భూమి ఉన్నా.. అమ్ముకునే హక్కు లేనట్టే! | Telangana 22A Lands Controversy, Patta Landowners Trapped In Prohibited List, Unable To Sell Their Properties | Sakshi
Sakshi News home page

భూమి ఉన్నా.. అమ్ముకునే హక్కు లేనట్టే!

Aug 19 2026 7:51 AM | Updated on Aug 19 2026 9:27 AM

22A Lands Controversy in Telangana

గుర్రంపోడు మండల పరిధిలోని ఓ రైతుకు నాలుగెకరాల భూమి ఉండగా,  20 గుంటల భూమి కాల్వ తవ్వకంలో అధికారులు సేకరించారు. ప్రస్తుతం ఆ సర్వే నెంబరులో ఉన్న భూమి అంతా ప్రభుత్వ భూమిగా పడటంతో నిషేధిత జాబితాలో చేరిపోయింది. దీంతో భూమి తనవద్దే ఉన్నా, అమ్ముకునే హక్కును కోల్పోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

నల్లగొండ పట్టణ పరిధిలో 111 మంది భూ యజమానులకు సంబంధించిన సర్వే నెంబర్లు నిషేధిత జాబితాలో చేర్చారు. గంధంవారిగూడెం గ్రామ పరిధిలో 169 మంది రైతులకు సంబంధించిన సర్వే నెంబర్లను (97 ఎకరాలు) నిషేధిత జాబితాలోకి వెళ్లడంతో ఆందోళన చెందుతున్నారు. ఇలా ఒక్కో గ్రామంలో సగటున 150 చొప్పున భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయి.  

మిర్యాలగూడ డివిజన్‌కు చెందిన ఓ రైతు నుంచి 30 ఏళ్ల కిందట ప్రభుత్వ అవసరాల కోసం పదెకరాలు సేకరించింది. దానికి బదులు మరో ప్రాంతంలోని ప్రభుత్వ భూమిని ఆ రైతుకు కేటాయించింది. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్‌ స్థాయిలో అనుమతులు, తీర్మానాల అనంతరం ఆ భూమి పట్టా భూమిగా రైతుకు అప్పగించింది. అప్పటి నుంచి రికార్డుల్లోనూ అది పట్టా భూమిగానే కొనసాగుతోంది. ధరణి పోర్టల్‌ వచ్చిన సమయంలో పాత రికార్డుల ఆధారంగా ఆ భూమి ప్రభుత్వ భూమిగా పేర్కొని ఉండటంతో నిషేధిత జాబితాలోకి వెళ్లింది. దీంతో రైతు కుటుంబం రెవెన్యూ అధికారులను ఆశ్రయించింది. సంబంధిత రికార్డులను పరిశీలించిన అనంతరం ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించారు. సమస్య పరిష్కారమైందని భావించిన ఆ కుటుంబానికి ఇప్పుడు భూభారతిలో మళ్లీ అదే భూమి నిషేధిత జాబితాలో వెళ్లడంతో రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : భూమి వారిదే.. పట్టా వారి పేరుమీదే ఉంది. ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. రికార్డుల్లోనూ పట్టా భూమిగానే ఉంది. అవసరాలకు అమ్ముకుందామంటే మాత్రం నిషేధిత జాబితాలో ఉందని అడ్డు చెబుతున్నారు. భూమి ఉన్నా అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. అవసరానికి రుణం పొందలేని దుస్థితి ఏర్పడింది. సమస్యను పరిష్కరించుకునేందుకు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో అనేక మంది రైతులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. 

మళ్లీ అదే సమస్య..
ధరణి పోర్టల్‌ అమల్లోకి తెచ్చిన సమయంలో అనేక పట్టా భూములు ప్రభుత్వ భూముల జాబితాలోకి వెళ్లిపోయాయి. దీంతో రైతులు అధికారుల చుట్టూ తిరిగి పరిష్కరించుకున్నారు. కొందరు తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ తిరిగితే.. మరికొందరు కలెక్టర్‌ కార్యాలయం, సీసీఎల్‌ఏ వరకు వెళ్లారు. కొన్ని కేసుల్లో న్యాయస్థానాలను కూడా ఆశ్రయించాల్సి వచ్చింది. ఇప్పుడు భూభారతి అమల్లోకి రావడంతో మళ్లీ అవే వచ్చి పడ్డాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించే క్రమంలో నిషేధిత జాబితాను రూపొందించడంతో.. ప్రైవేట్‌ పట్టా భూములను అందులోకి చేర్చడంతో గందరగోళం నెలకొంది.  

1954 రికార్డులను ఆధారం చేసుకోవడంతోనేనా..
ధరణి పోర్టల్‌ అమల్లో ఉన్న సమయంలో 1954కు సంబంధించిన పాత రికార్డుల ఆధారంగా భూముల వివరాలను పరిశీలించడంతో అనేక భూములు ప్రభుత్వ భూములుగా నమోదయ్యాయి. వాస్తవానికి అవి ప్రభుత్వ అవసరాల కోసం రైతుల నుంచి సేకరించిన భూములకు ప్రత్యామ్నాయంగా ఇచ్చిన భూములు కావడం.. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్‌ స్థాయిలో అనుమతులతో పట్టాలుగా మారిన భూములు కావడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని సందర్భాల్లో ఒకే సర్వే నంబర్‌లో కొంత భూమిని మాత్రమే ప్రభుత్వం సేకరించింది. మిగిలిన భూమి రైతుల వద్దే ఉన్నప్పటికీ  మొత్తం సర్వే నంబర్‌ ప్రభుత్వ భూమిగా నమోదై నిషేధిత జాబితాలోకి వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి.

పట్టా భూములను వేరుచేయకపోవడంతోనే..
ప్రస్తుతం అమల్లోకి వచ్చిన భూభారతి రికార్డుల నవీకరణలోనూ పట్టా భూములను వేరే చేయకుండా సర్వే నెంబరు మొత్తాన్ని పాత పద్ధతిలోనే చేర్చడంతో ఈ సమస్య వచ్చింది. ప్రభుత్వ భూములను కాపాడే ఉద్దేశంతో ప్రభుత్వ భూములు, అసైన్డ్‌ భూములు, వక్ఫ్, దేవాదాయ భూములు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. ఈ ప్రక్రియలో ప్రైవేట్‌ వ్యక్తుల అధీనంలో ఉన్న పట్టా భూములను వేరు చేయకుండా సర్వే నెంబరు మొత్తాన్ని చేర్చడంతో పట్టా భూములు కూడా నిషేధిత జాబితాలోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం ఇలాంటి భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు రిజిస్ట్రేషన్, స్టాంప్స్‌ శాఖ ఐజీ స్థాయి నుంచి ఆన్‌లైన్‌లో అనుమతి రావాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాతే స్థానిక రెవెన్యూ అధికారులు రికార్డుల్లో మార్పులు చేసి నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement