కేశవో.. నారాయణో! | - | Sakshi
Sakshi News home page

కేశవో.. నారాయణో!

Feb 15 2026 7:30 AM | Updated on Feb 15 2026 7:30 AM

కేశవో.. నారాయణో!

కేశవో.. నారాయణో!

సాక్షి, రాజమహేంద్రవరం: చంద్రబాబు ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌ ప్రజలను దగా చేసేలా ఉంది. శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ శనివారం రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో అన్ని వర్గాలకు అన్యాయం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తరువాత మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళలు, యువత, సంక్షేమం ఇలా అన్ని రంగాలకు, వర్గాలకు అన్యాయం జరిగింది. కేటాయింపుల్లో కోత విధించి ప్రజలను మోసం చేశారు. ఇటు వార్షిక, అటు వ్యవసాయ బడ్జెట్‌లో అన్నీ కోతలే విధించారు. పలు రంగాలకు సగం కంటే తక్కువ నిధులు కేటాయించారు. రైతులు, మహిళలను దారుణంగా మోసం చేశారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తా రని భావించిన ప్రజలకు నిరాశే ఎదురైంది. కూటమి బడ్జెట్‌పై మేధావులు, రైతు సంఘాల నేతలు పెదవి విరుస్తున్నారు. ఇంత దారుణమైన బడ్జెట్‌ తాము ఎన్నడూ చూడలేదని నిట్టూరుస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల్లో సైతం వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

నిరుద్యోగులకు దగా...

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిరుద్యోగుల ప్రస్తావనే లేకుండా వారిని నిట్టనిలువునా మరోసారి మోసం చేశారు. నిరుద్యోగ భృతికి నయా పైసా కూడా కేటాయించలేదు. జిల్లా వ్యాప్తంగా లక్షల మంది నిరుద్యోగులకు అన్యాయం చేశారు.

రైతులకు పంగనామాలు

అన్నదాత సుఖీభవ పథకంలో ఏడాదికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ఎన్నికల వేళ చెప్పారు. తాజా బడ్జెట్‌లో అరకొర కేటాయింపులు జరిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలతో కలిపి ఇస్తామంటూ మెలిక పెట్టారు. జిల్లా వ్యాప్తంగా 1.22 లక్షల రైతు కుటుంబాలున్నాయి. అన్నదాత సుఖీభవకు రాష్ట్రవ్యాప్తంగా కేవలం రూ.6,600 కోట్లు మాత్రమే కేటాయించారు. జిల్లాలో రైతులకు అందే ఆర్థిక సాయంలో భారీగా కోత పడనుంది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఏటా రైతు భరోసా కింద రూ.90.55 కోట్ల చొప్పున చెల్లించింది. ఈ బడ్జెట్‌లో కౌలు రైతులను ఆదుకోనేలా కేటాయింపులు లేవు.

పర్యాటక రంగానికి అరకొరగా..

జిల్లాలో టెంపుల్‌, ఎకో, కెనాల్‌ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఇటీవల మంత్రి దుర్గేష్‌ ప్రకటించారు. గోదావరి కాలువ, రాజమహేంద్రవరంలోని చారిత్రాత్మక హేవలాక్‌ బ్రిడ్జి, కడియం నర్సరీలను కలుపుతూ సర్క్యూట్‌గా అభివృద్ధి చేసే ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. కానీ బడ్జెట్లో మాత్రం ఆ మేరకు పూర్తి స్థాయిలో కేటాయింపు జరగలేదు. రాజమహేంద్రవరాన్ని టూరిజం హబ్‌గా ప్రకటించలేదు.

ప్రభుత్వ పాఠశాలలపై చిన్న చూపు

ఈ బడె్‌జ్‌ట్‌ ప్రభుత్వ పాఠశాలలపై చిన్న చూపు ప్రదర్శించింది. పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,500 కోట్లు కేటాయించారు. జిల్లా వాటాగా కలిగిన ప్రయోజనం అంతంత మాత్రమే. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో నాడు–నేడు పాఠశాలల అభివృద్ధికి ఒక్క తూర్పుగోదావరి జిల్లాకే రూ.250 కోట్లకు పైగా కేటాయించారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ, ఐబీ, రూఫెల్‌ నిలిపివేస్తున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రకటించారు. గత ప్రభుత్వం చేసిన సంస్కరణల అమలును రాజకీయ దురుద్దేశంతోనే ఆపేశారనన అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఉద్యోగులకు బిగ్‌ షాక్‌

ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం బిగ్‌ షాక్‌ ఇచ్చింది. పీఆర్‌సీ, ఐఆర్‌ ప్రస్తావన లేకుండా బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. సీపీఎస్‌ రద్దును ఎక్కడా ప్రస్తావించలేదు. అధికారంలోకి రాగానే ఐఆర్‌ ఇస్తామని హామీ ఇచ్చింది. మూడు బడ్జెట్‌లు అవుతున్న ఇవ్వకపోవడపై ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు.

పుష్కరాలకు నిధులేవి?

2027లో వచ్చే గోదావరి పుష్కరాలకు నిధుల కేటాయింపు మరీ తక్కువగా ఉంది. పుష్కర ఏర్పాట్లకు కేవలం రూ.60 కోట్లు కేటాయించారు.

నిరాశ మిగిల్చిన చంద్రబాబు

ప్రభుత్వ బడ్జెట్‌

కేశవ్‌ పద్దులో అన్ని రంగాలకు,

వర్గాలకు అన్యాయం

కేటాయింపుల్లో భారీగా కోతలు

జిల్లా వాసులకు ఒరిగింది శూన్యం

మహిళలకు మొండి చేయి

నిరుద్యోగులకు మరోసారి టోపీ

అన్నదాత సుఖీభవకు అరకొర విదిలింపు

తల్లికి ద్రోహం....

తల్లికి వందనం పేరుతో పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15,000 ఇస్తామన్నారు. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.12 వేల కోట్లకు పైగా అవసరంగా కేవలం రూ.9,668 కోట్లు మాత్రమే కేటాయించారు. దీంట్లో జిల్లా వాటాగా భారీ తగ్గే అవకాశం ఉంది. ఈ పథకాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్న చెప్పినా ఒక ఏడాది ఎగనామం పెట్టారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1.70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పథకంలో ఏటా రూ.243 కోట్లు అందించేవారు. ప్రస్తుత బడ్జెట్‌ కేటాయింపులను బట్టి చూస్తే పథకంలో భారీగా కోత పడే అవకాశం ఉంది.

మహిళలకు మోసం

మహిళా అభ్యున్నతికి పాటుపడతామని ఉపన్యాసాలు ఇచ్చిన చంద్రబాబు బడ్జెట్‌ కేటాయింపుల్లో దారుణంగా మోసం చేశారు.

19 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18,000 ఇస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చారు. కానీ బడ్జెట్లో నిధులు కేటాయించలేదు.

ఉచిత గ్యాస్‌ హామీ తుస్‌

ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చి ఏడాది ప్రారంభంలో రెండు సిలిండర్లు వరుసగా ఇచ్చి ఎగనామం పెట్టారు. పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దశల వారీగా అందజేస్తున్న ఉచిత సిలిండర్ల లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత విధించారు. ఇప్పటి వరకు ఉచిత సిలిండర్లు అందించిన ఐదు విడతల్లో జిల్లావ్యాప్తంగా 15.20 లక్షల సిలిండర్లు ఇచ్చినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. జిల్లాలో 5.69 లక్షల రేషన్‌ కార్డులున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఒక్కో దశలో 5.60 లక్షల సిలిండర్లు ఇవ్వవలసి ఉంది. ఇలా ఆరు సార్లు ఇవ్వవలసి ఉంది. అంటే సుమారుగా 34.14 లక్షల సిలిండర్లు లబ్ధిదారులకు చేరవలసి ఉంది. కానీ కేవలం 15.20 లక్షల మందికి మాత్రమే అందజేశారు.

సున్నా వడ్డీకి గుండుసున్నా

ఎన్నికల సమయంలో రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు అందజేస్తామని డ్వాక్రా మహిళలకు హామీ ఇచ్చారు. ప్రస్తుత బడ్జెట్లో ఆ ప్రస్తావనే లేదు.

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఒక్కో ఏడాదీ 33,498 గ్రామీణ ప్రాంత స్వయం సహాయక సంఘాలకు రూ.37.27 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని 6,680 సంఘాలకు రూ.8.42 కోట్ల వడ్డీ రాయితీ అందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement