‘సర్‌’పై పారాహుషార్‌ | KTRs direction to BRS leaders | Sakshi
Sakshi News home page

‘సర్‌’పై పారాహుషార్‌

Apr 17 2026 4:24 AM | Updated on Apr 17 2026 4:24 AM

KTRs direction to BRS leaders

బీఆర్‌ఎస్‌ నేతలకు కేటీఆర్‌ దిశానిర్దేశం

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో తెలంగాణలో జరగనున్న ఓటర్ల జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) కార్యక్రమంపై దృష్టి పెట్టి.. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడకుండా చూడాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు పార్టీ శ్రేణులకు  పిలుపునిచ్చారు. ‘సర్‌’పై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలకు గురువారం టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా కేటీఆర్‌ దిశా నిర్దేశం చేశారు. 

‘సర్‌’ను అడ్డుపెట్టుకుని ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలకు చెందిన లక్షలాదిమంది మద్దతుదారుల ఓట్లను బీజేపీ తీసివేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయని కేటీఆర్‌ చెప్పారు. ఇటీవలి జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలు, మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు చేర్పించి కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలుగా లబ్ధి పొందిన విషయాన్ని గుర్తుంచుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు తమ ఓట్లను కాపాడుకోవడంతో పాటు దొంగ ఓట్లు నమోదు కాకుండా చూడాలన్నారు. పోలింగ్‌ బూత్‌ల వారీగా దొంగ ఓటర్లను తొలగించేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. 

18 సంవత్సరాలు నిండిన యువతను ఓటరుగా నమోదు చేయించేందుకు పార్టీ తరఫున నియమించే బూత్‌ స్థాయి ఏజెంట్లు ప్రయత్నించాలని ఆదేశించారు. బూత్‌ లెవెల్‌ ఏజెంట్లకు పార్టీ తరఫున శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ‘సర్‌’’ అనేది రానున్న ఎన్నికలకు అత్యంత కీలకమని, దీనికి సంబంధించి ప్రతి ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బూత్‌ స్థాయి నుంచి సరిగ్గా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement