కేబీఆర్‌ చుట్టూ వాహనదారులకు చుక్కలు | KBR Park One Way Trouble, Commuters Stuck In Hours Long Traffic Jams Across Hyderabad, Check More Details Inside | Sakshi
Sakshi News home page

KBR Park Traffic Issue: కేబీఆర్‌ చుట్టూ వాహనదారులకు చుక్కలు

Aug 19 2026 7:59 AM | Updated on Aug 19 2026 9:36 AM

KBR Park One Way Route

బంజారాహిల్స్‌:  కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్‌) పార్కు చుట్టూ మంగళవారం తెల్లవారుజాము నుంచి అమల్లోకి వచ్చిన వన్‌–వే ట్రాఫిక్‌ విధానం వాహనదారులకు చుక్కలు చూపింది. ఎక్కడికక్కడ వన్‌–వే బోర్డులు ఏర్పాటు చేసినా అయోమయం, అవగాహన కరువై... వాహనదారులు ఒకవైపు వెళ్లేందుకు ఇంకోవైపు నుంచి వచ్చారు. దీంతో ఉదయం నుంచే భారీగా వాహనాలు నిలిచిపోయాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, జర్నలిస్ట్‌ కాలనీ, రోడ్‌ నం.45 పరిసరాల్లో ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడ్డాయి. చాలాచోట్ల వాహనదారులు ట్రాఫిక్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎటువైపు వెళ్లాలి? అని అడగడం కూడా కొన్నిచోట్ల కనిపించింది.  

  • వన్‌–వే లేకముందు కేబీఆర్‌ చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్‌కు కి.మీ. దూరం వెళ్లడానికి 5 నుంచి 8 నిమిషాలు పట్టేది. ఇప్పుడు చుట్టూ 7 కి.మీ. తిరిగి వెళ్లాల్సి రావడంతో 36 నిమిషాలు పట్టింది. ఈ మార్గంలో వాహనదారులు తీవ్ర ఇబ్బంది చవిచూశారు.  

  • జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌–45 చౌరస్తా నుంచి చెక్‌పోస్టుకు వెళ్లడానికి గతంలో బారికేడ్లు పెట్టారు. వన్‌–వే తర్వాత తొలగించి నేరుగా వెళ్లే  అవకాశంకల్పించలేదు. దీంతో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.45 ఫ్లైఓవర్‌ కింది నుంచి యూ టర్న్‌ తీసుకున్నారు. మూడు కిలోమీటర్ల ప్రయాణానికి 25 నిమిషాలు పట్టింది. 

  • జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి నేరుగా బంజారాహిల్స్‌ వైపు బారికేడ్లు అడ్డుపెట్టారు. ఇటునుంచి వచ్చే వాహనదారులు చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ నానీస్‌ హోటల్‌ వద్ద యూటర్న్‌ తీసుకుని తిరిగి వెళ్లాల్సి వచ్చింది. 

  • జూబ్లీహిల్స్‌ వైపు నుంచి వచ్చేవారు కేబీఆర్‌ మీదుగా అటు పంజగుట్ట వైపు, ఇటు క్యాన్సర్‌ ఆస్పత్రి వైపు ఆగకుండా వెళ్లిపోతారని పోలీసులు ప్రకటించారు. కానీ, అడ్డదిడ్డంగా వెళ్తున్న వాహనదారులతో ప్రమాదాలు జరిగి, ట్రాఫిక్‌ నిలిచి ఎప్పటిలాగే వాహనాలు ఆపాల్సి వచ్చింది. క్యాన్సర్‌ ఆప్పత్రి వైపు వాహనాల రద్దీ తగ్గాకనే ఇటునుంచి వాహనాలను అనుమతించారు.  

  • బంజారాహిల్స్‌ రోడ్‌ నం.12 ప్రారంభం నుంచి అగ్రసేన్‌ చౌరస్తా వరకు గంటల తరబడి ట్రాఫిక్‌ స్తంభించింది. 

  • బంజారాహిల్స్‌ రోడ్‌ నం.2లో నాగార్జున సర్కిల్, వెంగళరావు పార్కు, టీవీ–9, సాగర్‌ సొసైటీ రోడ్లన్నీ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. శ్రీనగర్‌ కాలనీ, కమలాపురి కాలనీ, కృష్ణానగర్, యూసుఫ్‌గూడ, ఇందిరానగర్, వెంకటగిరి చౌరస్తాలు వాహనాలు పోటెత్తాయి. 

  • బంజారాహిల్స్‌ రోడ్‌ నం–14 పోలీస్‌స్టేషన్‌ రోడ్‌ కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుంది. అపోలో, స్టార్, రెయిన్‌బో, ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రులకు అంబులెన్స్‌లు నత్తనడకన వెళ్లాయి. వన్‌–వే తొలి రోజు సజావుగా సాగిందని, రెండ్రోజుల్లో అంతా సద్దుమణుగుతుందని ట్రాఫిక్‌ పోలీసులు పేర్కొంటున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement