సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో అనధికారికంగా పాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. కల్తీ పాల ఘటన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా అన్ని స్థాయిల్లోని పాల ఉత్పత్తిదారులు, విక్రేతలు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) వద్ద నమోదు చేసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా పశు సంవర్ధక అధికారి టి.శ్రీనివాసరావు, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి కె.సుప్రియలను శుక్రవారం ఆదేశించారు. జిల్లాలో పాలు, పాల ఉత్పత్తులు, మాంసాహార పదార్థాల నాణ్యతపై పర్యవేక్షణను కట్టుదిట్టం చేసేందుకు పశు సంవర్ధక శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో సంయుక్త బృందం ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో లైసెన్స్ లేని పాల విక్రేతలు సుమారు 651 మంది ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. అలాగే, సుమారు 650 మంది ఇంటింటికీ పాలు సరఫరా చేస్తున్నారని, మరో 725 మంది అనధికారిక పాల విక్రేతలు, షాపు యజమానులు, పాల సహకార సంఘాలు లైసెన్స్ లేకుండా పాల సరఫరా చేస్తున్నారని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాల సరఫరా కోసం లైసెన్స్ పొందాలని సూచించారు. లైసెన్స్ లేకుండా పాలు విక్రయిస్తే రూ.5 లక్షల వరకూ జరిమానా విధిస్తామని కలెక్టర్ హెచ్చరించారు. చట్ట విరుద్ధంగా కార్యకలాపాలు కొనసాగిస్తే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే పశుసంవర్ధక సహాయకులు తమ పరిధిలోని పాల విక్రేతలను గుర్తించి, తప్పనిసరిగా పేర్లు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పశు సంవర్ధక అధికారి శ్రీనివాసరావు ఆదేశించారు.
టెన్త్ ఇంగ్లిషు
ప్రశ్నపత్రంపై ఆందోళన
రాయవరం: పదో తరగతి పరీక్షలు గత నెల 16న తెలుగుతో ప్రారంభమై ఈ నెల 2న ఇంగ్లిషు పరీక్షతో ముగిశాయి. ఈ పరీక్షలకు ముందు విద్యా శాఖ అధికారులు 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేశారు. దీనికి అనుగుణంగా అన్ని పరీక్షలూ అభ్యసన స్థాయికి తగినట్లుగానే ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. అయితే ఇంగ్లిషు పేపరు మాత్రం పూర్తిగా స్థాయికి మించి ఉందని అంటున్నారు. బ్లూప్రింట్‌కు డీవియేట్ అయినట్లు ఇంగ్లిషు ఫోరమ్ సైతం ఆరోపిస్తోంది. ముఖ్యంగా 17, 18, 22, 25, 28, 31, 32 ప్రశ్నలు పూర్తిగా సబ్జెక్టుకు డీవియేట్ అయ్యాయని డీజీఈకి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొంది. దీనివలన విద్యార్థులు 15 మార్కులు నష్టపోతున్నారని చెబుతున్నారు. బాగా చదివే విద్యార్థులు కూడా ఇంగ్లిషు ప్రశ్నపత్రం కఠినంగా ఉందని అంటున్నట్లు తెలుస్తోంది. తాము కోల్పోతున్న 15 మార్కులూ అదనంగా ఇవ్వాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి డిమాండ్ వస్తోంది.
‘స్పాట్’కు హాజరు కావాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఈ నెల 6 నుంచి స్థానిక బీవీఎం ఇంగ్లిష్ మీడియం హైస్కూలులో జరిగే పదో తరగతి పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనానికి (స్పాట్) సంబంధిత ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా విద్యా శాఖాధికారి (డీఈఓ) కంది వాసుదేవరావు ఆదేశించారు. బీవీఎం హైస్కూలులో మూల్యాంకనం ఏర్పాట్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. స్పాట్ వేల్యుయేషన్‌కు చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, స్పెషల్ అసిస్టెంట్లుగా నియమితులైన ఉపాధ్యాయులకు సంబంధిత ఉత్తర్వులను లీప్ యాప్‌లో వారి వ్యక్తిగత లాగిన్‌లో ఉవ్చామని తెలిపారు. ఈ ఆర్డర్లను డౌన్‌లోడ్ చేసుకుని స్పాట్ విధులకు హాజరు కావాలని సూచించారు. స్పెషల్ అసిస్టెంట్లుగా నియమితులైన వారికి బీవీఎం హైస్కూల్‌లో శనివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ స్పాట్ వేల్యుయేషన్‌పై శిక్షణ ఉంటుందన్నారు. వారందరూ విధిగా శిక్షణకు హాజరు కావాలన్నారు. స్పాట్ డ్యూటీలు పడిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేసి, వారు సకాలంలో విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించామన్నారు. నిర్దేశించిన అనారోగ్య కారణాలు తప్ప స్పాట్ విధుల నుంచి ఎవ్వరికీ ఎటువంటి మినహాయింపులూ ఉండవని వాసుదేవరావు స్పష్టం చేశారు. ఆయన వెంట అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామ్స్ అమల కుమారి తదితరులున్నారు.
ఫ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐలో నమోదు తప్పనిసరి
ఫ లైసెన్స్ లేకుండా పాలు విక్రయిస్తే
రూ.5 లక్షల వరకూ జరిమానా
ఫ కలెక్టర్ కీర్తి చేకూరి


