దేవరపల్లి: వేసవిలో మూగజీవాల దాహార్తిని తీర్చాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పశువుల నీటితొట్టెల పథకం నీరుగారుతోంది. గత ఏడాది ఉపాధి హామీ పథకం కింద జిల్లాలోని 19 మండలాల్లో సుమారు 79.82 కోట్లతో 225 నీటితొట్టెలు నిర్మించారు. ఒక్కో తొట్టెను 300 లీటర్ల సామర్థ్యంతో, రూ 33,228 వ్యయంతో నిర్మించారు. గ్రామాల శివారున నీటితొట్టెలు నిర్మించి, పంచాయతీ ద్వారా పైపులైన్ ఏర్పాటు చేసి, ఆ తొట్టెల్లో నీరు నింపేలా పశు సంవర్ధక, పంచాయతీరాజ్ శాఖలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. మొదటి ఏడాది అంతంత మాత్రంగానే వినియోగపడిన నీటితొట్టెలు వర్షాకాలం, శీతాకాలంలో మూలన పడ్డాయి. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. చెరువులు ఎండిపోతూండటంతో పశువులు దాహార్తితో అల్లాడుతున్నాయి. నిర్వహణ లేక తొట్టెల్లోనూ నీరుండటం లేదు. దీంతో తాగునీటి కోసం మూగజీవాలు కటకటలాడుతున్నాయి. మరోవైపు నిర్మాణంలో నాణ్యత లోపాలతో పలుచోట్ల నీటితొట్టెలు పగుళ్లు తీసి కారిపోతున్నాయి. పైపులైన్లు పని చేయడం లేదు. ఇప్పటికే మెట్ట ప్రాంతంలో వేసవి తాపానికి భూగర్భ జలాలు పడిపోతున్నాయి. రానున్న రోజుల్లో నీటిమట్టాలు మరింత తగ్గే అవకాశం ఉంటుంది. వేసవిని దృష్టిలో పెట్టుకుని మూగజీవాలకు తాగునీటి వసతి కల్పించాలని రైతులు కోరుతున్నారు.


