అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల కమిషన్
2,450 కంపెనీల కేంద్ర బలగాల మోహరింపు
బీజేపీకి కీలకంగా మారిన ఉత్తర బెంగాల్
పట్టు నిలుపుకునేందుకు టీఎంసీ యత్నం
బరిలో పలువురు ప్రముఖులు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నేడు తొలి దశ పోలింగ్ జరగనుంది. అసెంబ్లీలోని మొత్తం 294 స్థానాలకు గాను 152 సీట్లకు ఎన్నిక జరగనుంది. ఉత్తర బెంగాల్‌లోని 8 జిల్లాలతోపాటు ముర్షిదాబాద్, హుగ్లీ, నడియా, బిర్భూమ్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 54 సీట్లు బీజేపీకి కీలకంగా మారాయి.
ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పోలింగ్‌లో 3.60 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 167 మంది మహిళలు సహా మొత్తం 1,478 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. అత్యంత సమస్యాత్మకంగా గుర్తించిన 8 వేలకు పైగా పోలింగ్ స్టేషన్ల పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈసీ రికార్డు స్థాయిలో 2,450 కంపెనీల బలగాలను మోహరించింది. వీరితోపాటు ఫ్లయింగ్ స్క్వాడ్‌లను రంగంలోకి దించింది.
ప్రభావం చూపే కీలకాంశాలివే..
అవినీతి, నిరుద్యోగం వంటి కీలక అంశాల కంటే ఈసారి సామాజిక గుర్తింపు, పౌరసత్వం, ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు వంటి అంశాలకే ప్రాధాన్యం పెరిగిన విభిన్న పరిస్థితులు నెలకొన్న వేళ ఈ జిల్లాల్లో సాధించే ఆధిక్యాన్ని బట్టే బెంగాల్‌లో బీజేపీ అధికారం చేపట్టడం ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గట్టి ప్రతిపక్షంగా ఎదిగేందుకు ఉత్తర బెంగాల్‌లో సాధించిన ఫలితాలే కీలకంగా మారాయి.
ఇదే ఊపుతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దశలో ఈ ప్రాంతంలో ఉన్న 152 సీట్లకుగాను బీజేపీ 59 చోట్ల విజయం సాధించగా, అధికార టీఎంసీ 93 సీట్లు దక్కించుకుంది. ఉత్తరబెంగాల్‌లో బీజేపీ ప్రభావాన్ని అడ్డుకోవడం అధికార పక్షానికి కూడా చాలా కీలకం. ఎందుకంటే, ఇది రెండో దశతోపాటు రాష్ట్రంలో మొత్తం రాజకీయ వాతావరణంపైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
ప్రాంతాలేవైనా సర్ ఒక్కటే..
ఉత్తర బెంగాల్‌లో తేయాకు తోటలున్న జల్పాయ్‌గురి అలీపూర్‌దువార్, కొండప్రాంతాలైన డార్జిలింగ్, కాలింపాంగ్, రాజ్‌బన్షీలున్న కూచ్ బెహార్ ఉన్నాయి. సరిహద్దుల్లోని మల్దా, ఉత్తర దినాజ్‌పూర్, మైనారిటీల ప్రాబల్యమున్న ముర్షిదాబాద్, నడియాలున్నాయి. ఎన్ని తేడాలున్నప్పటికీ, ప్రతి జిల్లాలోనూ ఓటింగ్ సరళిని ప్రభావితం చేయనున్న ఏకైక అంశం ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) అనే చెప్పుకోవాలి. రాష్ట్రంలో సర్ కారణంగా 91 లక్షలకు పైగా పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారు. రాష్ట్రంలోని మొత్తం ఓట్లలో ఇవి సుమారు 12 శాతం. ఒక్క ముర్షిదాబాద్ జిల్లాలోనే 7.48 లక్షల ఓట్లు తొలగింపునకు గురయ్యాయి.
తర్వాత, నడియాలో 4.85 లక్షలు, మాల్దాలో 4.59 లక్షలు, ఉత్తర్ దినాజ్‌పూర్‌లో 3.63 లక్షలు, కూచ్ బెహార్‌లో 2.42లక్షలకు పైగా ఓట్లను పక్కనబెట్టారు. దీంతో, ఎన్నికల్లో ప్రచారాంశాలే ఏకంగా మారిపోయాయి. అవినీతి, నిరుద్యోగం, సంక్షేమ పథకాలు అప్రాధాన్యాంశాలు కాగా, పౌరసత్వం, చొరబాట్లు, బోగస్ ఓట్లు, తొలగింపునకు గురైన ఓటర్లు, విదేశీయులు వంటివాటికి ప్రాధాన్యం పెరిగిపోయింది. చొరబాట్లు, పౌరసత్వం అంశాలకు సర్‌ను రెఫరెండంగా బీజేపీ అభివర్ణించగా, నిజమైన ఓటర్లను ముఖ్యంగా మైనారిటీలు, వలస కార్మికులు, పేదల పేర్లను తొలగించారంటూ టీఎంసీ ప్రచారం చేసుకుంది.
బరిలో పలువురు ప్రముఖులు
మొదటి దశ బరిలో పలువురు ప్రముఖ నేతలున్నారు. ముఖ్యంగా నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి ఒకరు. 2021 ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీని ఆయన ఇక్కడ ఓడించారు. రాష్ట్రంలో బీజేపీ రాజకీయాలు ఈయన చుట్టూతా నడుస్తున్నాయి. ఈసారి ఇక్కడ సువేందుకు నమ్మినబంటుగా ఉన్న పబిత్రా కర్ టీఎంసీ తరఫున బరిలో ఉన్నారు. అదేవిధంగా, బహరంపూర్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత ఆధిర్ రంజన్ చౌదరి, బీజేపీ ఎమ్మెల్యే సుబ్రతా మైత్రా పోటీ పడుతున్నారు. మాతాభంగలో కేంద్ర మాజీ మంత్రి నిశిత్ ప్రామాణిక్ పోటీ చేస్తున్నారు. ఖరగ్‌పూర్ సదర్‌లో రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, టీఎంసీకి చెందిన ప్రదీప్ సర్కార్ తలపడుతున్నారు.
నన్ను భయపెట్టాలని చూస్తున్నారు: మమత
ఆమ్‌డాంగా(పశ్చిమ బెంగాల్): పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ భారీ సంఖ్యలో శాంతి భద్రతల కోసమంటూ సాయుధ బలగాలను మోహరించడంతోపాటు సీఆర్‌పీఎఫ్ వాహనాలను రంగంలోకి దించడంపై సీఎం మమతా బెనర్జీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లక్షలాదిగా బలగాలను తరలించి కేంద్రం తనను భయపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. సీఎం మమత బుధవారం ఉత్తర 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు.
‘సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్‌లతోపాట రైల్వే బలగాలను కూడా కేంద్రం ఇక్కడ ఎన్నికల కోసం తీసుకువచి్చంది ఎన్నికలంటే ప్రజాస్వామ్య పండగ మాత్రమే, ఎవరినీ చంపడానికి కాదు’ అంటూ వ్యాఖ్యానించారు. ‘ఎన్నికల కోసం బెంగాల్‌కు మునుపెన్నడూ లేని విధంగా సుమారు రెండు లక్షల కేంద్ర బలగాలను తీసుకువచ్చారు. ఇంత భారీ స్థాయిలో బలగాలను మోహరించి నన్ను భయపెట్టాలని చూస్తున్నారా?’అంటూ కేంద్రాన్ని ఆమె ప్రశ్నించారు.


