సైనిక సంక్షేమ నిధికి రూ.5.85 లక్షల విరాళం
సీటీఆర్‌ఐ: జిల్లా సైనిక సంక్షేమ నిధికి జిల్లాలోని 2 మున్సిపాలిటీలు, ఒక నగర పాలక సంస్థ పరిధిలోని మెప్మా స్వయం సహాయక సంఘాల మహిళలు తమ వంతు రూ.5,85,288 విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కీర్తి చేకూరికి ఆ మొత్తం చెక్కును అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మెప్మా మహిళలు రూ.10 చొప్పున స్వచ్ఛందంగా విరాళం అందించి దేశ రక్షణ కోసం విధులు నిర్వహిస్తున్న సైనికుల సంక్షేమానికి తమ మద్దతు తెలియజేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సైనిక సంక్షేమ నిధికి విశేష సహకారం అందించిన మెప్మా పీడీ టి.కనకరాజు, మెప్మా జిల్లా సమాఖ్య సభ్యులు, సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు ఎస్.బాల సరస్వతి, జిల్లా సిబ్బంది పి.శ్రీదేవి, ఎంఈ ఫణి కుమార్, ఎస్‌హెచ్‌జీ మహిళలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


