13, 14, 15 తేదీల్లో శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు
అమలాపురం రూరల్: మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం అమలాపురం ఆర్టీసీ డిపో నుంచి శ్రీశైలం ఆలయానికి ప్రత్యేక బస్సులు నడుపుతామని డీఎం డీఎల్‌ఎన్ శర్మ తెలిపారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో ఉదయం 9.30, సాయంత్రం 5.30, 6.15, 6.45, రాత్రి 7 గంటలకు ఈ సర్వీసులు నడుస్తాయన్నారు. ఈ బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం ఉందని, ప్రయాణికులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అలాగే 15, 16 తేదీల్లో ఉదయం 5 నుంచి రాత్రి 7 వరకూ ప్రతి గంటకూ కుండలేశ్వరానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తామన్నారు.
భర్త అనుమానం..
మహిళ ఆత్మహత్య
రాయవరం: అనుమానంతో భార్యను వేధించి, ఆమె ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిని మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు మంగళవారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. రాయవరం మండలం సోమేశ్వరం గ్రామంలో పాకలపాటి వీర వెంకట లక్ష్మీదుర్గ ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడుతుందనే అనుమానంతో భర్త మహేష్ తరచూ గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి కూడా ఆమెతో గొడవపడి, సెల్‌ఫోన్ లాక్కున్నాడు. మనస్తాపానికి గురైన లక్ష్మీదుర్గ మంగళవారం ఉదయం 6 గంటలకు ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో నిందితుడు మహేష్‌ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.
బాలుడికి తీవ్ర గాయాలు
అమలాపురం టౌన్: మోటారు సైకిల్ ఢీకొన్న ఘటనలో పాఠశాలకు వెళుతున్న బాలుడు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. పట్టణ ఎస్సై టి.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. అమలాపురం రూరల్ మండలం పేరూరు గ్రామ శివారు ఇంద్ర కాలనీకి చెందిన 11 ఏళ్ల బడుగు భరత్ ఐదో తరగతి చదువుతున్నాడు. అతడు మంగళవారం ఉదయం స్కూల్‌కు వెళుతూ ఇంద్ర కాలనీ వద్ద 216 జాతీయ రహదారిని దాటుతుండగా కె.గంగవరానికి చెందిన రావి రాంజీ మోటారు సైకిల్‌పై వస్తూ బలంగా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్ర గాయాలై అపప్మారక స్థితిలోకి వెళ్లడంతో పేరూరు వై.జంక్షన్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. భరత్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రాంజీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
అన్నవరంలో సిబ్బందికి
అంతర్గత బదిలీలు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానంలో సీనియర్ అసిస్టెంట్ నుంచి రికార్డు అసిస్టెంట్, రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వరకూ 68 మందికి అంతర్గత బదిలీలు నిర్వహిస్తూ దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రసాదం విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పి.లక్ష్మీనారాయణను నిత్య పూజలు, కల్యాణాల విభాగానికి బదిలీ చేశారు. అతడి స్థానంలో కేశఽఖండన శాలలో పనిచేస్తున్న చిక్కాల సాయిబాబాను నియమించారు. అన్నదానం స్టోర్స్ గుమస్తాగా పనిచేస్తున్న బండారు వెంకట రమణను ప్రసాదం విభాగంలో నియమించారు.


