బీసీలకు మరో వెన్నుపోటు 34 % రిజర్వేషన్లు ఉత్తుత్తే! | Chandrababu has failed to fulfill his election promises | Sakshi
Sakshi News home page

బీసీలకు మరో వెన్నుపోటు 34 % రిజర్వేషన్లు ఉత్తుత్తే!

Aug 15 2026 4:46 AM | Updated on Aug 15 2026 4:46 AM

Chandrababu has failed to fulfill his election promises

ఆ హామీ అమలు చేయలేమని చేతులెత్తేస్తున్న చంద్రబాబు సర్కారు

డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక ద్వారా ఆ మాట చెప్పించిన వైనం!

గ్రామాల వారీగా జనాభా ప్రకారం రిజర్వేషన్లు అమలుచేయాలన్న నివేదిక

రెండేళ్ల కాలయాపన తర్వాత ఇప్పుడు తనకు అనుకూలంగా నివేదిక 

మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదంటూ కమిషన్‌ మెలిక 

చట్ట సవరణ చేసి హామీ అమలుచేయాలంటున్న బీసీ సంఘాలు

సాక్షి, అమరావతి: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు.. దానికి పంగనామాలు పెట్టేలా డెడికేటెడ్‌ కమిషన్‌ ద్వారా నివేదిక రూపొందించినట్లు తెలిసింది. అధికారంలోకి రాగానే ఆ హామీని అమలు చేయకుండా, దానిపై అధ్యయనం కోసం అంటూ  రాజీవ్‌ రంజన్‌ మిశ్రా నేతృత్వంలోని డెడికేటెడ్‌ కమిషన్‌ ఏర్పాటు చేశారు. మొత్తంగా రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదంటూ ఈ కమిషన్‌ తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. తద్వారా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యం కాదని చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం బీసీలకు 29 శాతం, ఎస్సీలకు 15, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తే మొత్తం రిజర్వేషన్ల శాతం 55 అవుతుంది.

అలా చేయాలంటే చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. ఇది తమ వల్ల కాదని చంద్రబాబు నేరుగా చెప్పలేక, కమిషన్‌ నోటితో చెప్పించారని స్పష్టమవుతోంది. ఆ నివేదికలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన గ్రామాల వారీగా అమలు చేయాలని సిఫారసు చేసినట్లు తెలిసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదనే నియమానికి లోబడే బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక సమర్పించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. స్థానిక సంస్థల వారీగా ఎక్కడ ఏ వర్గానికి రిజర్వేషన్‌ అమలు చేయాలో సిఫారసు చేస్తూ 1,500 పేజీల నివేదిక సమర్పించినట్లు సమాచారం.

మొత్తం 13 వేల పంచాయతీలు, 1.30 లక్షల వార్డులు, 6 వేల ఎంపీటీసీలు ఇతర స్థానిక సంస్థల వారీగా రిజర్వేషన్ల అమలు గురించి నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.  దీన్నిబట్టి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తాననే హామీని చంద్రబాబు బుట్టదాఖలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

రెండేళ్లుగా కాలయాపనే..
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నరపాటు ఆ విషయాన్నే పట్టించుకోలేదు. ఆ వర్గాల ఆందోళనతో ఈ ఏడాది ఫిబ్రవరిలో రిజర్వేషన్లు అమలు చేయకుండా దానిపై అధ్యయనం చేసేందుకు బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ను నియమించారు. రిజర్వేషన్లు ఎలా అమలు చేయాలో చెప్పాలని ఆ కమిటీకి సూచించి అందుకు 45 రోజుల గడువు ఇచ్చారు. అయితే ప్రతి 45 రోజులకోసారి ఆ గడువు పొడిగిస్తూ నివేదిక ఇవ్వకుండా సాగదీశారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండడంతో ఎట్టకేలకు తాజాగా తనకు అనుకూలంగా నివేదికను ఇప్పించుకున్నట్లు తెలిసింది. 

ఎవరి జనాభా ఎక్కువ ఉంటే వారికే ..
ఆ కమిషన్‌ జిల్లాల వారీగా జనాభాను అధ్యయనం చేసి వివరాలను నివేదికలో పొందుపరిచింది. ఇందుకోసం ఆయా వర్గాల నుంచి వినతులు స్వీకరించినట్లు కమిషన్‌ వర్గాలు తెలిపాయి. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే విషయాన్ని పక్కనపెట్టి.. ప్రాంతాల వారీగా బీసీ జనాభాను పరిగణనలోకి తీసుకుని స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్‌ కేటాయించాలని సూచించినట్లు తెలిసింది. 

గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని బీసీ జనాభాను అధ్యయనం చేసినట్లు తెలిసింది. ఆయా గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర వర్గాల జనాభాను పరిగణనలోకి తీసుకుని స్థానిక రిజర్వేషన్లు అమలు చేస్తే బాగుంటుందని సూచించినట్లు సమాచారం. అంటే ఇచ్చిన హామీ ప్రకారం 34 శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలు చేయడం కుదరదని తేల్చేసినట్లే. పైగా సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితికి మించకుండా అందరికీ రిజర్వేషన్‌ అమలు చేయాలని కమిషన్‌ ప్రత్యేక సూచన చేసినట్లు తెలిసింది. 

చట్ట సవరణ చేయకుండా ఇదేమి నాటకం?
చంద్రబాబు తీరుపై బీసీ వర్గాల్లో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చిత్తశుద్ధి ఉంటే జాతీయ స్థాయిలో ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ పార్లమెంట్‌లో చట్టం చేసి వర్తింపచేసినట్లే, బీసీ రిజర్వేషన్లకూ వర్తింపజేయవచ్చని చెబుతున్నారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేసేలా చట్ట సవరణ చేయకపోతే స్థానిక సంస్థల్లో చంద్రబాబు చెప్పిన బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు మోసపు మాటలుగానే మిగిలిపోతాయి. 

ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయని, అదే మాదిరిగా ఏపీలోనూ అమలు చేస్తే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అందించినట్లు అవుతుందని బీసీ సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు జన గణనతో పాటు కులగణన పూర్తి చేసి, జనాభా ప్రాతిపదికన ఆయా సామాజిక వర్గాలకు దామాషా పద్ధతిలో స్థానిక సంస్థల రిజర్వేషన్‌ కోట కేటాయించాలని బీసీ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ చేసిన కీలక సూచనలు 
⇒  సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ స్థాయి పదవులకు గ్రామం యూనిట్‌
⇒  ఎంపీటీసీ, మండల పరిషత్‌ పదవులకు మండలం యూనిట్‌
⇒ జెడ్పీటీసీ, జిల్లా స్థాయి పదవులకు జిల్లా యూనిట్‌
⇒  జెడ్పీ ఛైర్మన్‌లకు రాష్ట్రం యూనిట్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement