తాడేపల్లి : ఓటర్ల జాబితా సవరణపై అందరూ అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. పార్టీ శ్రేణులకు సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈరోజు(గురువారం, ఏప్రిల్ 30వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, పార్టీ ఐటీ, సోషల్ మీడియా, బూత్ కమిటీల అధ్యక్షులు, పలు జిల్లాల ప్రతినిధులు హాజరయ్యారు.
దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌కు సంబంధించి బూత్ కమిటీలు కీలకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ‘ పార్టీ ఓట్ల అక్రమ తొలగింపును అడ్డుకోవాలి. S.I.R పేరుతో అధికార పక్షం చేసే అవకతవకలను అడ్డుకోవాలి. మోసం చేయడంలో కూటమి నేతలు సిద్ధహస్తులు. 2019 ఎన్నికలకు ముందు మన పార్టీ వారి ఓట్లు 40 నుంచి 45 లక్షలు తొలగించారు. ఆ సమయంలో ఢిల్లీకి వెళ్లి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. 2002 నాటి ఓటర్ల జాబితాను ఆధారంగా తీసుకుని ఓటర్ల జాబితా సవరణ జరుగుతోంది. అప్పటి నుంచి రాష్ట్రంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.
1984 తర్వాత పుట్టి ఓటర్ల జాబితాలో ఉన్నవారు తిరిగి మళ్ళీ తమను తాము నిరూపించుకుంటేనే ఓటర్ల తుది జాబితాలో ఉంటారు. ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. తమిళనాడులో ఏకంగా 97 లక్షల ఓటర్లను తొలగించారు. మన దగ్గర SIR ప్రారంభానికి ముందే అవసరమైన డేటా మొత్తం సిద్ధం చేసుకోవాలి. జోన్‌ల వారీగా చురుకైన కార్యకర్తలను గుర్తించి వారికి తగిన శిక్షణ ఇవ్వాలి. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టీమ్‌లను సిద్ధం చేయాలి. S.I.R కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేద్దాం’ అని సజ్జల పేర్కొన్నారు.


