కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంటున్న తరుణంలో రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన ప్రశ్న చక్కర్లు కొడుతోంది. 2021లో 77 సీట్లు సాధించిన బీజేపీ, ఈసారి కనీసం 100 సీట్ల మార్కును కూడా దాటలేకపోతే ఆ పార్టీ పరిస్థితి ఏమిటి? బెంగాల్ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఈ కీలక ఘట్టంలో ఓటర్ల జాబితా సవరణ (SIR) పేరిట జరిగిన వ్యూహాలు, నాయకత్వ లేమి బీజేపీకి అడ్డంకిగా మారనున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
చరిత్ర చెప్పిన చేదు నిజం
బెంగాల్ రాజకీయ చరిత్రను నిశితంగా గమనిస్తే, ఏ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా ఇంతవరకు 100 సీట్ల మార్కును దాటలేకపోయింది. అధికార పార్టీకి ఎప్పుడూ అసెంబ్లీలో మూడింట రెండొంతుల మెజారిటీ దక్కుతూ వస్తోంది. అంతేకాకుండా 1977 నుంచి జరిగిన పరిణామాలను పరిశీలిస్తే, అధికార పార్టీలను ఏ ఒక్క పార్టీ ఒంటరిగా గద్దె దించలేదు. 1977లో కాంగ్రెస్‌ను లెఫ్ట్ ఫ్రంట్ ఓడించగా, 34 ఏళ్ల కమ్యూనిస్టుల పాలనను తృణమూల్-కాంగ్రెస్ కూటమి అంతం చేయడం ఈ చారిత్రక వాస్తవాలకు నిదర్శనం.
లోక్‌సభ ఫలితాలే అసెంబ్లీకి పునాది
బెంగాల్‌లో మరో విచిత్రమైన రాజకీయ సంప్రదాయం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన ప్రతిపక్ష కూటములు, అంతకు ముందు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అగ్రస్థానంలో నిలిచాయి. 1977లో కమ్యూనిస్టులు, 2009లో తృణమూల్ కాంగ్రెస్ కూటమి లోక్‌సభలో సత్తా చాటిన తర్వాతే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాయి. కేంద్రం కంటే రాష్ట్ర ప్రభుత్వమే ప్రజల రోజువారీ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపుతుందనేది ఇక్కడి ఓటర్ల నమ్మకం. కానీ బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ (29 సీట్లు) చేతిలో ఓడిపోయి కేవలం 12 సీట్లకే పరిమితమైంది. ఈ ఫలితం కమలనాథులకు ఒక అతిపెద్ద ప్రతికూలాంశం.
ఓటర్ల జాబితా సవరణ.. ఒక వ్యూహాత్మక అస్త్రం?
పదేళ్ల పాటు మతపరమైన ధ్రువీకరణ, తృణమూల్ నేతలపై అవినీతి ఆరోపణలు చేసినప్పటికీ బీజేపీ ఆశించిన స్థాయిలో హిందూ ఓట్లను ఆకర్షించలేకపోయింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఉన్న 48 శాతం ఓటు బ్యాంకును దెబ్బతీయడానికే ఎన్నికల సంఘం ద్వారా ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) అనే భారీ ప్రక్రియను బీజేపీ తెరపైకి తెచ్చిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మమతకు మద్దతుగా నిలిచే ముస్లింలు, మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రక్రియను ప్రయోగించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బలమైన స్థానిక నాయకత్వ లేమి
బెంగాల్‌లో బీజేపీ ఓటు బ్యాంకు విస్తరణకు ప్రధాన ఆటంకం ప్రజాకర్షణ కలిగిన బలమైన స్థానిక నాయకుడు లేకపోవడం. జ్యోతి బసు రెండు దశాబ్దాల పోరాటం తర్వాత సీఎం కాగా, మమతా బెనర్జీ కూడా 90ల నుంచి విపక్షంలో ఉంటూ, సుదీర్ఘ పోరాటం చేసి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ప్రస్తుతం బీజేపీ ప్రధాన ముఖచిత్రంగా ఉన్న సువేందు అధికారి, 2020 వరకు మమత వెంటే ఉండి పార్టీ మారిన నాయకుడు. ప్రజల విశ్వాసాన్ని చూరగొనగలిగే స్థాయిలో ఆయనకు ప్రజాదరణ లేకపోవడం బీజేపీకి అతిపెద్ద లోపం.
వామపక్ష, కాంగ్రెస్ ఓటర్ల వలసలు
2011లో కేవలం 4 శాతంగా ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు, 2021 నాటికి 38 శాతానికి పెరగడం వెనుక వామపక్ష, కాంగ్రెస్ ఓటర్ల వలసలే ప్రధాన కారణం. 2018 నాటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తృణమూల్ సృష్టించిన తీవ్ర హింస (34.2% సీట్లు ఏకగ్రీవం) నుండి రక్షణ పొందేందుకు ఆ ఓటర్లు బీజేపీని ఒక సురక్షిత ఆశ్రయంగా భావించారు. అయితే, ఆ తర్వాత మమతా బెనర్జీ తన శ్రేణులను నియంత్రించడం, సంక్షేమ పథకాలను మరింత విస్తరించడంతో బీజేపీ వైపు ఓటర్ల వలసలు నెమ్మదించాయి.
బెడిసికొట్టిన వ్యూహం.. ప్రత్యామ్నాయాల వేట
బీజేపీ ప్రయోగించిన ‘సర్’ వ్యూహం బెడిసికొట్టి, ముస్లింలతో పాటు మతువా, రాజ్‌బన్షీ వంటి అణగారిన వర్గాలు, బెంగాలీయేతర వలసదారులు, సవర్ణ హిందువుల ఓట్లను కూడా గల్లంతు చేసిందనే ఆరోపణలున్నాయి. ఒకవేళ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 100 సీట్లు సాధించడంలో విఫలమైతే, తృణమూల్‌కు ప్రత్యామ్నాయంగా ఓటర్లు మళ్లీ కాంగ్రెస్ లేదా వామపక్షాల వైపు చూసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: ఢిల్లీలో ‘ఆప్’ క్లీన్ స్వీప్.. రాజ్యసభలో బీజేపీ రికార్డ్!


