ఏడు గ్యాలంట్రీ, రెండు విశిష్ట, 18 ప్రతిభా సేవా అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ : 2026 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్రస్థాయి భద్రతా బలగాలకు అందించే ప్రతిష్టాత్మక సేవా, శౌర్య పతకాలను ప్రకటించింది. పోలీసు, అగ్నిమాపక, హోంగార్డ్స్, కరెక్షనల్ సర్వీసెస్ (జైళ్లు) శాఖల నుంచి మొత్తం 1,057 మంది అధికారులకు పతకాలను ఖరారు చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 27 మంది ఎంపికయ్యారు. వీరిలో ఏఆర్ విభాగానికి చెందిన ఏడుగురికి శౌర్య పతకాలు లభించాయి.
ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు కొర్లాన మల్లేష్, పైడి శ్రీరామమూర్తి, ఏఆర్ కానిస్టేబుళ్లు అడారి హేమ సుందరరావు, చింతపల్లి సత్యనారాయణ, రౌతు మహేష్, ఆబోతుల అప్పలనాయుడు, రుత్తల కన్నబాబు వీరిలో ఉన్నారు. పోలీసు విభాగంలో ఐజీలు విజయకుమార్ గుడి, వెంకటరావిురెడ్డి బలంకరి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలకు ఎంపికయ్యారు. రాష్ట్రానికి మరో 18 ప్రతిభా సేవా పతకాలు కూడా దక్కాయి. ఇందులో పోలీసు విభాగం నుంచి 14 మంది, అగ్నిమాపక శాఖ నుంచి ఇద్దరు, జైళ్ల శాఖ నుంచి ఇద్దరు ఉన్నారు.
పోలీసు విభాగం నుంచి ఎస్పీ గీతాదేవి వెలగ, ఏఎస్పీ ఐ. రామకృష్ణ, డీఎస్పీలు సుబ్బారావు తుమ్మల, జగ్గు నాయుడు పెంట, చంద్రమోహన్ సాదెపల్లి, కంజక్షన్ పసుపులేటి, అసిస్టెంట్ కమాండెంట్ మహబూబ్ బాషా సయ్యద్, ఆర్మ్‌డ్ పోలీస్ ఎస్‌ఐలు ఎం. రాంప్రసాద్, శేషపాణి పగడాల, బసవయ్య పొదిలి, ఏఎస్‌ఐలు మోహనరావు యలపు, చెంచురామయ్య నడిపినేని, హెడ్ కానిస్టేబుళ్లు శ్రీనివాసరాజు మంతెన, రాజారావు రోలుపల్లి ఎంఎస్‌ఎం పతకాలను సాధించారు.
ఇక అగ్నిమాపక శాఖ నుంచి డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ ఆఫీసర్ కాపు సత్యనారాయణ, ఫైర్‌మ్యాన్ జకరియా పెనుమాక ఎంపికయ్యారు. జైళ్ల శాఖ నుంచి సూపరింటెండెంట్ రాహుల్ శ్రీరామ, హెడ్ వార్డర్ అద్దంకి సూర్యప్రకాశరావు ప్రతిభా సేవా పతకాలకు ఎంపికయ్యారు.


