సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ను నిలిపివేయాలన్న పిటిషనర్లకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. పలు రాష్ట్రాల్లో ప్రక్రియ కొనసాగుతున్నందున నిలుపుదల చేయలేమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశాశారు. అయితే పిటిషన్లపై విచారణ కొనసాగుతుందని పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను ఆయన ఆదేశించారు.
పలు రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లను బుధవారం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా.. ఎస్‌ఐఆర్ విషయంలో రాజకీయ పార్టీలు లేనిపోని భయాందోళనలు కలిగిస్తున్నాయి ఈసీ పేర్కొంది. ఈ క్రమంలో..
కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం డిసెంబర్ 1వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను వివరణ కోరింది. తదుపరి విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఎస్‌ఐఆర్ విషయంలో కేరళ ప్రభుత్వం రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది.
ఎస్‌ఐఆర్‌ను సవాల్ చేస్తూ వేరుగా పిటిషన్‌లో ఇప్పటికే(నవంబర్ 21వ తేదీన) సుప్రీం కోర్టు ఈసీకి నోటీసులు జారీ చేసింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేదాకా ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని వేసిన మరో పిటిషన్‌పైనే ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. డిసెంబర్ 9-11 తేదీల మధ్యలో కేరళలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగాల్సి ఉంది.
తమిళనాడు నుంచి ఎస్‌ఐఆర్‌కు అన్నాడీఎంకే మద్దతుగా అప్లికేషన్‌ను సమర్పించింది. అధికార డీఎంకే సహా అన్ని పార్టీలు వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై విచారణను డిసెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. పుదుచ్చేరి నుంచి ప్రతిపక్ష నేత ఆర్ శివ వేరుగా పిటిషన్ వేశారు. అలాగే..
పశ్చిమ బెంగాల్ నుంచి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ కమిటీ పిటిషన్లు వేసింది. ఈ పిటిషన్‌పై విచారణ డిసెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. అయితే.. అదే తేదీన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా విడుదల కావాల్సి ఉందని విషయం ధర్మాసనం దృష్టికి వెళ్లగా.. అవసరమైతే ఆ గడువును(డ్రాఫ్ట్ రోల్స్ ప్రచురణ) పొడిగించవచ్చని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
‘‘అవసరమని తేలితే ఎన్నికల సంఘాన్ని తేదీ పొడిగించమని ఆదేశించవచ్చు. ఆ తేదీ(డిసెంబర్ 9) కారణంగా కోర్టుకు అధికారమే లేదని చెప్పలేం. కోర్టు ఎప్పుడైనా తేదీ పొడిగించమని చెప్పగలదు’’ అని అన్నారాయన.
ఎస్‌ఐఆర్ ఉద్దేశ్యం
ఎస్‌ఐఆర్ అనేది ఓటర్ల జాబితా ఖచ్చితత్వం కోసం ఎన్నికల సంఘం చేపట్టే ప్రత్యేక సవరణ ప్రక్రియ. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ఇది వివాదాస్పదమై, సుప్రీం కోర్టుకు చేరింది. దీని ఉద్దేశం..
ఓటర్ల జాబితాలో తప్పులు సరిచేయడం
కొత్తగా అర్హులైన ఓటర్లను చేర్చడం
మరణించిన లేదా అర్హత కోల్పోయిన వారిని తొలగించడం
స్థానిక ఎన్నికలు లేదా ముఖ్యమైన ఎన్నికల ముందు జాబితా ఖచ్చితత్వం పెంచడం
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో..
- డ్రాఫ్ట్ రోల్స్ ప్రచురణ.. ప్రస్తుత ఓటర్ల జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచడం.
- అభ్యంతరాలు/సవరణలు స్వీకరణ.. ప్రజలు తమ పేర్లు లేకపోవడం, తప్పులు ఉండడం వంటి అంశాలను తెలియజేయవచ్చు.
- ఫీల్డ్ వెరిఫికేషన్.. అధికారులు ఇంటింటికీ వెళ్లి వివరాలు ధృవీకరిస్తారు.
- ఫైనల్ రోల్స్ ప్రచురణ – సవరణల తర్వాత తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు


