బరితెగించిన బీఎల్‌ఓల తీరుపై ఓటర్ల మండిపాటు
నెల్లూరు (బారకాసు) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా స్పెషల్ ఇన్‌సెంటివ్ రివిజన్ (సర్) ప్రక్రియ పూర్తిగా టీడీపీ కనుసన్నల్లోనే జరుగుతోంది. మంత్రి నారాయణ ఏకంగా బీఎల్‌ఓలతో సమీక్షించాక ఈ ప్రక్రియను పూర్తిగా టీడీపీ పర్యవేక్షణలోనే చేపడుతున్నారు. మంత్రి అండ చూసుకుని మున్సిపల్ కమిషనర్ నందన్, కమిషనర్ అండ చూసుకుని బీఎల్‌వోలు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించి బరితెగించి టీడీపీ బీఎల్‌ఏలు చెప్పినట్లు వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఓట్లు తొలగిస్తున్నారంటూ స్థానిక ఓటర్లు మండిపడుతున్నారు.
వాస్తవానికి.. బీఎల్‌వోలే ఓటర్ల చిరునామాను గుర్తించి స్వయంగా వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాన్ని సదరు ఓటరుకు అందజేసి పూరించి తిరిగి తీసుకుని ఆన్‌లైన్ చేయాల్సి ఉంది. ఒకవేళ ఓటరు చిరునామా తెలియకపోతే ఆ ప్రాంత అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన బీఎల్‌ఏల సహకారంతో సదరు ఓటరు వద్దకు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాన్ని అందజేయాల్సి ఉంది. అయితే, ఇక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతోంది. నెల్లూరు నగరం, 5వ డివిజన్‌లోని సత్యనారాయణపురంలో ఉన్న ఎస్వీఆర్ స్కూల్ సమీపంలో ఓ వాటర్ ప్లాంట్ వద్ద సోమవారం టీడీపీ బీఎల్‌ఏలు సమావేశమయ్యారు.
5వ డివిజన్ పరిధిలో 128 నుంచి 135వ నంబరు వరకు ఎనిమిది బూత్‌లు ఉన్నాయి. ఆయా బూత్‌ల పరిధిలో ఉన్న ఓటర్లలో తమ పార్టీకి అనుకూలమైన ఓటర్లను గుర్తించి వారిని మాత్రమే వాటర్‌ప్లాంట్ వద్దకు పిలిపించుకుని బీఎల్‌ఓలతో కలిసి అక్కడే ఎన్యూమరేషన్ ఫారాల పరిశీలన ప్రక్రియను నిర్వహించారు. ఇది తెలిసి తమకు ఫారాలు ఇవ్వకుండా కొందరికే ఇవ్వడంపై ఆ ప్రాంత స్థానికులు అగ్గివీుద గుగ్గిలమవుతున్నారు.


