ఆ మందులను అధికారులు సిఫారసు చేయలేదు
● దెబ్బతిన్న పొగాకు తోటలను
పరిశీలించిన అధికారులు
● దుకాణంలో మందుల నిల్వ సీజ్ చేసి
నమూనాలు ల్యాబ్‌కు తరలింపు
దేవరపల్లి: గోపాలపురం మండలం వెదుళ్లకుంట, వాదాలకుంట గ్రామాల్లో దెబ్బతిన్న వర్జీనియా పొగాకు తోటలను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. తోటలకు వాడిన మందులు, పంట నష్టం గురించి రైతులతో చర్చించారు. ‘దిగుబడి ఆశలు గల్లంతు’ శీర్షికన సాక్షిలో బుధవారం ప్రచురితమైన కథనానికి వ్యవసాయ శాఖ అధికారులు స్పందించారు. కొవ్వూరు డివిజన్ వ్యవసాయ శాఖ అధికారి సీహెచ్ శ్రీనివాస్, మండల వ్యవసాయాధికారి కూచిపూడి ఏసుబాబు రెండు గ్రామాల్లో దెబ్బతిన్న పొగాకు తోటలను పరిశీలించారు. పొగాకు మొక్క పిలక నివారణకు రైతులు వాడిన మందుల వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా డివిజన్ వ్యవసాయాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు వాడిన మందుల నమూనాలను తీసి ల్యాబ్‌కు పంపామని, ల్యాబ్ నుంచి రిపోర్టు రావాల్సి ఉందని తెలిపారు. మందుల్లో తేడాలు ఉన్నట్టు నివేదికలో తేలితే డీలర్, ఉత్పత్తి సంస్థపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి రైతులు వాడిన బ్యాచ్‌కు చెందిన మందుల నిల్వను దుకాణం నుంచి సీజ్ చేసినట్టు ఆయన తెలిపారు. రైతులు వాడినట్టు చెపుతున్న మందులను వ్యవసాయ శాఖ, సీటీఆర్‌ఐ, ఐటీసీ శాస్త్రవేత్తలు, టుబాకో బోర్డు అధికారులు సిఫారసు చేయలేదన్నారు. రైతులే సొంత నిర్ణయంతో మందులు తెచ్చుకుని వాడారని ఆయన వివరించారు. పిలక నివారణకు వాడకూడని మందులు వాడినందున తోటలు దెబ్బతిన్నట్టు ఆయన తెలిపారు.
ఆ మందులను అధికారులు సిఫారసు చేయలేదు


