ఆగ్రహం వ్యక్తం చేసిన టీఎంసీ
కోల్‌కతా: ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న దిగ్గజ ఆర్థికవేత్త అమర్త్యసేన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) సర్వే సంబంధ నోటీస్‌ను జారీచేసింది. అమర్త్యసేన్, ఆయన తల్లి మధ్య వయసు వ్యత్యాసం కేవలం 15 సంవత్సరాలలోపే ఉన్నట్లు ఎస్‌ఐఆర్ సంబంధ దరఖాస్తులో పేర్కొనడంతో దీనిపై వివరణ కోరుతూ నోటీస్ పంపామని పశ్చిమ బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివరించారు.
పశ్చిమబెంగాల్‌లోని బోల్‌పూర్‌లోని శాంతినికేతన్‌లో సేన్ సొంతింటికి ఈ నోటీస్‌ను పంపించారు. ప్రస్తుతం అమర్త్యసేన్ విదేశాల్లో ఉండటంతో ఆయనకు ఈ విషయం తెలియజేస్తామని సేన్ కుటుంబసభ్యులు తెలిపారు. నోబెల్ పురస్కారంతో భారత్‌ను గర్వపడేలా చేసిన దిగ్గజ ఆర్థికవేత్తకు సైతం ఇలాంటి నోటీస్‌లు పంపడమేంటంటూ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈసీ సిగ్గుమాలిన పని చేసిందని ఆరోపించింది.


