breaking news
One Way Road
-
కేబీఆర్ చుట్టూ వాహనదారులకు చుక్కలు
బంజారాహిల్స్: కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) పార్కు చుట్టూ మంగళవారం తెల్లవారుజాము నుంచి అమల్లోకి వచ్చిన వన్–వే ట్రాఫిక్ విధానం వాహనదారులకు చుక్కలు చూపింది. ఎక్కడికక్కడ వన్–వే బోర్డులు ఏర్పాటు చేసినా అయోమయం, అవగాహన కరువై... వాహనదారులు ఒకవైపు వెళ్లేందుకు ఇంకోవైపు నుంచి వచ్చారు. దీంతో ఉదయం నుంచే భారీగా వాహనాలు నిలిచిపోయాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, జర్నలిస్ట్ కాలనీ, రోడ్ నం.45 పరిసరాల్లో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. చాలాచోట్ల వాహనదారులు ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎటువైపు వెళ్లాలి? అని అడగడం కూడా కొన్నిచోట్ల కనిపించింది. వన్–వే లేకముందు కేబీఆర్ చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్‌కు కి.మీ. దూరం వెళ్లడానికి 5 నుంచి 8 నిమిషాలు పట్టేది. ఇప్పుడు చుట్టూ 7 కి.మీ. తిరిగి వెళ్లాల్సి రావడంతో 36 నిమిషాలు పట్టింది. ఈ మార్గంలో వాహనదారులు తీవ్ర ఇబ్బంది చవిచూశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–45 చౌరస్తా నుంచి చెక్‌పోస్టుకు వెళ్లడానికి గతంలో బారికేడ్లు పెట్టారు. వన్–వే తర్వాత తొలగించి నేరుగా వెళ్లే అవకాశంకల్పించలేదు. దీంతో జూబ్లీహిల్స్ రోడ్ నం.45 ఫ్లైఓవర్ కింది నుంచి యూ టర్న్ తీసుకున్నారు. మూడు కిలోమీటర్ల ప్రయాణానికి 25 నిమిషాలు పట్టింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి నేరుగా బంజారాహిల్స్ వైపు బారికేడ్లు అడ్డుపెట్టారు. ఇటునుంచి వచ్చే వాహనదారులు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నానీస్ హోటల్ వద్ద యూటర్న్ తీసుకుని తిరిగి వెళ్లాల్సి వచ్చింది. జూబ్లీహిల్స్ వైపు నుంచి వచ్చేవారు కేబీఆర్ మీదుగా అటు పంజగుట్ట వైపు, ఇటు క్యాన్సర్ ఆస్పత్రి వైపు ఆగకుండా వెళ్లిపోతారని పోలీసులు ప్రకటించారు. కానీ, అడ్డదిడ్డంగా వెళ్తున్న వాహనదారులతో ప్రమాదాలు జరిగి, ట్రాఫిక్ నిలిచి ఎప్పటిలాగే వాహనాలు ఆపాల్సి వచ్చింది. క్యాన్సర్ ఆప్పత్రి వైపు వాహనాల రద్దీ తగ్గాకనే ఇటునుంచి వాహనాలను అనుమతించారు. బంజారాహిల్స్ రోడ్ నం.12 ప్రారంభం నుంచి అగ్రసేన్ చౌరస్తా వరకు గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది. బంజారాహిల్స్ రోడ్ నం.2లో నాగార్జున సర్కిల్, వెంగళరావు పార్కు, టీవీ–9, సాగర్ సొసైటీ రోడ్లన్నీ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. శ్రీనగర్ కాలనీ, కమలాపురి కాలనీ, కృష్ణానగర్, యూసుఫ్‌గూడ, ఇందిరానగర్, వెంకటగిరి చౌరస్తాలు వాహనాలు పోటెత్తాయి. బంజారాహిల్స్ రోడ్ నం–14 పోలీస్‌స్టేషన్ రోడ్ కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుంది. అపోలో, స్టార్, రెయిన్బో, ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రులకు అంబులెన్స్‌లు నత్తనడకన వెళ్లాయి. వన్–వే తొలి రోజు సజావుగా సాగిందని, రెండ్రోజుల్లో అంతా సద్దుమణుగుతుందని ట్రాఫిక్ పోలీసులు పేర్కొంటున్నారు. -
ఔటర్‌పై ‘వన్‌వే’ కష్టాలు
రాయదుర్గం: ఓఆర్ఆర్ సర్వీస్‌రోడ్డులో వన్‌వే ఏర్పాటు చేయడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నానక్‌రాంగూడ ఔటర్ జంక్షన్లో రెండు రోజులుగా భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. సోమవారం నుంచి ఈ వన్‌వేను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రారంభించారు. దీంతో నానక్‌రాంగూడ ఔటర్ జంక్షన్ నుంచి రోటరీ–1 నుంచి నార్సింగి వరకు వెళ్లే వాహనాలు మైహోమ్ అవతార్ వరకు వన్‌వే, నార్సింగి నుంచి వచ్చే వాహనాలు మైహోమ్ అవతార్ వద్ద లెఫ్ట్‌కు తీసుకొని నానక్‌రాంగూడ జంక్షన్‌కు వచ్చి అండర్‌పాస్ మీదుగా ఖాజాగూడవైపు వెళ్లాల్సి ఉంటుంది. ఈ కారణంగా ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు సాయంత్రం వేళల్లో రెండు గంటల పాటు వాహనాలు బారులుతీరుతున్నాయి. దీంతో ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇతర వాహనదారులు కనీసం గంటపాటు ట్రాఫిక్‌లో చిక్కుకొంటున్నారు. కొత్త నిబ«ంధనలతో నానా ఇబ్బంది పడాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. నానక్‌రాంగూడ ఔటర్ సర్వీసు రోడ్డులో రెండు వైపులా టూ వే ఉండడంతో ఎలాంటి సమస్యలు లేకుండా రాకపోకలు నిర్వహించేవి. కానీ రెండు రోజులలో కొత్త నిబంధనలు పెట్టి వన్‌వే ఏర్పాటు చేయడంతోనే ఈ సమస్య ఉత్పన్నమైందని వాహనదారులు వాపోతున్నారు. ముఖ్యంగా రాజేంద్రనగర్, నార్సింగి, మెహిదీపట్నం, అప్పా జంక్షన్ నుంచి సర్వీస్ రోడ్డులో నిత్యం పెద్ద సంఖ్యలో ఐటీ, ఇతర ఉద్యోగులు రాకపోకలు సాగిస్తారు. వారితోపాటు స్థానికులు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ విషయంలో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా రాకపోకలు నిర్వహించేలా, ఎక్కడా వాహనాలు ఆగకుండా చూడాలని కోరుతున్నారు. -
సైక్లింగ్ కోసం ప్రత్యేక ట్రాక్
నగరంలో సైకిళ్లను వినియోగించేవారిని ప్రోత్సహించాలని గుర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీజీ) కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా ఎనిమిది కిలోమీటర్ల పొడవైన ప్రత్యేక ట్రాక్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకు రూ. 15 లక్షల వ్యయమవుతుందని సంబంధిత అధికారులు అంచనా వేశారు. దీంతోపాటు మెట్రో రైల్ స్టేషన్ల వద్ద సైకిల్ స్టేషన్లను నిర్మించనున్నారు. సాక్షి, న్యూఢిల్లీ: సైకిళ్ల కోసం ప్రత్యేక ట్రాక్ నిర్మించాలని గుర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీజీ) యోచిస్తోంది. ఎనిమిది కిలోమీటర్ల పొడవుండే ఈ ట్రాక్ హుడా సిటీ సెంటర్ మెట్రో స్టేషన్ నుంచి మొదలై వన్ వే రోడ్, గలేరియా మార్కెట్ గుండా గోల్ఫ్ కోర్సు రోడ్ వద్ద ముగుస్తుంది. తక్కువ వ్యయంతో, ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ట్రాక్ నిర్మించడం కోసం గుర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ పలు డిజైన్లను పరిశీలిస్తోంది. ట్రాక్ నిర్మాణం వారం రోజులలో మొదలవుతుందని సంబంధిత అధికారులు అంటున్నారు. మామూలుగా వాహనాలు నడిచే రోడ్డుకు భిన్నంగా కనిపించడం కోసం సైకిల్ ట్రాక్‌లకు ప్రతే ్యక రంగు తో పెయింట్ చేస్తారు. వాటిపై రెట్రో రిఫ్లెక్టివ్ పెయింట్‌తో సైకిల్ లోగోలను పెయింట్ చేసి క్యాట్ ఐ లైట్లను అమరుస్తారు, ఈ మార్గంలో ఇతర వాహనాలు ప్రయాణించకుండా ఉండడం కోసం అక్కడక్కడా సైకిళ్లకు మాత్రమే అని తెలియజెప్పే సైనేజ్‌లను అమర్చడంతో పాటు బొల్లార్డ్ వంటి బారియర్లను ఏర్పాటుచేస్తారు. ఒక్కొక్క లేన్ 1.5 మీటర్ల వెడల్పు, నాలుగు మీటర్ల పొడవు ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు రూ. 15 లక్షల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు, గుర్గావ్లో సైక్లింగ్ చేసేవారు తక్కువని, నగరంలో సైక్లింగ్‌ను ప్రోత్సహించడం ప్రత్యేక ట్రాక్‌లు నిర్మిస్తున్నట్లు ఎంసీజీ కమిషనర్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఎక్కువ మంది సైకిళ్లను వాడేవిధంగా ప్రోత్సహిండం కోసం మెట్రో స్టేషన్ల ఎదుట సైకిల్ స్టేషన్లను నిర్మించాలని కూడా యోచిస్తున్నారు.


