సిపల్ ఎన్నికలనూ బ్యాలెట్ విధానంలో నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆలోచన చేస్తోంది. ఈ మేరకు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ఎన్నికల కమిషన్‌లకు లేఖ రాసి 50 వేల చొప్పున మొత్తం 1.50 లక్షల బ్యాలెట్ బాక్స్‌లను సమకూర్చాలని కోరినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
మన రాష్ట్రంలో చిన్న, పెద్దవి కలిపి దాదాపు 1.10 లక్షల బ్యాలెట్ బ్యాక్స్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ అందులో ఎక్కువ భాగం ప్రస్తుతం వినియోగానికి పనికి రావని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న వాటిలో 50 వేల లోపు మాత్రమే బ్యాలెట్ బాక్స్‌లు పోలింగ్ అవసరాలకు వినియోగించుకునే వీలుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో మున్సిపల్, మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికలు వరసగా నిర్వహించే అవకాశం ఉన్నందున కనీసం 1.50 లక్షల బ్యాలెట్ బ్యాక్స్‌లను అందుబాటులో ఉంచాలని కమిషన్ యోచిస్తోంది.
మూడు పొరుగు రాష్ట్రాల నుంచి కనీసం లక్షకు తక్కువ కాకుండా బ్యాలెట్ బాక్సులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. జిల్లాల వారీగా ప్రస్తుతం వినియోగానికి పనికి వచ్చే బ్యాలెట్ బాక్స్‌ల వివరాలు పంపాలని కలెక్టర్లకు లేఖలు పంపినట్లు సమాచారం. బ్యాలెట్ విధానంలోనే ఎన్నికల నిర్వహణ ఉంటుందన్న యోచనతో పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల ఉన్నతాధికారుల సైతం బ్యాలెట్ పత్రాల ముద్రణకు అవసరమయ్యే బ్యాలెట్ పేపరు కొనుగోలుకు కసరత్తు మొదలుపెట్టారు.
ఈవీఎంలతో నిర్వహించాలనుకున్నా
గ్రామ పంచాయతీ ఎన్నికలను బ్యాలెట్ విధానంలో కాకుండా తొలిసారి ఈవీఎంలతో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తొలుత యోచించింది. కూటమి ప్రభుత్వంలో నీలం సాహ్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉండగా అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించాలనే ఉద్దేశంతో ఈవీఎంల కొనుగోలుకు పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు మొత్తం 1,37,671 పోలింగ్ స్టేషన్లు ఉంటాయనే అంచనాతో నాలుగు దశల్లో నిర్వహిస్తే 41,301 ఈవీఎం కంట్రోల్ యూనిట్లు, 82,602 బ్యాలెట్ పేపరు యూనిట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందని భావించారు.
ఈవీఎంల కొనుగోలుకు రూ.400 కోట్లకు పైగా ఖర్చు అవుతుందనే అంచనాతో 2025 చివరిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. దీనిపై 9 నెలలుగా ప్రభుత్వం స్పందించకపోవడం, ఎన్నికల నిర్వహణకు గడువు సమీపించడంతో బ్యాలెట్ విధానంలో ఎన్నికల నిర్వహణకు ముందుకు వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపునేఠ నిర్ణయించినట్లు సమాచారం.


