పిఠాపురం: ఔషధ విలువలు కలిగిన చెట్టు అది.. అనేక రోగాల నివారణకు ఉపయోగపడుతోంది.. అలాంటి వేప చెట్లకు వింత వ్యాధి సోకింది.. ఇది ఓ ప్రకృతి వైపరీత్యమేనని నిపుణులు అంటున్నారు. వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిగా, ఆరోగ్యప్రదాయినిగా భావించి పూజిస్తారు. ప్రాచీన కాలం నుంచి వేప చెట్టు పవిత్ర వృక్షంగా పిలవబడుతోంది. మన సంస్కృతీ సంప్రదాయాల్లో విశిష్ట స్థానం ఉంది. ప్రతి ఇంటి వద్ద వేప చెట్టును పెంచుకుంటారు. దాని గాలి తగిలినా వ్యాధులు దరిచేరవని సాంకేతికంగా కూడా నిరూపణ కావడంతో ఈ చెట్టును అందరూ పెంచుకుంటారు. గతంలో ఈ చెట్టు లేని ఇల్లు ఉండేది కాదు. వేప పుల్లతోనే పళ్లు తోముకునే వారు ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. వేప గాలి సోకిదంటే చాలు రోగాలు మాయమవుతాయని అంటారు. అలాంటి ఆరోగ్యప్రదాయిని అయిన వేప చెట్లకే పెద్ద ఆపద వచ్చింది. ఎక్కడ చూసినా ఈ చెట్లు ఎండిపోతున్నాయి. ఇండియన్ హెర్బల్ డాక్టర్‌గా పేరుగాంచిన వేపను 21వ శతాబ్దపు చెట్టుగా ఐక్యరాజ్య సమితి గుర్తించిందంటే వేప ఎంత మేలు చేస్తుందో చెప్పనక్కరలేదు. అందరి రోగాలకు మందులు ఇచ్చే వేప చెట్టును ఇప్పుడు ఒక రోగం పట్టిపీడిస్తోంది.
ఇలా కాపాడుకుందాం..
వేప చెట్లు ఎండిపోవడం ఎందుకు జరుగుతుందంటే ఫోమాప్సిస్ అజాడిరాక్టే అనే శిలీంధ్రమే కారణం. దీనినే కొమ్మ ఎండు తెగులు అని అంటారు. వేప చెట్లలో ముదురు చెట్లు ఈ తెగులు సోకితే మొత్తానికి ఎండిపోతాయి. లేత చెట్లు మాత్రం కొంత వరకూ కాపాడుకోవచ్చు. ముదురు చెట్లకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే చెట్టు చనిపోకుండా ఆపవచ్చు. ఈ శిలీంధ్రం వ్యాపించడం వల్ల ఆకులు ఎండిపోవడం, కాయలు కుళ్లిపోవడం జరుగుతుంది. ఒకసారి ఈ వ్యాధి ఆశిస్తే చెట్టు మొత్తం ఎండిపోతుంది. ఈ శిలీంధ్రం అన్ని పండ్ల మొక్కలకు, చెట్లకు ఆశిస్తుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు తక్కువ ఉష్ణోగ్రతలు, చల్లని వాతావరణం, పెరుగుతున్న కాలుష్యం కూడా ఈ శిలీంధ్రం వ్యాపించడానికి అనుకూలంగా మారుతున్నాయి. అంతేకాకుడు టీమస్కిటోబగ్ అనే పురుగు కూడా ఆశిస్తోంది. దీనివల్ల శిలీంధ్రం త్వరగా చెట్టు బెరడులోకి పోయి పూర్తిగా ఎండిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు లీటరు నీటికి రెండు మిల్లీలీటర్ల ప్రాఫినోఫాస్ మందు కలిపి పిచికారీ చేయాలి. లీటరు నీటికి ఒక గ్రాము కార్బండిజమ్, లేకుంటే మూడు గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కానీ, మూడు గ్రాముల కాపర్ హైడ్రాక్సీక్లోరైడ్‌లను కలుపుకుని పిచికారీ చేయడం వల్ల టీమస్కిటోబగ్ అనే పురుగును నివారించవచ్చు. చెట్టు మొత్తం పూర్తిగా తడిచేలా మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది. లేకపోతే వ్యాధిని పూర్తిగా నివారించలేమని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు.
జీవన ఎరువుల ద్వారా నివారణ
వేప చెట్టుకు శిలీంధ్రం సోకి ఎండిపోతుంది. ప్రకృతి వ్యవసాయ పద్ధతులలో జీవన ఎరువులు వాడడం ద్వారా వేప చెట్టుకు పట్టి ్డన తెగులును నివారించవ చ్చు. దేశి తాజా ఆవు పేడ, ఆవు మూత్రం, నీరు, గుల్ల సున్నం, ఇంగువలతో తయారు చేసిన ద్రావణం ఈ శిలీంధ్ర నాశనానికి బాగా పనిచేస్తుంది. జీవామృతం, గణ జీవామృతం ఉపయోగించి కూడా చెట్టును కాపాడుకోవచ్చు. పూర్తిగా చెట్టు పాడైపోయిన తర్వాత మందులు వాడినా పెద్దగా ఉపయోగం ఉండదు. –ఎలియాజరు,
ప్రకృతి వ్యవసాయ శాఖ డీపీఎం, కాకినాడ
ఫ వేప చెట్లకు కొమ్మ ఎండు తెగులు
ఫ ఎక్కడికక్కడే మాడిపోతున్న వైనం
వ్యవసాయంలో కీలకంగా..
వ్యవసాయంలో వేప చెట్టు కీలకంగా ఉంటోంది. వేప ఆకులు, కాయలను రసాయనాల తయారీకి ఉపయోగిస్తారు. ఎన్నో రకాల చీడపీడలను నివారించడం కోసం వీటి రసాయనాలను వాడుతుంటారు. కీటక నాశినిగా చక్కని సేంద్రియ ఎరువుగా బహుళ ప్రయాజనాల గనిగా రైతులు దీనిని ఉపయోగిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలోనే కాకుండా రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడే చేలకు సైతం వేప నూనెను వాడాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తుంటారు.


