వివాహితలకు కష్టాలే 'సర్‌'.. | Headaches in the Special Comprehensive Amendment Program of the Voters List | Sakshi
Sakshi News home page

వివాహితలకు కష్టాలే 'సర్‌'..

Jun 21 2026 4:14 AM | Updated on Jun 21 2026 4:14 AM

Headaches in the Special Comprehensive Amendment Program of the Voters List

2002లో భర్త పేరు బంధువుగా ఓటు  

ప్రస్తుత జాబితాలో తండ్రి పేరు బంధువుగా ఓటు  

2002, ప్రస్తుత ఓటర్ల జాబితాల మధ్య తేడాల్లో ఇదీ ఒక కారణమే 

సాక్షి, హైదరాబాద్‌: గతంలో భర్త పేరు.. ఇప్పుడు తండ్రి పేరును బంధువుగా ఓటర్ల జాబితాలో పేరు కలిగి ఉన్న మహిళలకు ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్‌)–2026 కార్యక్రమంలో తలనొప్పులు తప్పేటట్టు లేదు. చివరిసారిగా రాష్ట్రంలో సర్‌ కార్యక్రమాన్ని 2002లో నిర్వహించగా, నాటి జాబితాతో ప్రస్తుత ఓటర్ల జాబితాను అనుసంధానం (మ్యాపింగ్‌) చేసి వ్యత్యాసాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా గుర్తిస్తోంది. 2002 ఓటర్ల జాబితాలో భర్త పేరును బంధువుగా కలిగి ఉండి ... ప్రస్తుత ఓటర్ల జాబితాలో తండ్రి పేరును బంధువుగా ఓటు కలిగి ఉంటే మ్యాపింగ్‌ ప్రక్రియలో తార్కిక వ్యత్యాసంగా గుర్తించి వారికి సైతం నోటీసులు జారీ చేయనున్నారు.

2002 నాటి జాబితాలో తండ్రి పేరును బంధువుగా కలిగి ఉండి..ఆ తర్వాత పెళ్లి కావడంతో ప్రస్తుత జాబితాలో భర్త పేరు కలిగి ఉంటే ఇబ్బంది ఉండదు. కానీ, దీనికి భిన్నంగా భర్త పేరును తీసేసి తండ్రి పేరును బంధువుగా ప్రస్తుత జాబితాలో పేరును నమోదు చేసుకునే ఉంటే మాత్రం అలాంటి మహిళలు విచారణ హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.  ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లుండగా, ఇప్పటి వరకు 2,38,62,322 మంది (70.54శాతం) మంది ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తయింది. 

ఇప్పటి వరకు మ్యాపింగ్‌ జరిగిన ఓటర్లలో 89,88,175 (37.67) శాతం ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలున్నట్టు గుర్తించారు. వీరందరికీ ఎలక్టోరల్‌ రిజి్రస్టేషన్‌ అధికారులు (ఈఆర్‌ఓ) నోటీసులు జారీ చేసి నిర్దేశిత తేదీకి విచారణకు పిలుస్తారు. ఈ 11 రకాల తార్కిక వ్యత్యాసాలు ఇలా ఉన్నాయి. 

» 2002 ఓటర్ల జాబితాలోని తల్లిదండ్రుల పేర్లతో అనుసంధానమైన తోబుట్టువుల మధ్య వయస్సులో తేడా 9 నెలల కంటే తక్కువ ఉండడం.  
» తల్లిదండ్రులు, పిల్లల మధ్య వయస్సులో తేడా 15 ఏళ్ల కంటే తక్కువగా ఉండడం.  
» తల్లిదండ్రులు, పిల్లల మధ్య వయస్సులో తేడా 50 ఏళ్లకు మించి ఉండడం.  
» 2002 ఓటర్ల జాబితాలోని నానమ్మ/తాతయ్య పేర్లతో మ్యాపింగ్‌ జరిగితే వారి మధ్య వయసులో 40 ఏళ్ల కంటే తక్కువ తేడా ఉండడం.  
»  2002 ఓటర్ల జాబితా, ప్రస్తుత ఓటర్ల జాబితాల్లో వేర్వేరు తల్లిదండ్రుల పేర్లు కలిగి ఉండడం.  
» 2002 జాబితా, ప్రస్తుత జాబితాల్లో వేర్వేరు బంధుత్వం పేర్లు కలిగి ఉండడం. ఒక జాబితాలో తండ్రి ఉంటే మరో జాబితాలో తల్లి పేరు కలిగి ఉండడం.  
» 2002 జాబితాలో భర్త పేరు, ప్రస్తుత జాబితాలో తండ్రి పేరును బంధువుగా ఓటు కలిగి ఉండడం.  
» 2002 జాబితా, ప్రస్తుత జాబితాల్లో వేర్వేరు తండ్రి పేరు కలిగి ఉండడం. 
» 2002 జాబితా, ప్రస్తుత ఓటర్ల జాబితాల్లోని ఓటరు వయస్సుల్లో తేడాలుండడం. 
»ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు అప్‌లోడ్‌ చేయకపోవడం 
» కేవలం ఆధార్‌ మాత్రమే కలిగి ఉండడం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement