ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై తెలంగాణ కాంగ్రెస్‌లో అలసత్వం కనిపిస్తోందా? క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదా? ఈ ప్రశ్నలకు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలే బలం చేకూరుస్తున్నాయి. ఎస్‌ఐఆర్ అంశాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని స్పష్టం చేసిన ఆయన.. పార్టీ ఆదేశాలను పట్టించుకోని నేతలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన టీపీసీసీ జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ సాధారణ అంశం కాదని, పేద ప్రజల హక్కులతో ముడిపడి ఉన్న కీలక ప్రక్రియ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో కొందరి తీరుపై అసహనం వ్యక్తం చేసిన ఆయన.. పని చేయని వారి పేర్లు చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దని, అవసరమైతే వారి స్థానంలో కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తామని హెచ్చరించే దాకా వెళ్లారు.
కొంతమంది నాయకులు ఎస్‌ఐఆర్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పీసీసీ మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాల వారీగా అవగాహన కార్యక్రమాలపై తన వద్ద పూర్తి నివేదిక ఉందని, ఎవరు పని చేస్తున్నారు.. ఎవరు చేయడం లేదన్న విషయం తనకు తెలుసని చెప్పారు. పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ తరఫున మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ఇన్‌ఛార్జ్ మంత్రులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో సర్పంచ్‌లను కూడా భాగస్వామ్యం చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పొరపాట్లు జరిగితే పేదల ఓటు హక్కు దెబ్బతినే ప్రమాదం ఉందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఓటు తొలగిపోతే భవిష్యత్తులో ఆధార్, రేషన్ కార్డులు వంటి సంక్షేమ ప్రయోజనాలపైనా ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి అన్యాయం జరగకుండా పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
పార్టీ ఆదేశాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసిన సీఎం రేవంత్.. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని క్షమించబోమని హెచ్చరించారు. మరో పది రోజుల సమయం ఇస్తున్నామని, ఈ వ్యవధిలో పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలని అన్నారు. లేకపోతే చర్యలు తప్పవని సంకేతాలు ఇచ్చారు.


