రాజమహేంద్రవరం రూరల్: మహామహోపాధ్యాయ శలాక రఘునాథశర్మ ‘ఆర్ష వాగ్వ్యాఖ్యానదీక్షిత’ బిరుదును అందుకున్నారు. కొంతమూరులోని దత్తాత్రేయ వేదవిద్యా గురుకులం ఆధ్వర్యాన మండపేట విజయా కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారాన్ని అందించారు. గురుకులం వ్యవస్థాపక అధ్యక్షుడు గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనపాఠి ఈ బిరుదును శలాకకు ప్రదానం చేశారు. ఆర్ష విద్యా వ్యాప్తికి శలాక చేస్తున్న కృషి శృంగేరి పీఠాధిపతుల ప్రశంసలను సైతం అందుకుందని ఈ సందర్భంగా గుళ్లపల్లి అన్నారు. తనకు జరిగిన సత్కారానికి శలాక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో తన కృషిని కొనసాగిస్తానని చెప్పారు. కార్యక్రమంలో గుళ్లపల్లి ఆంజనేయ ఘనపాఠి, మల్టీటెక్ సంస్థ అధినేత వెంకట్రావు, నిడదవోలు మండలం కోటసత్తెమ్మ ఆలయ వంశపారంపర్య ధర్మకర్త దేవులపల్లి రవిశంకర్, సినీ నటుడు జూనియర్ రేలంగి, పలువురు వేద పండితులు పాల్గొన్నారు.


