లేని పక్షంలో ముసాయిదా జాబితాలో పేరు తొలగింపు
సీఈఓ సుదర్శన్‌రెడ్డి స్పష్టీకరణ
మ్యాపింగ్ జరగకపోయినా/మ్యాపింగ్‌లో వ్యత్యాసాలున్నా నోటీసులు
విచారణకు హాజరై పుట్టిన ప్రాంతం ధ్రువీకరణకు 12 పత్రాల్లో ఒకదానిని ఇవ్వాలి
ఆన్‌లైన్‌లో కూడా ఎన్యూమరేషన్ ఫారం పూరించి సమర్పించవచ్చు
గుర్తింపు రుజువు కోసం ఆధార్ కార్డు స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా విస్తృత సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్/సర్)–2026 కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాన్ని బూత్ లెవల్ అధికారుల(బీఎల్‌ఓ)కు ఇవ్వని ఓటర్ల పేర్లను ముసాయిదా జాబితాలో తొలగిస్తారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సి.సుదర్శన్‌రెడ్డి చెప్పారు. బీఎల్‌ఓలు ఇంటింటికీ తిరిగి ప్రతి ఓటరుకు 2 ప్రతుల ఎన్యూమరేషన్ ఫారాన్ని అందజేస్తారని తెలిపారు. ఇళ్లకు తాళం వేసి ఉంటే బీఎల్‌ఓలు కనీస పర్యాయాలు ఆ ఇళ్లకు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారం ఇస్తారని స్పష్టం చేశారు. ఓటర్లకు సంబంధించిన పాక్షిక సమాచారంతో ఈ ఫారాలను ముందే ముద్రిస్తారన్నారు. మిగిలిన సమాచారాన్ని ఓటర్లు పూరించి ఒక ఫారం ప్రతిని తిరిగి బీఎల్‌ఓలకు జూలై 24లోగా అందజేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ దశలో ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్ (https://voters.eci.gov. in) ద్వారా కూడా ఎన్యూమరేషన్ ఫారాన్ని భర్తీ చేసి సమర్పించవచ్చని తెలిపారు. త్వరలో రాష్ట్రంలో ప్రారంభం కానున్న ‘సర్–2026’ కార్యక్రమంపై శనివారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ముసాయిదాలో ఈ ఓటర్ల తొలగింపు
‘అందుబాటులో లేని/ వలసవెళ్లిన/చనిపోయిన(అబ్సెంటీ, షిఫ్టెడ్, డెడ్) ఓటర్లను ముసాయిదా జాబితాలో తొలగిస్తారు. ఆయా కారణాలతో ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వలేకపోయిన ఓటర్ల జాబితాలను స్థానిక పోలింగ్ బూత్ వద్ద ప్రదర్శిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,68,18,902 పురుష, 1,71,02,883 మహిళా, 2,879 ట్రాన్స్‌జెండర్ ఓటర్లు కలిపి మొత్తం 3,39,24,664 మంది ఓటర్లున్నారు. వీరిలో 2,18,39,741 మంది (64.38శాతం) ఓటర్లను సర్–2002 జాబితా మేరకు మ్యాపింగ్ పూర్తి చేశాం.
ముసాయిదాలో ఉన్నా మ్యాపింగ్ కాకపోతే కష్టమే
ముసాయిదా ఓటర్ల జాబితాలో స్థానం పొందినప్పటికీ సర్–2002 జాబితాతో మ్యాపింగ్ కాలేకపోయినా, ఒక వేళ మ్యాపింగ్ జరిగినప్పటికీ పేర్లు, ఇతర వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నా.. వారిని జూలై 31 –సెప్టెంబర్ 28 మధ్య కాలంలో నోటీసులిచ్చి విచారణకు పిలుస్తారు. ఇలా నోటీసులు అందుకునే ఓటర్ల జాబితాలను ఓటర్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో)లు ప్రచురిస్తారు. ఈసీ నిర్దేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని తమ పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం రుజువుగా విచారణ సమయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్‌కార్డును ఓటరు గుర్తింపు నిర్థారణకు అనుమతిస్తారు..’అని సీఈఓ వివరించారు. వివరాల్లో వ్యత్యాసాలుంటే ఎదురయ్యే పరిస్థితులపై సీఈఓ ఒక ఉదాహరణ తెలిపారు. సర్–2002 ఓటర్ల జాబితాలో తన తండ్రి పేరు ‘నారాయణ’గా ఉండగా, ప్రస్తుత జాబితాలో ‘సి.నారాయణ’గా ఉండడంతో తాను సైతం విచారణకు హాజరై ‘మా నాన్న నారాయణే’అని రుజువులు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు/దరఖాస్తులను జూలై 31–ఆగస్టు 30 మధ్య స్వీకరించి పరిష్కరిస్తామని తెలిపారు. జూలై 31–సెప్టెంబర్ 28 మధ్య నోటీసుల జారీ/విచారణ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామన్నారు.
పుట్టిన తేదీ/ప్రాంతం రుజువు చేసుకోవాల్సిందే..
నోటీసు అందుకున్న ఓటర్లు తమ/తల్లిదండ్రుల పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతాన్ని రుజువు చేయడానికి ఈసీ నిర్దేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకదానిని రుజువుగా ఈఆర్వోలు/ఏఈఆర్వోల వద్ద విచారణకు హాజరై సమర్పించాల్సి ఉంటుంది.
– 1987 జూలై 1కి ముందు పుట్టిన ఓటర్లు తమ పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే సరిపోతుంది.
– 1987 జూలై 1 నుంచి 2004 డిసెంబర్ 2 మధ్య పుట్టిన ఓటర్లు తమతో పాటు తమ తల్లి లేదా తండ్రికి సంబంధించిన పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
– 2002 డిసెంబర్ 2 తర్వాత పుట్టిన ఓటర్లు తమతో పాటు తమ తల్లిదండ్రులిద్దరి పుట్టిన తేదీ/పుట్టిన ప్రాంతం ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
ఆధారంగా ఎన్నికల సంఘం నిర్దేశించిన పత్రాలు
– కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం/ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగి లేదా పెన్షనర్‌కు జారీ చేసిన గుర్తింపు కార్డు లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ – 01.07.1987కు ముందు ప్రభుత్వం/స్థానిక సంస్థలు/బ్యాంకులు/పోస్ట్ ఆఫీస్/ఎల్‌ఐసీ/ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా జారీ చేసిన గుర్తింపు పత్రాలు
– జనన ధ్రువీకరణ పత్రం
– పాస్‌పోర్ట్
– గుర్తింపు పొందిన బోర్డులు/విశ్వవిద్యాలయాలు జారీ చేసిన విద్యా సర్టిఫికెట్లు
– శాశ్వత నివాస సరి్టఫికెట్
– అడవి హక్కుల సర్టిఫికెట్
– ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ లేదా ఇతర కుల ధ్రువీకరణ పత్రం
– జాతీయ పౌరుల రిజిస్టర్ (అందుబాటులో ఉన్న చోట్ల)
– రాష్ట్ర/స్థానిక సంస్థలు తయారు చేసిన కుటుంబ రిజిస్టర్
– ప్రభుత్వం జారీ చేసిన భూమి/ఇంటి కేటాయింపు పత్రం
– ఆధార్ కార్డు (09.09.2025 నాటి ఈసీ సూచనలు వర్తిస్తాయి)


