రేల రేల రేలారే! | - | Sakshi
Sakshi News home page

రేల రేల రేలారే!

Feb 15 2026 7:30 AM | Updated on Feb 15 2026 7:30 AM

రేల రేల రేలారే!

రేల రేల రేలారే!

అది‘రేలా’.. అందరి మనసు దోచేలా.. రేల రేల రేలారే అంటూ చేసే కొమ్ము కోయ నృత్యం మన్యసీమకే వన్నె తెస్తోంది.. గిరిసీమ ప్రత్యేకతను చాటుతోంది.. గిరిజనుల సంప్రదాయంలో భాగమైంది.. ఇది కామన్‌వెల్త్‌, ఐపీఎల్‌లోనూ ప్రదర్శించడంతో ఇక్కడి కీర్తిని ఎగురవేస్తోంది.. అలాగే గిరిజన కళాకారులకు ఆదాయ వనరుగా మారింది. ఆ సంప్రదాయ నృత్యం పుట్టుక గురించి తెలుసుకుందాం రండి..

చింతూరు: గిరిజన సంస్కృతీ సంప్రదాయంలో ఆదివాసీ కొమ్ముకోయ నృత్యం ప్రధానమైంది. ఇది గిరిజన కళాకారులకు ఆదాయ వనరుగా మారింది. అలాంటి కొమ్ముకోయ నృత్యం పేరు చెబితే చింతూరు మండలం తుమ్మలకు చెందిన గిరిజన కళాకారులే ముందుగా గుర్తొచ్చేది.

పూర్వం తమ సొంత ఇళ్లలో శుభ కార్యాలతో ప్రారంభమైన కొమ్ముకోయ నృత్యం రాను రాను రాష్ట్రంలో వివిధ పండగలు, రాజకీయ పార్టీల కార్యక్రమాల సందర్భంగా జరిగే ఉత్సవాల్లో ఓ భాగమైంది. అనంతర కాలంలో దేశంలోని ఇతర రాష్ట్రాల్లో జరిగే సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు కామన్‌వెల్త్‌ గేమ్స్‌, ఐపీఎల్‌ ప్రారంభం, ముగింపు సంబరాల్లో సైతం ఈ నృత్యం ఎంతో ప్రాచుర్యం పొందింది.

నృత్యం ప్రారంభం ఇలా..

చింతూరు మండలం తుమ్మలకు చెందిన పట్రా ముత్యం తమ గ్రామానికి చెందిన కొంతమంది కళాకారులతో కలసి ఓ బృందాన్ని ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా కొమ్ముకోయ నృత్య ప్రస్థానం ప్రారంభమైంది. ముత్యం మృతి అనంతరం అతని కొడుకు రమేష్‌ ఈ పరంపరను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం తుమ్మలతో పాటు బుర్కనకోట, సరివెల, వేకవారిగూడెం, సుద్దగూడెం తదితర గ్రామాలకు చెందిన కళాకారులు సైతం ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలా చింతూరు మండలంలో ప్రస్తుతం 20 బృందాల వరకూ కొమ్ముకోయ నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. ఒక్కో ట్రూపులో ఈవెంట్‌ను బట్టి 20 నుంచి 40 మంది వరకూ సభ్యులు ఉంటారు. సభ్యుల్లో మహిళలు, పురుషులు ఉంటారు.

సాంస్కృతిక విభాగాల ఆధ్వర్యంలో..

సెంట్రల్‌ మినిస్ట్రీ ఆఫ్‌ కల్చర్‌, రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దేశం, రాష్ట్రంలో జరిగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో కొమ్ముకోయ నృత్య కళాకారుల ప్రదర్శనలకు అవకాశం కల్పిస్తున్నారు. వివిధ పండగల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా వీరు పాల్గొంటున్నారు. దీంతో పాటు కొన్ని సినిమాల్లో సైతం కొమ్ముకోయ నృత్య ప్రదర్శనను దర్శకులు పెడుతున్నారు. పుష్ప–2, గేమ్‌ ఛేంజర్‌, దేవదాసు–2, ఊరిపేరు భైరవకోన, దొంగలబండి, అమ్మాయినవ్వితే, శ్లోకం వంటి చిత్రాల్లో తమకు అవకాశం కల్పించినట్లు కొమ్ముకోయ నృత్య కళాకారులు తెలిపారు. ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు రవాణా ఖర్చులు, వసతి కల్పించడంతో పాటు ఒక్కొక్కరికీ రోజుకు రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తారని వారు తెలిపారు.

నృత్య ప్రదర్శన.. ప్రత్యేక ఆకర్షణ

గిరిజన సంస్కృతికి తగ్గట్టుగా దుస్తులు ధరించి పురుషులు ఎద్దు కొమ్ములు, నెమలి ఈకలతో కూడిన తలపాగా చుట్టుకుని, పెద్ద డోలు పట్టుకుని దానిని వాయిస్తూ ఉంటారు. మహిళలు తమ తలకు రిబ్బన్‌ చుట్టుకుని అందులో నెమలి ఈకలను పెట్టుకుని, కాళ్లకు గజ్జెలు కట్టుకుని పురుషులు వాయించే డోలు వాయిద్యానికి అనుగుణంగా నాట్యం చేస్తుంటారు. ముందుగా నెమ్మదిగా ప్రారంభమయ్యే ఈ నృత్యం క్రమేపీ వేగం పుంజుకొంటుంది. నృత్యం ముగింపులో పొట్టేళ్ల మాదిరిగా పురుషులు తమ కొమ్ములతో ఒకరినొకరు కొట్టుకోవడం ఈ నృత్యానికే ఆకర్షణగా నిలుస్తోంది. దుస్తుల అలంకరణలో సైతం వీరు వైవిధ్యాన్ని పాటిస్తారు. పురుషులు ఎర్ర దుస్తులు ధరిస్తే మహిళలు పచ్చ దుస్తులు ధరిస్తారు.

ఫ కొమ్ముకోయ నృత్యం అదిరేలే

ఫ గిరిజన సంప్రదాయంలో ప్రత్యేకం

ఫ కామన్‌వెల్త్‌, ఐపీఎల్‌లో ప్రదర్శనలు

Advertisement
 
Advertisement
Advertisement