‘సర్‌’..వెరీ సీరియస్‌! | CM Revanth Reddy Serious Warning To MLAs Over SIR Issue | Sakshi
Sakshi News home page

‘సర్‌’..వెరీ సీరియస్‌!

Jun 25 2026 12:49 AM | Updated on Jun 25 2026 12:51 AM

CM Revanth Reddy Serious Warning To MLAs Over SIR Issue

జల వివాదాలపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు

ఓటరు జాబితా ప్రత్యేక సవరణను సీరియస్‌గా తీసుకోవాలి

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక

మీరు తీరు మార్చుకోకపోతే మీ స్థానంలో కొత్తవారు ఖాయం 

అర్హులైన వారి ఓట్లు పోతే సహించేది లేదు 

పోయేది ఓటు మాత్రమే కాదు.. సంక్షేమ పథకాలూ నిలిచిపోతాయి 

ఓట్లు తీసేసేవాళ్లు సమావేశాలు పెట్టుకుంటుంటే కాపాడాల్సిన వాళ్లు పెట్టుకోరా? 

మళ్లీ ఎమ్మెల్యే కావాలన్నా.. కొత్తగా ఎమ్మెల్యే కావాలన్నా ‘సర్‌’ను తీవ్రంగా పరిగణించండి 

అన్ని నివేదికలూ నా దగ్గర ఉన్నాయి.. 10 రోజులు సమయమిస్తున్నా 

మంత్రులకు సైతం సీఎం చురకలు ఎస్‌ఐఆర్‌పై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌చార్జులతో సమావేశం 

జిల్లాల వారీగా ఏ పార్టీ ఎన్ని సమావేశాలు పెట్టిందనే వివరాలు చదివిన సీఎం

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గట్టి ఝలక్‌ ఇచ్చారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమం విషయంలో చాలామంది ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ వైఖరిని మార్చుకోకపోతే వారి స్థానంలో కొత్తవారిని పార్టీ ఇన్‌చార్జులుగా నియమిస్తామని హెచ్చరించారు. ‘మీరు ఈసారి గెలుస్తారో, ఓడతారో మీ ఇష్టం. కానీ ‘సర్‌’లో పేదల ఓట్లు పోకుండా చూడాల్సిన బాధ్యత మీదే. పార్టీకి నష్టం కలిగితే చూస్తూ ఊరుకోం. మళ్లీ ఎమ్మెల్యే కావాలనుకున్నా, కొత్తగా ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్నా ఎస్‌ఐఆర్‌ను సీరియస్‌గా తీసుకోవాల్సిందే.

మీరేం చేస్తున్నారనే దానికి సంబంధించిన అన్ని నివేదికలూ నా దగ్గర ఉన్నాయి. 10 రోజుల సమయమిస్తున్నా. మీ తీరు మార్చుకోండి. లేదంటే మీ స్థానంలో కొత్త వారు వస్తారు..’ అని రేవంత్‌ స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్‌పై పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇన్‌చార్జులతో బుధవారం ఉదయం టీపీసీసీ ఆధ్వర్యంలో జూమ్‌ సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌ సావంత్‌తో పాటు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలనుద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 

వాళ్లు మీటింగ్‌ల మీద మీటింగ్‌లు పెడుతున్నారు.. 
    ‘ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, పోలింగ్‌ బూత్‌ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ నేతలు, కార్యకర్తలను అప్రమత్తం చేస్తూ, క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాల్సిన ఎమ్మెల్యేలు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు? పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తే సహించేది లేదు. ఓట్లు తీసేసే వాళ్లు విస్తృతంగా సమావేశాలు పెట్టుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లూ మీటింగ్‌ల మీద మీటింగ్‌లు పెడుతున్నారు.

ఓట్లను కాపాడాల్సిన పార్టీగా మనం ఎందుకు సమావేశాలు నిర్వహించడం లేదు? అధికారంలో ఉన్న పార్టీగా అన్ని హంగులూ అందుబాటులో ఉన్నా ఎందుకు వినియోగించుకోవడం లేదు? కేడర్‌ కూడా లేని కొత్తగూడెంలో బీజేపీ సమావేశాలు పెట్టింది. కనీసం కాంగ్రెస్‌ పార్టీ అత్యంత బలంగా ఉండే సూర్యాపేట జిల్లాలో మనం అవగాహన సమావేశాలు పెట్టుకోలేకపోయాం.  

ప్రజలకు అవగాహన కల్పించండి 
    ఓట్లు పోయిన తర్వాత పేదలు చాలా ఇబ్బంది పడతారు. కేవలం ఓట్లు మాత్రమే పోవు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు కూడా నిలిచిపోతాయి. వెంటనే డీడీలు కట్టండి. 2002 ఓటరు లిస్టు, ఇప్పటి ఓటరు లిస్టు తెప్పించుకుని సరి చూసుకోండి.

అర్హులైన వారి ఓట్లు పోవడానికి వీల్లేకుండా ప్రతి 10 పోలింగ్‌ బూత్‌లకు ఒక ఇన్‌చార్జిని నియమించండి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ సమన్వయకర్త ఉండాలి. ఈ నెల రోజులూ ఎస్‌ఐఆర్‌ కార్యక్రమం మీదనే పనిచేయాలి.  మనకు గ్రామాల్లో సర్పంచ్‌లున్నారు. వారి సహకారంతో ప్రజలకు అవగాహన కల్పించాలి. ఎస్‌ఐఆర్‌ గురించి గ్రామాల్లో డప్పు చాటింపులు వేయించాలి..’ అని రేవంత్‌ సూచించారు.  

హైదరాబాద్‌లో ఓకే 
    ఎస్‌ఐఆర్‌ కార్యక్రమంపై 33 జిల్లాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఎన్ని సమావేశాలు నిర్వహించాయో ప్రతి జిల్లా వారీగా సీఎం చదివి విన్పించారు. ‘హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సమావేశాలు బాగా జరిగాయి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌ లాంటి జిల్లాల్లో జరగడం లేదు. అన్ని జిల్లాల్లో పార్టీ కేడర్, నేతలతో సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయి యంత్రాంగానికి దిశానిర్దేశం చేయాలి.

పోలింగ్‌ బూత్‌ వారీగా ఓట్లను సరిచూసుకోవాలి..’ అని చెప్పారు. జిల్లాల వారీగా ఎస్‌ఐఆర్‌ కార్యక్రమంపై పార్టీ ఆదేశాలు అమలయ్యేలా ఇన్‌చార్జి మంత్రులు బాధ్యతలు తీసుకోవాలి. చొరవ తీసుకోకపోతే ఇన్‌చార్జి మంత్రులను కూడా మారుస్తాం..’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.  

అందరూ చురుగ్గా పాల్గొనాలి: మీనాక్షి 
    గురువారం నుంచి జరిగే ఎస్‌ఐఆర్‌ కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త చురుగ్గా పాల్గొనాలని మీనాక్షి నటరాజన్‌ కోరారు. గ్రామీణ పేదలు, నిరక్షరాస్యులకు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించాలని, గ్రామాల్లో టెంట్లు వేసుకుని ఓట్లను మ్యాపింగ్‌ చేయాలని సూచించారు. అర్హులైన వారు తమ ఓటు హక్కు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యతను కాంగ్రెస్‌ పార్టీ తీసుకోవాలని పిలుపునిచ్చారు. 

అందుకే టీఎంసీ ఓడిపోయింది: మహేశ్‌గౌడ్‌ 
మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. బీజేపీ దేశంలో చేస్తున్న రాజకీయాలను చూసిన తర్వాతైనా ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జులు ‘సర్‌’ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశ్చిమబెంగాల్‌లో కేవలం ఓట్ల చోరీతోనే బీజేపీ గెలిచిందని చెప్పారు. అక్కడ టీఎంసీ అప్రమత్తంగా లేకపోవడంతోనే అధికారం కోల్పోయిందని అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement