పాదగయ పిలుస్తోంది
● మహా శివరాత్రికి ఏర్పాట్లు
● సిద్ధమవుతున్న పుష్కరిణి
● 13 నుంచి ఉత్సవాలు ఆరంభం
పిఠాపురం: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయ క్షేత్రం భక్తులను రా రమ్మని పిలుస్తోంది.. మహా శివరాత్రి ఉత్సవాలకు ఇప్పటి నుంచే ముస్తాబవుతోంది.. ఈ నెల 13న శివరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది. శివరాత్రి మహాత్సవాలను కన్నుల పండువగా నిర్వహించడానికి సర్వం సిద్ధమవుతోంది. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని పాదగయ క్షేత్రాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. ఉత్సవాల ప్రారంభం నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉండడంతో ప్రత్యేక పూజలు అభిషేకాలు, అర్చనలు, కుంకుమ పూజలకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ప్రఖ్యాత శైవ క్షేత్రాల్లో పాదగయ క్షేత్రం ప్రాధాన్యం కలిగి ఉంది. మహా శివరాత్రి పర్వదినాల్లో ఈ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ ఉత్సవాలు పురస్కరించుకుని వారం రోజుల పాటు నిత్యం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ప్రత్యేక లక్షపత్రి పూజలు, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించనున్నారు. త్రిగయా క్షేత్రాల్లో పిఠాపురంలో వేంచేసియున్న పాదగయ క్షేత్రం అత్యంత ప్రాచీన దివ్య శైవ క్షేత్రం.
పుణ్యస్నానంతో పునీతం
పాదగయ పుష్కరిణిలో పుణ్యస్నానం చేస్తే పునీతం అవుతారని భక్తుల విశ్వాసం. అందుకే ఏటా వేలాది మంది భక్తులు వచ్చి ఈ పుష్కరిణిలో స్నానాలు ఆచరిస్తుంటారు. మహా శివరాత్రి ఉత్సవాల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన ఈ పుణ్య స్నానాలకు పుష్కరిణిని సిద్ధం చేస్తున్నారు. ఇటీవల అందులో పాత నీరు తొలగించిన అఽధికారులు పూర్తిగా శుభ్రం చేసి మరమ్మతులు నిర్వహిస్తున్నారు. కొత్త నీటితో నింపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది భక్తులు ఒకేసారి పుణ్య స్నానాలు ఆచరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ అధికారులు వివరిస్తున్నారు.
13న కుక్కుటేశ్వరుని కల్యాణం
పాదగయ క్షేత్రంలో రాజరాజేశ్వరీ సమేత ఉమా కుక్కుటేశ్వరస్వామివారి దివ్య కల్యాణం ఈ నెల 13న రాత్రి 8.32 గంటలకు నిర్వహించనుండగా, 14న స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరుపనున్నారు. 15వ తేదీ మహా శివరాత్రి ఉత్సవం, 16న మధ్యాహ్నం 3 గంటలకు నాకబలి, దండాడింపు, దొంగలదోపు ఉత్సవాలు, స్వామివారి రథోత్సవం, 18న స్వామివారి త్రిశూల స్నానం, తెప్పోత్సవం, శ్రీపుష్పోత్సవం నిర్వహించనున్నారు. ప్రపంచ స్థాయిలో దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయ క్షేత్రంతో పాటు సకలేశ్వరస్వామి, సోమేశ్వరస్వామి ఆలయాలతో పాటు గొల్లప్రోలు మండలం దుర్గాడలోని ఉమారామలింగేశ్వరస్వామి, గొల్లప్రోలులో ప్రసిద్ధి చెందిన ఉమారామలింగేశ్వరస్వామి, చేబ్రోలులో పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి, తాటిపర్తిలో అపర్ణాసమేత నాగేశ్వరస్వామివారి ఆలయాల్లోనూ ఉత్సవాలు జరుగనున్నాయి.
భారీ ఏర్పాట్లు చేస్తున్నాం
ఈ ఏడాది మహా శివరాత్రి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లా కలెక్టర్, ఎస్పీ, దేవదాయ శాఖ ఉన్నతాధికారుల తదితరులు ఇప్పటికే పలు సూచనలు చేశారు. వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే భక్తుల సౌకర్యార్థం మౌలిక వసతులపై దృష్టి పెట్టాం. అందరికీ స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తాం. అంతా పుణ్యస్నానాలు ఆచరించే విధంగా పాదగయ పుష్కరిణిని సిద్ధం చేస్తున్నాం. తగిన విధంగా క్యూలైన్లు నిర్మిస్తాం.
–కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్,
పాదగయ ఈఓ, పిఠాపురం
పాదగయ పిలుస్తోంది
పాదగయ పిలుస్తోంది
పాదగయ పిలుస్తోంది


