20 నుంచి పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): విద్యా హక్కు చట్టం 2026, 27 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత కోటా సీట్ల ప్రవేశాలకు ఈ నెల 20 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు శనివారం తెలిపారు. సీఎస్‌ఈ.ఏపీ.గవ్.ఇన్ వెబ్‌సైట్, గ్రామ, వార్డు సచివాలయాలు, మండల విద్యావనరుల కేంద్రం, సంబంధిత పాఠశాల నుంచి దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. విద్యార్ధులు 2020 జూన్ 2 నుంచి 2021 మే 31 మధ్య జన్మించి ఉండాలన్నారు. ఈ నెల 7 నుంచి 16 వరకు ప్రైవేటు పాఠశాలలు వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయాలన్నారు. 20 నుంచి మార్చి 10 వరకు విద్యార్థుల ఆన్‌లైన్ వివరాల నమోదు ఉంటుందన్నారు. మార్చి 17న గ్రామ, వార్డు సచివాలయాల డేటా ఆధారంగా ప్రవేశాలకు విద్యార్థుల అర్హత నిర్ధారణ చేస్తామన్నారు. 5న మొదటి విడత సీట్ల కేటాయింపు, మార్చి 6 నుంచి ఏప్రిల్ 7 వరకు ప్రవేశాల ధ్రువీకరణ , ఏప్రిల్ 12న రెండో విడత సీట్ల కేటాయింపు, ఏప్రిల్ 13 నుంచి 23 వరకు పాఠశాలల ద్వారా విద్యార్థుల ప్రవేశాల ధ్రువీకరణ ఉంటుందన్నారు. జిల్లా సమగ్ర శిక్షా సీఎంవోను 94415 64466 నంబర్‌లో సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చన్నారు.
వాడపల్లికి భక్తుల తాకిడి
ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున శ్రీ వేంకటేశ్వర సహిత ఐశ్వర్య లక్ష్మీ హోమం, సుప్రభాత సేవ, తొలి హారతి నిర్వహించి భక్తులను దర్శనాలకు అనుమతించారు. గౌతమీ గోదావరి నదిలో పుణ్యా స్నానాలు ఆచరించి క్యూ లో నిలబడి గోవింద నామాలు చెబుతూ మాడవీధులలో ఏడు ప్రదక్షిణలు చేసి, స్వామి వారిని దర్శించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వృద్ధులు, మహిళలు, పిల్లలకు దాతలు సమకూర్చిన ఎలక్ట్రిక్ వాహనాలపై కొత్త వంతెన నుంచి స్వామి వారి ఆలయానికి చేర్చారు. సుమారు లక్ష మంది స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి రూ.68,34,622 ఆదాయం వచ్చినట్టు దేవదాయ శాఖ ఉప కమిషనర్, ఆలయ ఈవో ఎన్.చక్రధరరావు తెలిపారు. రాత్రి ధర్మపథం కార్యక్రమంలో నిర్వహించిన నృత్య ప్రదర్శన అలరించింది. ఆలయ చైర్మన్ ఎం.వెంకటరాజు భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించారు.
బాలాజీ క్షేత్రంలో
భక్తజన కోలాహలం
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి వారి క్షేత్రం మాఘమాసం శనివారం సందర్భంగా కోలాహలంగా మారింది. స్వామివారి దర్శనానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఉభయ దేవేరులతో కొలువై ఉన్న శ్రీబాల బాలాజీ స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.3,09,353 ఆదాయం వచ్చిందని ఈఓ రాంబాబురెడ్డి తెలిపారు. స్వామి వారిని 8,500 మంది దర్శించుకున్నారన్నారు.


